నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
ఆరవ రంగము
(ఆశ్రమ ప్రాంతస్థలము. సంధ్యాసమయము.)
(ఋషిబాలకు లిరువురు పాడుచు బ్రవేశింతురు.)
బాలకులు: పూవుపొడితో పసుపుబూసుక
కావియిగురుల కాంతు లద్దుక
త్రోవ లెఱిగిన చరణములతో
     రావె! సంధ్యాకామినీ!

ఉదయకన్యలు కలశములతో
పిదికి పంపిన యాలమందల
పొదుగులను క్షీరముల నింపితి
     గదవె! సంధ్యాకామినీ!

పచ్చిమాలతి యాకుమడుపులు
గ్రుచ్చి వేసిన పూలదండలు
తెచ్చియుంచితి మొక్కమా రిటు
     వచ్చిపో! సంధ్యాంగనా!

నల్లనల్లని కలువదండల
నెల్లదిశలను నిదుర నెలతలు
అల్లిపోవక మునుపె యమృతము
     చల్లిపో! సంధ్యాంగనా!

ఎవరిపై నీవలపు నిలిపితి?
వెవరికై యీపారవశ్యము?
భువనభువనము లెల్ల తిరిగెద
     వవుర! సంధ్యాకామినీ!

ఉదయమున వెలిచీరచాటున
కొదమసంజల కావిముసుగున
పొదలునది నీవొకతెవేనా?
     ఉదయ సంధ్యాకామినీ!
బాలుడు-1: అరే యీయాశ్రమములో నందఱికన్న నెవరు మంచివారు?
బాలుడు-2: కులపతి.
బాలుడు-1: ఆయనతప్ప తక్కినవారిలో?
బాలుడు-2: అగస్త్యుడు.
బాలుడు-1: సావర్ణి మాత్రము మంచివాడు కాదేమి? (నవ్వును)
బాలుడు-2: అతడెప్పుడు ముడుచుకొని కూర్చుండును, అదేమి పాపమో!
బాలుడు-1: ప్రొద్దున నేను సమిధలకై పోయి యా పని ముగియకమునుపే ప్రక్కనున్న దానిమ్మపండ్లను అందుకొనలేక కొమ్మలు వంచుచుంటిని. అగస్త్యు డాదారిగా బోవుచు నాకవి కోసి యిచ్చి, పలుకరించి, తనత్రోవను బోయెను. అంతట నవి యారగించుచు నక్కడ చదికిల బడితిని. ఇంతలో సావర్ణి సమీపించి నా చెవి మెలియ బెట్టెను. ధూమశిఖవలె తల గిఱ్ఱున తిరిగిపోయినది. నోటినుండి సగమునమిలిన దానిమ్మపండ్లరసము నెత్తురుబొట్టులవలె రాలినది.

ఎన్నాళ్ల నుండీయో అతనికి తగిన శాస్తి చేయవలెనని నాకోరిక. కాని ఆయన యెదుటబడగానే నోటివెంట మాటరాదు.
బాలుడు-2: నీ బదులు నేనే చేసితినిలే. మెల్లగా ధైర్యము తెచ్చుకొనియంటినిగదా - "సావర్ణీ! పుట్టీ పుట్టుట తోనే నీవింత పెద్దవాడవైనావా? నీవుకూడ ఎప్పుడోఒకప్పుడు చిన్నవాడవై యుండలేదా?" ఎప్పుడో ఒకప్పుడు నీవును పెద్దవాడవై యుండలేదా? - యని న న్నెట్లనగలడు? అందుకని ఏమియు తోచక మిఱ్ఱిచూచి పోయెను.
బాలుడు-1: అదిగో! ఆవచ్చునది సావర్ణియే. నీమాటలు తప్పక వినియుండును. అతడు కన్నులతో వినగలడు. నీకు శిక్షతప్పదు.
సావర్ణి: (సమీపించి) మీకు అగస్త్యు డిప్పు డెచ్చట నున్నది తెలియునా?
బాలకులు: (ఇరువురును కలిసి) ఆఁ చూపించెదము.
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )