నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
ఎనిమిదవ రంగము
అగస్త్యుడు: నా జీవనయాత్రయం దీ దినము విశ్రాంతిసమయమను కొంటినిగదా! ఈనాడే దుర్గమములగు దేశాంతరములకు మరల బయలుదేరవలసినదేనా?

ఈసహ్యాద్రిప్రయాణమే లేకున్న నేమగునో? అట్లయిన కావేరి నాకేల బాంధవియగును? తన యభీష్టము నెఱవేఱుననియే మనుష్యుడ నగు నన్ను కామించినది. నా పుణ్యములు ఫలించుటకై, నా కాంక్షాగ్ని చల్లాఱుటకై యీ ప్రథమ సమాగమమే నాకు చాలును.

కావేరీ! ఏ రసావేశస్థితియందు విధాత నిన్ను నిర్మించెనో! పాట విశ్రమించిన కోకిల కుహూస్వరములచే నిబిడమైన యుద్యానమువలె, నీ యాకారము సంపూర్ణమై యున్నది. ఆ మోహనాకృతి, మేళవించిన పల్లకివలె, యెన్ని మధురాలాపములు పలుకలేదు?

ప్రేయసీ! నీవు నదీకాంతవా? ఇన్నాళ్లనుండియు రమణీయమగు రమణీరూపమున బంధింప బడియున్న నీవు విశ్వరూపమునుదాల్చి దక్షిణాపథమునందలి పల్లీ పట్టన ప్రాంతముల విహరింతువో? నేనును ఆ మహారూపమును సందర్శించుటకే కుతూహలపడితిని. కానిమ్ము. ఈరాత్రి చేతులార నిను పోగొట్టుకొందును. నీ రాకకై వేచి, నీ మంగళగానము సేయుటకై యెందఱు ధ్యానదేవతలు, యెందఱు వనలక్ష్ములుత్కంఠతతో నున్నారో! నా నిశ్చయము కుదిరినది. నిన్ను తప్పక సహ్యాద్రికి గొనిపోవుదును. నీ వియోగము సహించి యుండుట కీరాత్రి జన్మజన్మముల మఱపురాని నీమూర్తి నవలోకించిన జాలును.

కావేరి వచ్చువేళ యైనది. ఇక పోవలయును కావేరి సాగరమునకు, నేను నిర్జనారణ్యములకు.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )