కవితలు జాషువ ఖండకావ్యములు
శ్మశాన వాటిక
భీష్ముడు
రాజరాజుశ్మశాన వాటిక
ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్‌
గన్నుల్‌ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్‌ లేచిరాఁ, డక్కటా!
యెన్నా ళ్ళీచలనంబు లేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్‌!
ఆకాశంబును కాఱుమబ్బుగము లాహారించె; దయ్యాలతో
ఘూకంబుల్‌ చెరలాడసాఁగినవి; వ్యాఘోషించె నల్దిక్కులన్‌
గాకోలంబులు; గుండె ఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
దా కల్లాడిన జాడ లే; దిచట సౌఖ్యం బెంత క్రీడించునో!
ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని-కలము, నిప్పులలోనఁగఱఁగిపోయె!
యిచ్చోట; నేభూము లేలు రాజన్యుని-యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ-సలసౌరు, గంగలోఁగలసిపోయె!
యిచ్చోట; నెట్టిపే రెన్నికం గనుఁగొన్న-చిత్రలేఖకుని కుంచియ, నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు-గజ్జె గదలించి యాడు రంగస్థలంబు;
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ-నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
ముదురుతమస్సులో మునిగిఁపోయిన క్రొత్త సమాధిమీదఁ బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముద ముడివోయినన్‌ సమసిపోవుట లేదది దీప మందుమా?
హృదయముసుమ్మి, నిల్పిచనియె న్గతపుత్రిక, యే యభాగ్యయో!
కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ స్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁ డల కాళిదాస భా
రవు ల శరీరముల్‌ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కదా! కుమ్మరివాని సారెపై
ఆలోకించిన గుండియ ల్గరంగు; నాయా పిల్లగోరీలలో
నే లేబుగ్గల సౌరు రూపఱియెనో! యేముద్దు నిద్రించెనో!
యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?
ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు; విశ్వంభరా
నటనంబున్‌ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్‌జేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్‌
వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలఱాతిగో
రీకడఁ బారవేయఁబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే
యాకటిచిచ్చునన్‌ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ
నోకద! వానికై వగవఁ డొక్కండు; దాఁచదు కాటినేలయున్‌
భీష్ముడు
వృద్ధవీరుఁడ! నీవయస్సెంత చెపుమ?
తండ్రి మరణించియే మూఁడు తరములయ్యె;
నౌర! భారత యుద్ధమధ్యంబునందు
పడుచు పార్థునిఁ దల్లడపరచినావు
కోడెవయస్సు ని న్నలమి గోటికి మీసము చిక్కునాఁడు, ము
య్యేడిరునాళ్ళు పోరు వెలయించిన భార్గవరాముఁ డెంత య
ల్లాడెనో! మూడుగాళ్ళ ముసలయ్యవు; నేఁటి కెదిర్చి కృష్ణుఁడున్‌
గ్రీడియుఁ దల్లడిల్లి; రవని న్నిను గెల్చు మగఁడు పుట్టెనే?
"వెలిమావుల్‌ రుధిరంబు గ్రక్కె; గతిదప్పెందేరు; సంధించు న
మ్ములతో గాండివమూడె; సాఁగవు కరంబుల్‌; బావ! ఆలంబు నా
వలగా" దంచు ధనంజయుండు కనులన్‌ బాష్పంబుల న్నించఁడే?
బలమో! లేక మహత్త్వమో! యిది తలంపన్‌ రాదు గంగాసుతా?
ఆరయ నీవు ధర్మయున కాయువు పట్టెఱిఁగింపకుండినన్‌
శౌరియు, సవ్యసాచి మరునాడు రణంబున నిల్తురే? కృపా
పారగ! నిక్కపుం గినుక పైకొని నీవు ధనుస్సుఁ పట్టినన్‌
నీరయి పోవె లోకములు! నింగి గుంభిల్లునఁ గూలిపోవదే!
అంబ శిఖండియయ్యె; నతఁడాడుది; వాని మొగంబుఁ జూడనం
చుం బరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము గల్గకుండ వి
ల్లంబులు బారవైచితివి యర్జునవీరుని కీర్తి నిల్ప! గం
గాంబిక ధన్యయయ్యెనుగదా! నినుగాంచి; ధనుష్మదగ్రణీ!
గురువు గొడ్డలి ద్రిప్పుకొని తప్పుకొనుదాఁక-మరలి వెన్కరాని మార్గణంబు
ముత్తరంబులనుండి ముదిరి ముద్దలుగట్టి-చేవ డిందని పచ్చి యౌవనంబు
వసు సప్తకము సానఁబట్టి జీవము వోసి-యొసఁగు కక్కసపు టాయుధబలంబు
స్వర్గతరంగిణీ స్తన్యంబు బలిమిని-సంప్రాప్తమైన తేజశ్చయంబు
గవ్వకుం గాని పాడు శిఖండిముందు-వ్యర్థపుచ్చితె పార్థుని పరువుకొఱకు!
జగము నగలించు నీ దివ్యశంఖరవళి-పవ్వళించెనె యమ్ములపడక మీద!
కౌరవుని యాస గంగలోఁ గలసిపోయె;
పరశురాముని వేఁడి నిశ్వాసములకు
నింద్రగిరి క్రాఁగి బూదియయ్యెను గదోయి!
శంతనకుమార! నీ విల్లు జారిపోవ.
రాజరాజు
నిన్నుఁ బోలు మహీనేత నిక్కవముగఁ
బుట్టెనో? పరాశరదివ్యముని సుతుండు
మున్ను, మాతాత పరిహాసమునకుఁ గాను
కల్పనముచేసి వ్రాసెనో? కౌరవేశ!
మాతాత సత్యవంతుండు
పూతములగు నాల్గు వేదములు వ్రాసిన వి
ఖ్యాతకవీంద్రుం; డాతని
చేతికల మబద్ధములు వచింపదు సుమ్మీ!
వ్యాసకల్పిత మహాభారతామ్నాయంబు-గుట్టుగా నిమఁ దిట్టుగొనుచునుండ
ముగురు సత్కవుల పెంపుడు కావ్యరాజంబు-పదిమందిలో బట్టబయలు సేయ
నింతలింతలు సేయు దృశ్యప్రబంధాళి-మొత్తమై ని న్నాడిపోసికొనఁగ
చెప్పుడుమాటకు జెవి యొగ్గు భవనంబు-క్రూరాత్ము డని పండ్లు నూరు కొనఁగ
తొడలు తెగిన బాధతో, నింత దుష్కీర్తి-తోఁ, బరాజయంబు తోడురాఁగ
నరకమునకుఁ బోయినావో? స్వర్గమునకుఁ-జేరినావో? నీవు కౌరవేంద్ర!
నీసావాసముచేసి ముజ్జగముఁ బిండింజేయగాఁ జాలు రా
ధాసూనుం డొక వ్యర్థజీవి యయి నిందాబద్ధుఁడై పోయె; నీ
యాసల్‌ భీముగదాభిఘాతమున నుగ్గై యూరు యుగ్మంబుతో
నీ సింహాసనసీమ దుఃఖపడు చుండె న్నేఁడు కన్నీళ్ళతో!
సవ్యసాచికరాన సాము నేరిచికొన్న-బలమైన కొవ్వాఁడి బానములకు
వాయుసూనుని బాహుబలముతోఁ బోరాడు-మొక్కవోవని పుట్టె డుక్కుగదకు
పాంచాలి నులివెచ్చ బాష్పాంబువులఁ దేలు-వజ్రనిష్ఠుర శాపవాక్యములకు
యమతనూభవుని దీనాలోకములఁ దోలి-దీపించు శీతలాలాపములకు
సకల భువనంబు లాలించి సమ్మతించు-వనజనాభుని శుభ రాయబారమునకు
సమ్మతింపక, రక్త నిర్ఝరములందుఁ-దానమాడితి వేల? గాంధారితనయ!
అంటఁగరాని యగ్ని కెనయైనది ద్రౌపది; యట్టి సాధ్వి వ
య్యంట మొగాన బూని, "యకటా!" యని యశ్రులు రాలనేడ్చినన్‌
దుంటరివై సహోదరులతో సభలోనఁ బరాభవించినా
వంట! మఱందివై వదినకా మొనగానితనంబు సూపుటల్‌!
కురుభూపాలుఁడు బుద్ధిమంతుడని వాకోబూనితింగాని, యా
దరణీయంబులు హేతువు ల్గలుగవద్దా? నీ చరిత్రంబునన్‌
గరళాన్నంబును, మాయజూదమును లాక్షాగేహమున్‌ ద్రౌపదీ
పరిభావంబు భయంకరంబులయి చూపట్టుం గురుక్ష్మాపతీ!
నీయతనంబు లన్నియును నెత్తురుకూడు భుజించి మాయమై
పోయెఁగదా? వృథాపయశముం దలదాల్చిన నీకు నేఁడు నిం
దాయువుఁ బోసినారు కవు లక్కట, పెందొడలూడి, కుంటివై!
యీ యవమానజీవితము నెట్లు సహింతువయా సుయోధనా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - jAShuva - khaMDakAvyamulu ( telugu andhra )