నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
ఏడవ రంగము
(పశ్చిమాభిముఖుడై యగస్త్యు డొకవృక్షమూలమున నిలిచియుండును.)
సావర్ణి: (ప్రవేశించి) నీకొకశుభవార్త నెఱింగింప వచ్చితిని.
అగస్త్యుడు: (సంభ్రమముతో) శుభవార్తయా?
సావర్ణి: అవును. సంతోషవార్త మాత్రము.
అగస్త్యుడు: అది యెన్నడో త్యజించితిని. నాజీవనము ధన్యమగు మార్గమే నే నన్వేషించుచున్నాను. నాకు సంతోషముతో పనిలేదు.
సావర్ణి: అదియును చేకూరదు.
అగస్త్యుడు: ఎందువలన?
సావర్ణి: కావేరి నేటితో నస్తమించును గనుక. ఇత రారాధనము లన్నిటిని చాలించి, యేమూర్తి సన్నిధానమున నీఫలకుసుమ పల్లవములన్నియు సమర్పించితివో, ఆమూర్తి నేడే నిన్ను విడనాడి పోవును.
అగస్త్యుడు: సావర్ణీ! నీ వాక్యములు సుదూరమునుండి వినవచ్చు మేఘగర్జనములవలె వింతగా ధ్వనించుచున్నవి. నీ మాటలయందలి యర్థమంతయు నాకు వినిపింపుము.
సావర్ణి: కావేరి మనుష్యకాంతకాదు. నదీకన్య. దైవవశమున నీ యాశ్రమవాటికయం దిన్నాళ్ళు పెరిగినది. అచిరముననే నీవు పోనున్న సహ్యాద్రియం దొక నికుంజమున్నది, ఆ ప్రదేశమున నడుగుబెట్టినతోడనే మనుష్య రూపమును విడనాడును. ఇక నీ వా నదీతరంగములను ప్రేమింతువా? సహ్యాద్రినుండి సాగరమువరకును ప్రవహించు నా మహావాహినియందు కావేరిహృదయ మెచ్చటనున్న దని పలుకరించెదవు? నీ బాహులతలయం దిమిడియున్న మధురరూపము నీ భుజబంధములను త్రెంచివైచి దక్షిణాపథమంతయు వ్యాపింపగలదు. నీ ప్రేయసి పల్లవాధరము ఏ పూదోటలచెంత ప్రతిఫలించునో, నిబిడమగు నామె వక్షస్థలము ఏ యేకాంత సీమయందు మంద మందముగ లేచి వ్రాలుచుండునో, తీయని యామె యూరుపు లే వెన్నెలరాత్రులందు నీకై సంచారముసేయునో యెట్లెఱుంగుదువు? మాఱు పలుక వేమి?
అగస్త్యుడు: నాహృదయము శిథిలమైనది. సావర్ణీ! నాత్రోవ నన్ను బోనిమ్ము!
(నిరుత్తరుడై యాలోచించును.)
సావర్ణి: అగస్త్యా! ఆలోచింపుము. దీర్ఘముగ నాలోచింపుము. నే నేగుచున్నాను.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )