నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
నాలుగవ రంగము
(అగస్త్యుని సహాధ్యాయుడగు సావర్ణి ప్రవేశించి కావేరి యగస్త్యునిచేతులలో వ్రాలియుండుటను చూచి వెనుకకు తగ్గును. కావేరి నిష్క్రమించును.)
(సావర్ణి ప్రవేశించును.)
అగస్త్యుడు: ఈ యాశ్రమమున బాలహరిణములుసైత మంత భయపడవే, నీ వేల చకితుడవైతివి?
సావర్ణి: నిజ మిది యాశ్రమమే. ఈ ముహూర్తమున మాత్రము అంతఃపురమా ఆశ్రమమా యని విచారింప వలసివచ్చినది.
అగస్త్యుడు: ఆశ్రమములో అంతఃపురములుండునా?
సావర్ణి: ఓహో! నీ వుపన్యసింపవలసినవార్త లనేకము లున్నట్లున్నవి. కానీ చెవియొగ్గి వినియెదను. (కొంచెము సమీపించి) కులపతి జీవనసర్వస్వమగు కావేరి యెడల ననార్యుడవై యీ యపచార మేల చేసితివి?
అగస్త్యుడు: ప్రేమచేత.
సావర్ణి: అది యెటువంటిది?
అగస్త్యుడు: నా హృదయకటాహములన్నియు నామె ప్రేమామృతముచే నేడు తెగిపోయినవి. నేటితో నేను విముక్తుడ నైతిని.
సావర్ణి: చిన్ననాటనుండియు నిన్నెఱుగుదును. అప్పటిచేష్ట లన్నియు నీ పర్యవసానమునే సూచించినవి కాబోలు!
అగస్త్యుడు: అవును. చిరకాలమునుండి, చిరజన్మములనుండి యీ యావేదన నా హృదయము నావేశించి, నా యాహార విహారములందు, విద్యావ్యాసంగములందు నా చిత్తశాంతి నపహరించినది. ఇంతవట్టు నిజమే. కావేరియే నాయాశాఫలము.
సావర్ణి: ఈ యాశ్రమవాటికలందు విలాసార్థమై నీవు పెంచిన పూలతోటలందు నీ యుత్సాహమునకు కారణము రమణీశృంగారమేనా?
అగస్త్యుడు: ఇన్నాళ్ళనుండియు నీవు నాకు పరమాప్తుడ వనుకొంటిని. ఇంతదూరస్థునివలె ప్రసంగించెద వేమి?
సావర్ణి: ఈ కావేరి యుదంతము న న్నెంతో దూరమునకు గొనిపోయినది. కామినీకళంకితములైన యీ సంసార బంధములపై నీ కెట్లు మమకారము కుదిరినది? మునివృత్తి కిది మాలిన్య మని నీ వొప్పుకొనవా?
అగస్త్యుడు: తాపసు లంత ప్రబుద్ధులా? వారి కీ లోకమున బంధములే లేవా?
సావర్ణి: శతసహస్రము లున్నవి. లేకున్న నీతపశ్చరణమెందుకు? ఈ కఠోరవ్రతము లెందుకు?
అగస్త్యుడు: కాంతాసంబంధ మా శతసహస్రములలో చేరదు కాబోలు!
సావర్ణి: కామినీ కాంచనములను బ్రహ్మచర్యవ్రత సమయములందే నిర్జించి యంతకన్న బలవద్విరోధులను జయించుటకై ముముక్షువులు తపోవృత్తి నభిలషింతురు.
అగస్త్యుడు: కీర్తి యనునది కాంత. ముక్తి యనునది కాంత. ఈ చతుర్దశభువనములకును అధిష్ఠానదైవము కాంత. ఆమె యీ సమస్తసృష్టిజాలమును తనచీరచెఱగుల చాటున దాచి రక్షించుచున్నది.
సావర్ణి: కీర్తికాంతకును, కులపతిపుత్రికయగు కావేరికాంతకును ఎంత సామ్యమున్నది?
అగస్త్యుడు: నాప్రేమకును, నీవు నా కారోపించిన క్షుద్రకామనమునకును ఎంత సామ్య మున్నదో అంత.
సావర్ణి: నీహృదయమునం దీ యారాటము నింకను స్ఫుటముగ వర్ణింపగలవేమో చూడుము. నీ ధోరణియంతయు నయోమయముగ నున్నది.
అగస్త్యుడు: అది అనుభవైకవేద్యము.
సావర్ణి: పోనిమ్ము. నీసాధనక్రమము విపరీతముగా నున్నది కదా! అట్లే నీ యుపాస్యదైవముకూడ ఏ యసంభావితరూపమునో, యే యశ్రుతపూర్వమగు నామమునో తాల్చి యున్నది కానోపును. నీ వారాధించు దైవ మెట్టిది?
అగస్త్యుడు: రసదేవత. ఆమెకు రసమయి, ఆనందమయి యని రెండే పేరులు.
సావర్ణి: నీ వీలోకమున రసదేవతాసామ్రాజ్యమును నిర్మింపనెంచితి వన్నమాట!
అగస్త్యుడు: ఈ లోకమును, మిగిలిన పదుమూడులోకములును ఆమె రాజ్యములోనివే.
సావర్ణి: ఈ యపోహలన్నియు నెప్పటికిని విడువనేర వన్నమాట!
అగస్త్యుడు: సావర్ణీ! ఇంత నిష్ఠురముగ నెందుకు పరిహాసము చేసెదవు? నీ మిత్రుని హృదయక్లేశమును తగ్గింపగల మాట నొకటైన నాడకపోతివి.
సావర్ణి: కావేరీస్నేహమును నిర్మూలింపుము. ఆశ్రమ విరుద్ధమగు నీ చిత్తవృత్తిని మరల్చుకొనుము. లేకున్న నీకారణముగ కులపతి విశుద్ధజీవితమునకు కళంకము రాకమానదు.
అగస్త్యుడు: కవేరపుత్రికపై యనురాగము తెచ్చిపెట్టుకొనునదికాదు. విశ్వమంతయు పాలించుతల్లియే నాయందా రాగోదయమును మేల్కొలిపినది. ఆమెయే దానిని నిర్మూలింప సమర్థురాలు.
సావర్ణి: చిరకాలసాహచర్యముచే నార్జించిన మైత్రివలన నింకొకసారి చెప్పెదను విను. నా హితవాక్యములు మధురముగ లేవనిమాత్రము నిందింపకుము. కావేరీవృత్తాంతము నీ వవశ్యము మరచిపోవలసినదే.
అగస్త్యుడు: నా యార్తికథను సావధానముగ నాలింపుము. నేడు నా హృదయము అనన్యతుల్యమగు తేజోరాశిచే నిబిడమైయున్నది. ఈ నిండుదినమున నా నిర్వేదభారమంతయు నాప్తుడవగు నీ సన్నిధానమున నివేదించుకోవలయు ననుకొంటిని. విశ్రాంతియెఱుగని నా మమస్తాపమును తగ్గించుకోదలచితిని. కాని యెన్నడును లేని కాఠిన్యమును వహించి నన్ను వేధించుచున్నావు.
సావర్ణి: అంతమాత్రమున నీ తోడిబాంధవ్యము వదలు కొనలేను. నీ శ్రేయోభిలాషయే నా వాక్కుల కింత కాఠిన్యము నారోపించినది.
అగస్త్యుడు: ఎన్నడో నే నీయాశ్రమమునకు మొదట వచ్చినపుడు అస్పష్టమగు లీలామానుషవిగ్రహ మొకటి చంద్రికాయామినులందు కుసుమితోద్యానములందు తనశీతలమగు దృష్టిని నాపై బరపుచుండెను. ఆనాట నుండియు నా సకలేంద్రియములును ఆ విచిత్రానుభవమునకై యెదురు చూచినవి. జీవనమార్గమందు నే నేర్పరచుకొనిన లక్ష్యము లన్నియు నా యదృశ్యమూర్తి యాగమనముచే నదృశ్యములయ్యెను. నా కులము, శీలము, మర్యాద తుదకు నా స్వభావమంతయు ఉదయ భానునివలె క్షణక్షణము నొక క్రొత్తరూపమును దాల్చి సంపూర్ణముగ మాఱిపోయినది.
సావర్ణి: ఈ భేదమును నీ వెన్నడును తెలిసి తర్కించుకొనలేదా?
అగస్త్యుడు: నాయనుభవము నంతయు నొక్కముఖమునకు దెచ్చుకొని నాలో నే నన్వయించుకొంటిని. ఈ యాశ్రమకవాటములను తెరచి యనంతమగు విశ్వవీధీసంచారమునకై నాజీవనలక్ష్మియె న న్నాహ్వానించిన దనుకొంటిని. ఈయాశ్రమము నాస్వేచ్ఛాజీవనమునకు చాలదు. అందుకే యిచ్చటి నియమములను, బంధములను వదలించుకొనుచున్నాను. నా యింద్రియములతో వైరము సాధించి వానిని క్లేశపెట్టజాలను. వానిసాహాయ్యమున నాయుపాస్యదైవము నన్వేషింతును.
సావర్ణి: వయస్యా! నాకెంత ఖేదమును తెచ్చిపెట్టితివి? ఈ విపరీత వృత్తాంత మెట్టి పరిణతి నొందునో కదా!
అగస్త్యుడు: సావర్ణి! నిన్నర్థించి యడుగుచున్నాను. నన్నాశీర్వదింపుము.
సావర్ణి: ఎల్లప్పుడును నీ శ్రేయస్సు నే కాంక్షింతును.
అగస్త్యుడు: నీతో నొకమాట చెప్ప మరచితిని.
సావర్ణి: ఈశుష్కవాక్యములతో నామనసు విఱిగిపోయినది. వెనుకటివలె నేదైన వార్తచెప్పుము.
అగస్త్యుడు: కాదు. నే నీసాయంకాలము కావేరితో సహ్యాద్రికి వెళ్ళివచ్చెదను.
సావర్ణి: (విసువుతో) అచ్చట నేమున్నది?
అగస్త్యుడు: కావేరికి చూడవలెనని యున్నది.
సావర్ణి: (మఱింత విముఖుడై) నే పోయివచ్చెదను.
(నిష్క్రమించును)
అగస్త్యుడు: నాయారాటము కొంత శాంతించినది.
(నిష్క్రమించును)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )