నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
రెండవ రంగము
(చారుశీల పూలపేటికగొని ప్రవేశించును.)
చారుశీల: నీలా! నీలా! (అని కావేరిని పిలుచును)
(చిత్రవింద ప్రవేశించును)
చారుశీల: ఎన్నాళ్ళకు వచ్చితివి? కులపతి యాశీర్వచనము నొంది వచ్చితివా, చిత్రా!
చిత్రవింద: ఏదీ, యికపోవలె.
చారుశీల: రానేవచ్చితివి. కొంచెము నా కీపూలు కోసిపెట్టుదు.
చిత్రవింద: ఏమి? ఈ మందారములా? ఒత్తుగాపూయు నీ కొమ్మలపై పూలన్నియు నెవ్వరు దోచుకొని పోయినారో? ఒక్కటియు కనిపించదు.
చారుశీల: ఇంతవరకును ఆశ్రమవాటికయందే దేవమందిర మలంకరించుచుంటిని. సఖీ! కావేరి నేనే పోయివచ్చెదనని యొక్కతెయే పూలన్నియు కోసికొనివచ్చినది. మన కుటీరము నానుకొని మల్లెతీవ లేదు? దానిని ఆశ్రమ హరిణకము ఆకస్మాత్తుగా నల్లరిపిల్లయై దారికడ్డముగా లాగినది. పూలన్నియు తడిసిన తీవకుదిటిలో బడి మలినములయినవి. అది కాళ్ళకుదగిలి కావేరిని నేలపై బడద్రోసినది. అందుకని పూలెక్కువ మిగిలి లేవు.
చిత్రవింద: అవునుగాని, "నీలా" యని పిలిచినా వెవరిని?
చారుశీల: నిన్ను ముద్దుపేరుతో పిలిచితి ననుకొన్నావా?
చిత్రవింద: మరి యెవ రీ యాగంతుకి?
చారుశీల: మన కావేరి.
చిత్రవింద: ఏమిటి?
చారుశీల: మరచిపోయినావా? ఆఁ నేనే మరచినది. నీ వీ యాశ్రమమునుండి ప్రయాణమైనది ఆషాఢ మాసమున కాదూ?
చిత్రవింద: అవును. వెన్నెలదినములలో.
చారుశీల: నిన్ను వీడ్కొలిపినపుడు ధారుణీజనని యన్న మాటలుకూడ నాకు జ్ఞాపకమున్నవి. "చిత్రా! ఆషాఢమాసముననే దిగివచ్చిన శ్రావణనీరదాంగనవలె నీవారు నిన్ను గని యానందింతురు," కాదు?
చిత్రవింద: నిజమేకాని నీలావృత్తాంతమునకు బదులు చిత్రా ప్రయాణమును వర్ణించుచున్నావు.
చారుశీల: అనగా, నీవు వెళ్ళిన మూడు నెలలకు కావేరికి గొప్ప దుఃఖము వాటిల్లినది. ఒకనాడు సప్తవర్ణ వృక్షము క్రింద కావేరి తదేకధ్యానముతో నేదో తిలకించుచు కూర్చుండెను.
చిత్రవింద: అంత దుఃఖము, అంత మౌనతపస్సు ఆ వయస్సునకే యె ట్లలవడినదో?
చారుశీల: అంతలో నేనుగులగుంపువలె మేఘములు పరువు లెత్తుచు ఆకాశమంతయు నాక్రమించెను. ఉరుములతో మెఱుపులతో రమణీయముగ వర్షాలక్ష్మి యవతరించెను. కావేరిని గానక వెదుకుచు తుదకు వర్షధారలు చీరచెఱగుల బడి కాలువలు గట్టుచున్నను కదలక చెఱగిన పాపటతో సగమువంచిన కనుఱెప్పలతో నిశ్చలమైయున్న తనయను 'నీలా! నీలా!' అని పిలిచి బలవంతముగ కవేరుడు లోనికి గొనివచ్చెను.
చిత్రవింద: ఏమి విలక్షణపు పను లీ సుకుమారసఖివి?
చారుశీల: అపుడు నీవలెనే నీలావృత్తాంత మెరుగని నాతో కులపతి యిట్లనియె. సహ్యాద్రి సానువులపై నేను మొదట నీపసికూనను చూచినపుడు శరీరమంతయు పసపు పూవులచే కప్పబడి నీలాల రాశివంటి తలమాత్రము స్ఫుటముగా కనుపించెను. అంతట 'నీలా' అని పిలుచుకొంటిని. ఆ నీలయే నేడు నాకు మరల దొరికినది.
చిత్రవింద: ఈ విచిత్రమెట్లు పరిణమించినది?
చారుశీల: తర్వాత నాలుగుదినములవరకు అతికఠోరముగ నూర్పుల విడచుచు తుద కీనాటికి నిరామయ యయినది.
చిత్రవింద: ఒక్క సంవత్సరములో కావేరి యెంత యెదిగినది? కల్పవృక్షముల నీడలలో వర్ధిల్లువారికైన నింతకాంతి కలదా చారుశీలా? ఆశ్రమము ప్రవేశించుచుండగా నింతకు మునుపే శోకవిహ్వల మగు నామెముఖమును చూచితిని. ఈమె సౌందర్యము మానవసంసారములం దగమ్య మయినట్లు గనపడుచున్నది.
చారుశీల: నిజమే పలికితివి. కులపతి యొక్కనాడు తన దివ్యప్రభావంబుచే నీమె నదీకన్య యని గ్రహించె. ఎఱుగుదువా సహ్యాద్రియం దతిరమణీయమగు నికుంజమున్నదని?
చిత్రవింద: అదేనా, దేవీపంజర మని చెప్పుకొందురు?
చారుశీల: అవును. ఆ నికుంజమున మరల కావేరి యేనాడడుగు పెట్టునో ఆక్షణమే గంభీరనిర్ఘోషముతో నదీరూపమును దాల్చి విశాలదక్షిణాపథమునందలి పల్లీపట్టణములందును, అరణ్యములందును, లీలోద్యానములందును, కేళీమనోజ్ఞముగ సంచరించుచు తుదకు సాగరస్వామి సన్నిధిని శాశ్వతసుఖము ననుభవించునట.
చిత్రవింద: ఎంత చిత్రము!
చారుశీల: చిత్రకే యింతచిత్రముగానున్న నాసంగతియేమి? ఆనాడే కులపతి "ఏమివచ్చినను సరే, నా తనయను ఆ పర్వతప్రాంతములకు పోనీయక కనిపెట్టి యుండవలెను" అని శాసించెను.
చిత్రవింద: తనపుత్రికపై కవేరుని మమకారము ప్రసిద్ధము కదా! ఆమె యానందమునకీ నిరోధ మెందుకు కల్పించెను?
చారుశీల: పుత్రీమోహాతిశయమే ఆతని శాసనమునకు కారణము. శుభముహూర్తమున తానే మంగళ స్నానములతో ఒప్పగించి రావలయునని కులపతి వాంఛ.
చిత్రవింద: దేవతలను ముహూర్తములచే బంధింప శక్యమగునా?
చారుశీల: అవునవును. ఆనాటినుండియు నాకు కావేరి ముఖదర్శనము భయమును విస్మయమును గొలుపుచున్నది. ఎంత ఆలస్యమయినది? నీ విక కుటీరమున కేగి అభినజుల సందర్శింపకున్న భావ్యముకాదు. పద పోదము.
చిత్రవింద: ఈ నదీసుందరికి మన యాశ్రమమునకును ఏటి ఋణానుబంధమో కదా?
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )