నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
సూత్రధారుడు
రసపిపాసిని నేను పారమ్ము లేని
గగనవీధీ విశాలరంగములయందు
అందగారాని తలపుల కందమైన
రూపములు దిద్ది క్రీడింతు రూపసరసి
తెనుగు సీమలలో నాల్గుకొనలయందు
పూజకై పుట్టి వర్ధిల్లు పూలతోడ
ప్రియతమములైన వలపుకోరికలతోడ
గంధిలంబయ్యె శ్యామల గగనవీధి
ఎన్నడో పూలుపూచె నా హృదయసీమ
కెంపుచివురుల కావేరి కీర్తిలతిక
ఎన్నడో జీవనోద్యాన హృద్యవాటి
కెరలిపాడెను కావేరి కీర్తిపికము
బంధురములైన యానాటి పరిమళములు
పాటలును, రూపములు దాల్చి పల్లవించి
యుగయుగాంతరవ్యాప్త వియోగభరము
మోయు, కావేరి సంపూర్ణమూర్తి దాల్చె
భావవిదులగు రసరాజ్యపాలకులకు
తొలుదొలుత భక్తితోడ చేదోయి మోడ్చి
అభినవమ్మగు రూపక మంధ్రభాష
నర్పణము సేయుచున్నాడ నందికొనుడు.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )