నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
మూడవ రంగము
(కావేరి వ్యాకులపాటుతో శీఘ్రగమనముతో ప్రవేశించును)
కావేరి: చారుశీలా! చారుశీలా! అప్పుడే వెళ్ళిపోయినదే! నా బాల్యసఖి చిత్రవింద వచ్చిన దని యా బాలకుడు చెప్పగా విని వచ్చితిని. లేకున్న నింకను ఆలస్యము చేసియుందును.

ఏమో యీనాడు నా తీరంతయు వింతవైఖరి నొందు చున్నది. ఎన్నా ళ్ళీవేదన? నేటితో నంతమొందునంత తీవ్రముగా నున్నది. ఈ సన్ననిశరీర మెంతబరువని మోయగలదు. తరులతారమణీయమైన ఈ పుణ్యాశ్రమమున పంజరశుకివలె వేడియూర్పులతో, వియోగ వేదనలతో ప్రొద్దుపుచ్చుచున్నాను. పాప మా ప్రియసఖి చారుశీల యెంతో విన్నాణముగా నా శరీరముపై నలంకారములన్నియు దిద్దినది. పూవులన్నిటిలో పొందికగలవి కొన్ని యేఱి చెవికొనల దగిలించినది! "నా హృదయసరోజము వాడియున్నది. నాశరీరమున కీ వాడని పూవు లెందుకోయీ?" యంటిని. "సహవాసముచే నీహృదయమును మరల తల యెత్తునని" అని చమత్కరించెను. ఈ ఆశ్రమ జనము నాకు పంచియిచ్చిన యనురాగమునకు బదులుగా నొక పరాగలేశమయినను నీయలేకుంటిని. ఏ యతిదూర సీమ నుండి నన్ను గొనితెచ్చి పెంచిరో నా జననీజనకులు! ఆ సౌభాగ్యసీమపై నా హృదయమునం దెంత యాకాంక్ష బయలుదేరినది? ఆ జన్మాంతర సౌహృదమునకయి నా యవయవములన్నియు శ్రావణ మేఘములను గాంచిన పూల రేకులవలె సంచలించుచున్నవి.

ఆశ్రమదేవతా! నీవైన నావారికి నన్నొప్పజెప్పుము. లేదా, యీ యభాగ్యురాలిని నీ మేలి ముసుగులతో దాచి మాయముచేయుము.
(అగస్త్యుడు ప్రవేశించును)
అగస్త్యుడు: (కావేరిని సమీపించి)
సుకుమారీ! యీ వయస్సునకే యింత దుఃఖమా!
(కావేరి చకితయై వెనుకకు తగ్గును)
అగస్త్యుడు: వయస్వినీ! భీతిల్లకుము. నేను నీ కాప్తుడను. రత్నగిరినుండి పయోధికూలమువరకు శోకార్తు లందఱును నీ కాప్తులే. దుఃఖదేవత యీలోకమున నొకసంసార మేర్పఱచుకొనినది. మన మిరువురము ఆమె సంతానమే.
కావేరి: దేవతలార! న న్నేల మాయముచేయరు?
అగస్త్యుడు: నేనావంకనుండి వచ్చుచు నీ కడసారిమాట లాలకించితిని. ఈయాశ్రమ లక్ష్మియే నీ యాలాపములు విని నన్నిచ్చోటికి పంపినది. నావారని యంటివే వారెవరు?
కావేరి: నిస్సీమమైన యీవిశ్వమందు ఏ చందన తరుచ్ఛాయలనో వారి నివాస మున్నది. అక్కడ కూడ చీకటివెలుతురులున్నవి.
అగస్త్యుడు: ఏదైన గురుతు చెప్పవా?
కావేరి: ఆ యభిరామప్రదేశమునందలి పుష్పముల సౌందర్యమును నాహృదయము మరువలేదు. అచ్చటి వినీలాకాశ వీధులందు నామనస్సు యథేచ్ఛముగ సంచరింపగలదు. దాని నామాక్షరములు మాత్రము నా నాలుకకు రావు.
అగస్త్యుడు: వేదనా విధురములగు నీయింద్రియముల నొకసారి మరపించి అచ్చటి పరిమళములను అచ్చటి యాలాపములను స్మరింపలేవా?
కావేరి: ఆ ప్రయత్నములచేతనే నాప్రాణములు శోషిల్లి పోయినవి.
అగస్త్యుడు: మరచియైనపోలేవా?
కావేరి: ఎన్నిసారులని చెప్పను. నాప్రియసఖులు చూపు ఆదరాతిశయమువల్లను నా జననీజనకుల వాత్సల్యము వల్లను అంతయు మరచియున్న ప్రశాంతవేళలందు ఏపూవు చాటుననుండియో, ఏ మృగాలాపమునుండియో, ఏ యాకాశవీధినుండియో, ఏ వెదురుపొదనుండియో నాకీ యార్తిస్వరము వినిపించి యీ తనువునంతయు నుఱ్ఱూత లూగించును. ఈ విశ్వములోని వస్తురాశియందు ఒక బాలతృణాంకురము సైతము నను మరచిపోనీదు.
అగస్త్యుడు: కవేరదంపతుల యనురాగముచేనైన శాంతింపని యీయావేదన ఎట్టిదోకదా?
కావేరి: ఆకాశవీధులనుండి నే నీ యాశ్రమభూములపై వ్రాలినప్పటినుండియు కులపతియును, నాతల్లియును నా ఆకాశమును నాకర్పింప ప్రయత్నించెడివారు. వారే నాభాగ్య దేవతలు. ఎంత తలపోసినను వారి ప్రేమయందు కొరతయే కనుపించదు. నాహృదయశల్యమును తీసికోవలసినదానను నేనే.
అగస్త్యుడు: కవేరపుత్రీ! ఇదియంతయు మతిభ్రమ కాదుగదా!
కావేరి: అవును. నామాటల కంతకన్న అర్థము లేదుకాబోలు. ఈభ్రాంతి మాన్పుటకే చారుశీల యెన్నిసారులు "నీలా! నీ కాలోచన యెక్కువైనది. కొంచెము నవ్వుట, కొంచెము కోపించుట నేర్చుకొనలేవా!" అని యనలేదు?
అగస్త్యుడు: సత్యమే పలికినది చారుశీల.
కావేరి: సత్యమేనా? సత్యమేనా? ఈ యభాగ్యురాలి కిక కోరదగినది లేదా?
అగస్త్యుడు: లేకేమి! ఈయశేషభూవలయమందలి రమ్యవస్తువు లన్నియు నీవు కాంక్షింపదగినవే. నీ హృదయమం దెచ్చటనో మణగియున్న దుఃఖమును నీలిముసుగువలె మడతలు విప్పి యీప్రపంచముపై పరచికొంటివి. నీకన్నుల కగపడు శ్యామలాకాశమునకును ఈయాకాశము నకును పోలిక లేదు. మధ్య నొక తెర వ్రేలియున్నది. అది నీచేతులతో లేవ నెత్తుము. నామాట వినుము.
కావేరి: (సంభ్రమముతో) నీమాటలతో నాహృదయము శాంతించినది! నేను నీ కాప్తుడ నంటివికదా! నిజమేనా? కావేరి కరుణాలాపము లింకను కొంతసే పోపికతో వినగోరుదువా?
అగస్త్యుడు: జన్మ జన్మాంతరములకైన నీ కథామృతము నాకు విసువు పుట్టింపదు. నీ బాధావిముక్తికై యేదైన నుపాయము తోచెనా?
కావేరి: చూచితివా ఆ సహ్యాద్రిశిఖర పంక్తిని? ఎంత అందమైన పర్వతములు.
అగస్త్యుడు: ఈసానువుల సౌందర్యము నెందరెందరో వర్ణింపగా వినియుంటిని. అచ్చటి తరులతా ఫలకుసుమ రమణీయములగు నికుంజముల నొకసారి చూచిరావలయునని నా కభిలాష.
కావేరి: నాయభీష్టము నదియే. యెఱుగుదువా ఆ పర్వతము లెంతదూరమున నున్నవో?
అగస్త్యుడు: సంధ్యావిహారములం దచ్చటికి పోయి రావచ్చును. అంతగా దూరము లేదు.
కావేరి: అట్లైన నా జన్మస్థానము అంతదూరము కాదు.
అగస్త్యుడు: ఏమంటివి! సహ్యాద్రి నీజన్మస్థానమా? ఏమి విలక్షణపు హాస్య మిది?
కావేరి: అగస్త్యా! నాకథ యంతయు ముగియవచ్చినది. కడపటి వృత్తాంతము వినుము. ఆపర్వతములే నాహృదయమునం దపారవేదనను మేల్కొల్పినవి. అవియే న న్నపూర్వప్రేమతో "రా! ర"మ్మని నిరంతరమును పిలుపనంపుచు నిశ్చలముగ నేటివరకును దూరముననే నిలిచి యున్నవి. ప్రొద్దు పొడిచిన మొదటిగడియలలో స్నానమాడ నాశ్రమద్వారముల నుండి వానిపై చూడ్కులు నిగిడ్చి నపుడు ఱెక్కలువచ్చిన పక్షులవలె నాప్రాణములన్నియు నా నల్లని కొండలపై తేలిపోవును. ఆ ప్రాంతముల కొకసారి నన్ను గొంపోదువా?
అగస్త్యుడు: కావేరి! ఇంత మనోవేదనతో నీవిన్నినా ళ్ళెట్లూరకుంటివి? ఇంతమాత్రమున సమసిపోవు నీ దుఃఖమును నిర్లక్ష్యముగా నిన్నినాళ్లేల వర్ధిల్ల నిచ్చితివి! ఆనందముగా గడపదగిన నీ నవ యౌవనము నేల యింత సంతాపపెట్టితివి?
కావేరి: నావారందరు నాకడ్డము వచ్చిరి.
అగస్త్యుడు: పోవలదని శాసించిరా?
కావేరి: ఏదో రహస్యశాసన ముండెనేమో! కాని నా నెచ్చెలులు, నాతలిదండ్రులు, నాకు కావలసిన వారందరును వారించి ఏనాటికానాడు నాకోరిక త్రోసిపుచ్చి నాకేదియు దెలుపలేదు. తుదకీ రహస్యవృత్తము నాకీ ప్రపంచమునందు జీవనాశ్రయమైనది. నావెంటవత్తువా ఆపర్వత ప్రాంతములకు?
అగస్త్యుడు: ఈయనంతసృష్టియం దే యజ్ఞాతభాగములకైనను శ్యామలములగు నీ చేలాంచలముల కనులార గాంచుచు రాగలను. నేటి సాయంత్రమే మనప్రయాణము.

కావేరీ! నీ మోహనమూర్తికి ఉపాయనముగా నీ పుష్పమును స్వీకరింపుము. (అని తన యుత్తరీయము నుండి పూవును తీసియిచ్చును.) ఇది నా చేతులార నీరుబోసి పెంచిన తీవయిల్లాలి తొలికాన్పు. నీ సావాసమును కొంత అనుభవింపనిమ్ము.
కావేరి: అగస్త్యా! ఈ పూజాద్రవ్యమును నాతలపై ధరించి ధన్యనయ్యెదను. నేను నీ కొక మందారమును కోసి యిత్తును. (అని పూవును కోయబోయి కొమ్మ లందక కాలు జారి యగస్త్యుని చేతులలో వ్రాలిపోవును. అగస్త్యుడు చెక్కిలి ముద్దాడును.)
(లోపలనుండి) నీలా! నీలా!
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )