నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
ఐదవ రంగము
(కావేరి ప్రవేశము.)
కావేరి: విశ్వపతీ! ఎన్నాళ్లని యాలసించెదవు? నీకై యీ హతభాగిని పదునెనిమిదేండ్లు కనిపెట్టుకొని యున్నది. బాలసూర్యునివలె ప్రఫుల్లమగు రథమునకు సారథివై వచ్చి "అదిగో వచ్చుచున్నాడు. అవే అతని రథనేమిధ్వానములు" అని కర్ణరసాయనముగా నెన్నడు విందును? సంధ్యాకామిని చెంగావిచీర కొంగులతో నలసట వాపుకొనుచు, అస్తమయవేళలందా నీవువచ్చునది? లేక, నీయుత్తరీయము నుదయవాయువులలో తీరికగా సవరించు కొనుచు నానాప్రసూనవాసనలచే గంధిలములగు తొలిగడియలందే రాదలచితివా? ఈ రెండువేళలను పాటింపక ప్రళయ నిశీథమం దొంటరివై తేజస్వివై, తరులతాపల్లవచ్ఛాయలు వెలిగించుచు నడచివచ్చెదవా? ఎన్నడో లీలగా కనుపించిన నీరూప సౌభాగ్యమునకై కడచిపోయిన దివారాత్రములన్నియు దాటి ఆ మొదటిసాక్షాత్కారమును స్మరింప ప్రయత్నించితిని. అంతయు విఫలము కావలసినదేనా?

కాదు. కానేరదు. నీ వీనాడే వచ్చెదవని నేనెఱుగుదును. అగస్త్యకుమారుని యనురాగమే నాకీవిధమంతయు దెలిపినది. అవును. నీవే నాయొద్ద కతని నంపితివి? నా యింద్రియము లన్నియు నీతోడి సౌఖ్యమునే యాచించుచున్నవి. నాప్రాణములు ఱెక్కలు వచ్చిన పక్షులవలె నీ సందర్శనమునకై యెగిరిపోవున ట్లున్నవి.

ఆ వచ్చుచున్నది నాచెలికత్తెలేనా? చిత్రవింద యెంత యుల్లాసముతో మాటలాడుచు వచ్చుచున్నది!
చారుశీల: నీలా! నీకై యెంత వెదకివచ్చితిమి! ఎందుకని మా సాంగత్యము నిట్లు త్రోసిపుచ్చుచున్నావు?
చిత్రవింద: వేటకాని తప్పించుకొనితిరుగు లేడిపిల్లవలె వృక్షమునుండి వృక్షమునకు నికుంజమునుండి నికుంజమునకు కావేరి సంచరించుచున్నది. మే మే మపచారమొనరించితిమని నీవి ట్లొనర్చితివి!
కావేరి: మీరు వలదన్నను నే నీవేళ మీ వెంటవత్తును. నాకంత సంతోషముగా నున్నది.
చారుసీల: కావేరీ! నీకొక శుభవార్త చెప్పవచ్చితిమి.
కావేరి: ఏమని?
చారుశీల: ఱేపు నీజన్మదినము. ఆశుభసమయమును పండువుగా జరుపవలయునని కోరి కులపతి వలయుసన్నాహమంతయు సేకరింప మాకాజ్ఞయిచ్చెను.
చిత్రవింద: నీలకు వలసిన శరీరాలంకారములన్నియు నేనే సమకూర్చెదను. సన్నని వలువలతో పూవులతో రాణివాసములందలి రమణీమణులవలె నలంకరించెదను. ఆశ్రమదేవతకు కావేరిపై నెంత యనురాగమున్నదో ఱేపుకదా తెలియును. కావేరి స్వయముగా నీరార్చి పెంచిన మాలతి యేమాత్రము పూలు పూయునో చూతము.
చిత్రవింద: చక్కని పెండ్లికూతురివలె నేనును అలంకరింపవలె ననుకొంటిని.
చిత్రవింద: అట్లయిన అనుకూలుడగు వరునికూడ విచారించితిరా?
చారిశీల: వరునితో పనేమున్నది? ఏ చక్రవర్తియో కులపతిసందర్శనమునకై వచ్చి యామెతో తన యంతఃపురమున కెగిరిపోవును.
కావేరి: (అన్యమతితో)
అప్పుడు మిమ్ములనుకూడ నావెంట కొనిపోవుదునులే.
(కొంచెము నిదానించి)
వేళయైన ట్లున్నది.
చారుశీల: ఏవేళ?
కావేరి: సూర్యు డస్తమించువేళ యైన ట్లున్నది.
చిత్రవింద: చక్రవర్తి వచ్చునా లేదా యనియా విచారించుచున్నావు.
చారుశీల: కాదు. కావేరి మరల నేదో మనకు తెలియని విచారములో మునిగి ఏదివ్యమూర్తిని ధ్యానించు చున్నదో?
కావేరి: నాగోడునుగూర్చి చింతించిన మీకింత భీతి యెందుకు? ఏమియు నమంగళము జరుగదు! నాధ్యానమున కేమిలే. కాని, నీవంటివే ఆ దివ్యమూర్తి నాకు సాక్షాత్కరించెను.
చిత్రవింద: నిజముగానా?
కావేరి: అమృతము నతిశయించిన మాధుర్యమును వెదజల్లు వజ్రఖండములవలె శక్తివంతములగు నతని వాక్కులు నా హృదయమం దెన్నడును వినియెఱుగని యానంద గానమును మేలు కొల్పినవి. చూడని ప్రదేశములు కన్నులగట్టినట్లయ్యెను. మరచిన మధురాలాపములు మరల జ్ఞాపకమునకు వచ్చెను. ఎన్నిసారులో ప్రయత్నించి పలుకనేరని నా యూహలన్నియు నతడు లలితములగు మాటలతో పొందికగా నిమిడ్చి చెప్పెను. అంత ప్రభాపూర్ణములయ్యును, చిత్రా! నీ యాలాపములవలెనే అతని యాలాపములును మధురములై యుండెను. అతని సాంగత్యము చేసినప్పటినుండియు, నాకు రానున్న యుదంతమెల్ల ముందుగా గోచరించునట్లున్నది. ఈ నా తలంపులు సత్యములైనచో నీనాడె నా దుఃఖము మాయమగును. భువనము లన్నిటిని నల్లుకొనిన నా యాశాలత తప్పక నేడే పుష్పించును. నిశ్చయము.
చారుశీల: నీ మాటలు చిత్రముగా నున్నవి.
చిత్రవింద: కావేరి నెఱుగని దానివలె నీవేల చిన్నబోయెదవు? ఱేపటి పండుగముచ్చట లేవైన చెప్పుము.
చారుశీల: నీలా! కులపతియభీష్టమును సలక్షణముగ నెరవేర్ప నెంచితివా? లేదా?
కావేరి: కులపతికోరిక నాకోరికలన్నియును నెరవేర్తును. నీకై యెవరో వేచియున్నట్లున్నది. అటుచూడుము.
చారుశీల: మునికుమారుడగు సావర్ణియా! నేనొకింత మాట్లాడి వచ్చెదను. చిత్రా! కావేరితో వెళ్ళిరమ్ము.
(చిత్ర, కావేరి నిష్క్రమింతురు)
సావర్ణి: చారుశీలా! నీతో నొకమాట.
చారుశీల: ఋషిపుత్రునికి వందనములు.
సావర్ణి: ఏమైన విశేషవార్త లున్నవా?
చారుశీల: ఏమున్నది! ఱేపు కావేరి పుట్టినదినము. కులపతి యాజ్ఞ శిరసావహించి యందుకు వలయు సామగ్రి సేకరించుచున్నాను. కాని నాయుత్సాహము క్షీణించినది.
సావర్ణి: కారణము?
(చారుశీల సందేహించును)
సంశయింపకుము. నాకీవార్త ముఖ్యముగ చెప్పదగినది. ఆలసింపకుము.
చారుశీల: కావేరి మిగుల నస్వస్థతగా నున్నట్లున్నది. ఎవరో దివ్యమూర్తి యనురాగముతో దన్ను బలుకరించెనని చెప్పినది. ఆతని సందర్శించినంతనే తనకోరిక లన్నియు నేడే ఫలించునని చెప్పినది. ఏమి కోరికలో? ఏమి ఫలించుటయో? అంతయు వైష్ణవమాయవలె నున్నది. ఆ దివ్యమూర్తి యెవరో?
సావర్ణి: మానవతుల మనోవృత్తములు మాబోంట్ల కెట్లు తెలిసికొనవచ్చును? దానికేమి. నాకీవిషయ మెఱుంగ జెప్పుము. మీసఖి సహ్యాద్రిపర్వతప్రాంతముల కేగ గూడదని ఏదైన శాసన మున్నదా యేమి?
చారుశీల: అది కడు రహస్యము.
సావర్ణి: అజ్ఞానముచే నట్లనుచున్నావు. నేటితో నీ రహస్యము తన యంతర్గళముల నన్నింటిని విప్పి నిండార పుష్పించి యన్నిదిక్కులకు వ్యాపించును. నన్ను కారణము మాత్ర మడుగవద్దు. అంతయు నివేదింపుము.
చారుశీల: కావేరి యొకనదీకాంత. సహ్యాద్రిపర్వతములందలి దేవీపంజరమను నికుంజమున కామె కాలుపెట్టిన తోడనే నదీరూపము దాల్చునట. మమకారముచే కావేరి నింకను కొన్నినాళ్ళీ యాశ్రమవాటియం దుంచవలయునని కులపతి రహస్యము శాసించినమాట నిజమే.
సావర్ణి: నే నిక పోయివచ్చెదను.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )