నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
మొదటి రంగము
అగస్త్యుడు:

శృంగారవతీ! ఈ సుప్రభాతమున నెందుకీ తొట్రుపాటు? దేవపూజకై చిదిమిన పూవులు, పల్లవమ్ములు నేలపై రాలిపోయినవే! ఏఱి యిత్తునా?

కావేరి:

నేను శాంతముగనే నడచుచున్నాను. నేలపాలైన పూజాద్రవ్యములు దేవత లభిలషింపరు.
(నిష్క్రమించును.)

అగస్త్యుడు:

ఈ సుకుమారి గడుసుదనమునం దెంత నాజూకు! అరవిచ్చిన సోగచూపులతో శిరీష కుసుమములు చెవి కొనల నందగించి, వేణికానీలములను తడికొనలలో జాఱుముడి వైచి ఉదయవాయువులమధ్య వెనుకకు పరువులెత్తు పైట చెఱగులతో వనదేవతవలె నదే యదృశ్య యైనది! సంధ్యార్చనా సమయములందు ప్రేమకై పరితపించు నా మౌని హృదయము నావేశించిన దీ మూర్తియేనా?

ఆ మోహనమూర్తిపై వియోగరేఖ యేమి? సఖులతో కలిసి యాశ్రమవృక్షముల చక్కబెట్టు సమయమున నీ మునిపుత్రికను మొదట చూచితిని. ఆ ముఖమండలము జన్మాంతర వ్యథా భారమును మోయుచుండెను. ఆనాడే నా హృదయమున కీమె బాంధవియైనది. నా వేదన లన్నియు నొక్కసారి మేల్కొనినవి.

ఉదయకాంతు లవిగో తపోవనవాటికలపై విశ్రమింప జొచ్చినవి. ఆ ప్రాంతమునందలి తమాల వృక్షముల చీకటినంతయు మ్రింగి పసిమిని మాత్రమే మిగిల్చినవి. కుసుమిత లతావళు లన్నియు నానందమున తలలూచుచున్నవి. దూరమున పర్వతాగ్రములపై పవ్వళించిన యా భాద్రపద మేఘశకలము లెంత యుప్పొంగియున్నవి! భూర్జపత్రములపై పురాణపంక్తులు వల్లించి శుష్కమైన నా హృదయ మీ ప్రభాతమున క్రొత్తవేషము దాల్చినట్లయినది. నా యాశాలతల కిది యాలవాలపూరణము.

AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )