నాటకములు నదీసుందరి అబ్బూరి రామకృష్ణరావు
తొమ్మిదవ రంగము
(సహ్యాద్రి - చంద్రోదయము.)
అగస్త్యుడు: మెల్లమెల్లగా నడుగువెట్టుము. దారియందలి నిమ్నోన్నతము లంతగా కనుపించుటలేదు. చంద్రునకును మనకును మధ్యగా నీయున్నతములగు సాలవృక్షములు పెట్టనిగోడలై వెన్నెలల కడ్డమువచ్చుచున్నవి.
కావేరి: అదిగో ఆవైపున కేగుదము. అచ్చటి నీడ లంత దట్టముగా లేవు. అవిరళచ్ఛాయలమధ్య బాలచంద్రుని చెంగావిరంగులుపడి, వ్రాతపనిచేసిన చక్కని తివాచీలవలె నా ప్రాంతమున శాద్వలము లెంతతీరుగానున్నవి!
అగస్త్యుడు: అలవాటుపడని నీపాదము లీదూరభారముచే కందియుండును. ఒకగడియ సేపీ శిలావేదికపై విశ్రమింతుమా?
కావేరి: మునిపుత్రుల సహవాసముచే నంతదూర మనిపించలేదు. కాని నాకును కొంత సేదదీర్చుకొన వలెనని యున్నది.
(ఇరువురును విశ్రమింతురు. వెన్నెల లంతకంతకు విప్పారి యన్నివైపుల నల్లుకొనును.)
అగస్త్యుడు: చంద్రోదయముచే నీ పర్వతము లన్నియు తెరయెత్తిన ట్లొకక్షణములో ప్రత్యక్షమై యెట్టి వేషమును దాల్చినవి! ఈ సుందరవస్తువు లన్నిటిలో నీ ముఖమండలమెంత చూడదగి యున్నది!
కావేరి: అవధి యెఱుగని కాలమునం దేనాడును మాసిపోని యానందానుభూతిని నాకు సమకూర్చితివి. చెలికాడా! నిన్నేమని కీర్తింతును?
అగస్త్యుడు: ప్రేయసీ! కావేరీ!
కావేరి: (ఒకింత చంచలయై) ఏమి యాకంఠస్వరము!
అగస్త్యుడు: కావేరీ!
కావేరి: ఎంత మధురముగ నాహ్వానించితివి! నా నామాక్షరము లన్నిసారు లుచ్చరించితి వెందులకు? వాని కతీతమగు సంశయ మేదియో నిన్ను వేధించుచున్నది. తప్పక నా కెఱింగింపుము.
అగస్త్యుడు: నీ నామాక్షరములయం దంత మాధుర్యమున్నది. నా యాహ్వానమున కాదు.
కావేరి: నీ విదివర కెన్నడును ఇంత భీరుడవుకాలేదు.
అగస్త్యుడు: అచిరముననే నీవు నన్నెడబాసి పోదువనుకో.
కావేరి: నా జీవనదాతవు, నా జీవనపతివి అగు నిన్నా నే నెడబాయుట?
అగస్త్యుడు: మాటవరుస క ట్లనుకొనుము. నీ యదృష్టదేవత ని న్నెడబాపుననుకొనుము.
కావేరి: లోకాలోకములం దెవరును నన్నును నాప్రాణప్రియుని విడదీయజాలరు.
అగస్త్యుడు: ఒకవేళ.
కావేరి: నెచ్చెలీ! యేమని చెప్పుదును? నిశ్చయముగ వియోగమే వచ్చుననుకొందును. అట్లైన నీలోకమునందున్నను, లోకాంతరమున కేగినను, ఈ శరీరముతో నున్నను, రూపాంతరమును స్వీకరించినను, బ్రహ్మాండమునంతయు చీల్చుకొని వచ్చి నీ పాదము లాశ్రయింతును. కామినీకాముకుల కాప్తుడగు నీ చంద్రుడే నాకు సాక్షి.
అగస్త్యుడు: (కావేరిని కౌగిలించుకొని) కావేరీ! నీ యమృతాలాపము లాలించి చిరంజీవి నయ్యెదను. ఈనాడు నీవిచ్చిన యానందపాత్ర, నీవియోగము యుగయుగాంతరములు పట్టినను నన్ను పోషింపగలదు.
కావేరి: మాటలతో మరచిపోతిమి. సుధాలంకృతమగు ప్రాసాదము వలె మన కెదురుగా ఆ కనుపించు సౌందర్యరాశి యేమిటి?
అగస్త్యుడు: అదియేనా దేవీపంజరము?
(ధ్యానమగ్నుడై కొంతతడ వూరకుండును.)
కావేరి: ఇంకను అలసట తీరలేదా? ఇంకను విశ్రమింతమా కొంతతడవు? మారు పలుక వేమి?
అగస్త్యుడు: నాకిక విశ్రాంతి యక్కరలేదు. అంతటి దురాశ నా కెందుకు?
కావేరి: నా ప్రాణప్రియున కేదియో మరల వాటిల్లినది.
అగస్త్యుడు: (దిగ్గునలేచి) ప్రేయసీ! నా సంశయములన్నియు తీరినవి. నేను సంసిద్ధుడనై యున్నాను. పోదము రమ్ము. నిన్నాహ్వానించి చిరస్మరణీయమగు నొకక్షణకాలము నీకాతిథ్యమిచ్చుటకై యేదేవియో యీ నికుంజమును నిర్మించినది. అతి దూరసీమలనుండి నీ కాహ్వానపత్రికలు తెచ్చి, మలయ వాయువులు పర్ణపుటము లందలి మర్మర ధ్వనులతో చదివి చెప్పుచున్నవి! పోదము రమ్ము.
(ఇరువురును కొంత దూరము నడచి)
కావేరి: ఇచ్చటి పుష్పవాసన లెంత సాంద్రముగా నున్నవి!
అగస్త్యుడు: వాడిపోయిన పూలవాసన లన్నియు వచ్చి యీ రమణీయకుంజమున విశ్రమించును కాబోలు.
కావేరి: ప్రాణప్రియా! నా శరీరమందలి ప్రతి యణువును అతి వేగముగ తిరుగుచున్నది. శతకోటి ఖండములై యీ భూభాగమునందు చెదిరిపోవునట్లున్నది. నాకాశ్రయమిమ్ము.
(అగస్త్యుని చేయూతగా రెండడుగులు నడచి, నికుంజమున కాలువెట్టి నిష్క్రమించును. అంతట ప్రచండమగు జలప్రపాతమువలె ధ్వని యగును. అగస్త్యుడు నిర్విణ్ణుడై నిలిచి యుండును. లోపలనుండి "జీవన పతీ! ప్రతి సంవత్సరమును ఈ దినము నీకై వేచి యుందును" అని శ్రావ్యమగు కంఠధ్వని వినిపించును.)
అగస్త్యుడు: ఇప్పటికివి నా ప్రియురాలి కడసారి మాటలు.
(నిష్క్రమించును.)


(వనకన్యలు, ఉద్యాన దేవతలు, లతా కన్యలు చేరి పాడుదురు.)
కావేరి దేవేరియై వచ్చె నేడు
తరులతలార! పోదాము రా రమ్మ!
పూవులు బూయరే! పూదీవెలార!
ఫలము లందీయరే! ఫలతరులార!

ఆరతులెత్తవే! ఆరామదేవి!
పద్యాలు పాడవే! ఉద్యానలక్ష్మి!
మొగలిపూపొడితోడ మ్రుగ్గులువెట్టి
జాజిమొగ్గలతోడ పూజలు వ్రాసి
గోరింటగుత్తులు తోరణాల్‌ గట్టి
పొరుగువారలతోడ ప్రొద్దుపుచ్చేము
తరులతలార! పోదాము రారమ్మ!

పొలిమేర పొలములు పులకరింపంగ
దిక్కులన్నిటిలోన దివుటదీరంగ
దేవతలందరు తేరిచూడంగ
కావేరి కరుణించి కదలి వచ్చేను
తరులతలార! పోదాము రారమ్మ!

వచ్చేటిదారిలో వరుసగా నిల్చి
పాలవెల్లులు గట్టి పందిళ్లు తీర్చి
పిలిచి కావేరిని పలుకరించేము
పాపకర్మములెల్ల పారదోలేము
కావేరి దేవేరియై వచ్చె నేడు
తరులతలార! పోదాము రారమ్మ!
AndhraBharati AMdhra bhArati - nATakamulu - Nadisundari - Abburi Ramakrishna Rao - Nadisumdari ( telugu andhra )