నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
చతుర్థాంకము - మొదటి రంగము.

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.)
కమ:- (కాగితము చుట్టి కట్టిన ఛాయాపటము పట్టుకొని ప్రవేశించి) ఎప్పుడో మేడమీఁదినుండి యేమఱుపాటుగఁ జూచుటయేకాని సూటిగ నెన్నడుఁ జూచియుండలేదు. అందువల్ల ముందు నేను జూచి ఆవెనుక నక్కకుఁ జూపెద. (అని కట్టువిప్పి; పటమును బయికి దీసి, పరికించి) సెబాసు! చేసికొన తగ్గవాఁడే.
ఉ. కన్నులు చాల పెద్దయవి; కన్బొమలుం గడుఁదీర్చి దిద్దిన
ట్లున్నవి; సోగయై తనరుచున్నది నాసికయున్‌, లలాట మ
త్యున్యతమై యెసంగుఁ; గురు లొత్తనియే యనవచ్చు; జాలు నీ
వన్నెయు నన్నిటం దగినవాఁడె లభించెను నేఁటి కక్కకున్‌.
(బిగ్గఱగా) అక్కా! అక్కా! ఒక్కసారి యిటు వచ్చితివా- నీకొక చక్కని తాయము చూపెద!
కాళిం:- (చఠాలునఁ బ్రవేశించి) ఏమా తాయము?
కమ:- (పటము దాఁచి) ఒకచిత్రము చూపిన నా కేమిచ్చెదవే?
కాళిం:- అబ్బా? చంపక అదేమో చెప్పవే?
కమ:- చెప్పితినిగా చిత్రమని.
కాళిం:- ఎవరి చిత్రము?
కమ:- బావది!
కాళిం:- ఏ బావది?
కమ:- ఇంకేబావ! అయిదువేల అయిదువందల బావ! ఇదుగో చూడు! (అని పటమును జూపఁబోవును.)
కాళిం:- (తొలఁగి) చాలు, చాలు! చూడనక్కఱలేదు! కొంపతీసి చూచినందులకుఁ గూడ సుంక మీయవలె నేమో!
కమ:- సుంక మిచ్చి యైనఁ జూడఁదగిన యందమే యక్కా!
కాళిం:- అందమున కేమిలే అయిదువేల అయిదువందల కిమ్మతుగల బొమ్మ కాపాటి యందమైన నుండకుండునా?
కమ:- అంతబెట్టు కూడ దక్కా! అఱకంట నైన నీయంద మొక్కసారి చూడుము! (అని మరలఁ పటమును జూపఁబోవును.)
కాళిం:- (త్రోసివేసి తప్పించుకొని) అబ్బా! అంతకంతకు నీ యాగడ మధిక మగుచున్నది సుమా! అంత యందగాఁ డని తోఁచినచో హాయిగ నీవు పెండ్లియాడుము!
కమ:- ఔ నౌను! ఎక్కడను మగఁడు దొరకని యెడల నక్కమగఁడే దిక్కను సామెత యుండనే యున్నది గదా? ఇరువురము నింటఁ బడి తిని, ఇచ్చిన సొమ్మునకు వడ్డీయైనఁ గిట్టించుకొందము.
కాళిం:- లేదా యిరువురము నీళ్ళబిందెలు మోసి యింటి వెచ్చమయినఁ గడుపుదుము.
కమ:- హాయి హాయి! ఆముక్క యందముగా నున్నదే!
కాళిం:- సరి కాని ఆ పటము నీకెట్లు వచ్చినది?
కమ:- శుభలేఖలలో వేయించుటకై మొన్న మన ఫోటోలు తీసిన నరేంద్రునిచేత నాన్నగారు తీయించినా రఁట.
కాళిం:- వ్యవహార మప్పుడే శుభలేఖల వఱకు వచ్చినదా?
కమ:- రాదా మఱి, ముహూర్త మింక మూడు వారములే గదా యున్నది? అరుగో నాన్నగారు వచ్చుచున్నారు.
కాళిం:- (ఒక నిట్టూర్పు విడిచి, లోపలికి జక్కఁబోవును.)
పురు:- (చరచర చావడిలోనికి వచ్చును)
కమ:- నాన్నగారు! నరేంద్రుఁ డీ ఫోటో యిచ్చి వెళ్ళినాఁడు.
పురు:- (చూచి) సరే, నీయొద్ద నుంచుము. మీయమ్మ యేమి చేయుచున్నది? (అని పడకకుర్చీలోఁ కూలఁబడును.)
కమ:- ఇదిగో యిచ్చటికే వచ్చుచున్నది. (అని నిష్క్రమించును.)
భ్రమ:- అదే మట్లున్నారు? ఎక్కడికి వెళ్ళినా రింతసే పయినది?
పురు:- ఎక్కడికని చెప్పుదును? ఊరంతయుఁ దిరిగి వచ్చినాను!
భ్రమ:- అంత త్రిప్పుట కిప్ప డవసర మేమి వచ్చినది? కమల సంగతి ప్రస్తుతము కట్టిపెట్టఁ దలఁచితిమిగా?
పురు:- అందులకుఁ గాదే, అప్పుకొఱకు. కట్నముసొమ్ము ముందు పంపినగాని కార్యసన్నాహ మారంభింపమని లింగరాజుగారు వర్తమాన మంపినారు. అందుచేత, బదులుకొఱకు బయలు దేరినాను.
భ్రమ:- ఎక్కడనూ జూడలే ది దెక్కడి పద్ధతి? కట్నమన, కళ్యాణ సమయమున నిచ్చునదికాని లంచమువలె, రహస్యముగా నింటికిఁ దీసికొనిపోయి యిచ్చునదియా?
పురు:- లింగరాజుగారి సంగతి యెఱిఁగియు వెఱ్ఱిపడెదవేమి? అయిన నీ పాడుపని యందఱిలో జరుగుటకంటె నిదే మేలు.
భ్రమ:- అందుల కిప్పు డయిన పని యేమి?
పురు:- అప్పు బుట్టుట యెంతకష్టమో అది తెలుసుకొనుట యైనది.
సీ. మానాభిమానముల్‌ - మాపుకో వలయును
    విసుగును గోపంబు - విడువ వలెను
సమయంబుఁ గనిపెట్ట - సంధింప వలయును
    త్రిప్పిన ట్లెల్లను - దిరుగ వలెను
నీవె దేవుఁడ వని - సేవింప వలయును
    ఇచ్చకంబుల మురి-యింప వలెను
బ్రోకరు రుసుమును - బొడిగింప వలయును
    దరి గుమాస్తాగానిఁ - దనుప వలెను

నాల్గురె ట్లేని యాస్తిక-న్పఱుప వలెను
వడ్డి యెం తన్నఁ దలయొగ్గ - వలెను; షరతు
లేమి కోరిన శిరసా వ-హింప వలెను
పుట్టునెడ నప్పటికిఁ గాని - పుట్ట దప్పు.
భ్రమ:- ఇంతకు, మన కెచ్చటనైనఁ బుట్టినట్లా?
పురు:- పుట్టినచో నీ పురాణ మంతయు నెందులకు? ఆ పదియెకరముల భూమిమీఁదను అయిదువేలకంటె నిచ్చువా రగపడలేదు.
భ్రమ:- మనకుఁ గావలసిన దెంత?
పురు:- అయిదువేల యైదువందల కట్నము గదా? ఆమీఁద వానికొక యైదువందలైనఁ గావలయును గదా? ఎటు చూచిన మొత్త మేడువేలయిన లేకున్నఁ కార్యము జరిగి గట్టున బడలేము.
భ్రమ:- అందుల కేమి యాలోచించినారు?
పురు:- అయినమట్టున కమ్మివేయుటకు నిశ్చయించుకొన్నాను. కాని యదిమాత్ర మంత పయిపయి నున్నదా? అమ్మబోయిన నడవి, కొనబోయిన కొఱవి యన్నట్లు యేడువేల యైదువందలకన్న నెఱ్ఱని యేఁగాని పెట్టువా రగపడలేదు. పాపము పేరయ్యగా రీవిషయమునఁ బడుచున్న పాట్లకు మేరలేదు.
భ్రమ:- అరుగో మాటలోనే యాయనయు వచ్చినారు.
పేర:- (వగర్చుచు బ్రవేశించి) బాబూ, తమవద్ద శలవు పుచ్చుకొని యింటికి వెళ్ళేసరికి అదృష్టవశాత్తూ మా అల్లుడీపూట రైల్లో వూడిపడ్డాడు. సందర్భవశాత్తూ ఇతనితో సంగతంతా చెప్పవలసి వచ్చింది. అతగాడు విని విని "మాఁవా; అటువంటి గృహస్థుల కీలాటి సమయములో అడ్డుపడడం కంటె కావలసిం దేమిటి? ఇంకో అయిదువందలు వేసి ఆపొలం నాపేర వ్రాయించం" డన్నాడు. ఆపాటున బ్రతుకుజీవుడా అని ప్రాశనకూడా చెయ్యకుండా పరుగెత్తుకు చక్కావచ్చాను. ఏమి శలవు?
పురు:- సెలవున కేమున్నది? చెడి యమ్ముకొన్నను బదియెకరములకుఁ బదివే లయిన రాకపో వనుకొన్నాను. ఎక్కడను టెక్కనప్పు డేమి చేయఁగలము? పోనిండు, అన్యులకుఁ బోవుటకంటె, మీ యల్లున కగుట నాకధిక సమ్మతము. దస్తావేజు వ్రాయుంపుఁడు.
పేర:- దస్తావేజు వ్రాయించడమే కాదు, తక్షణం రిజిష్టరీ కూడా కావాలి. ఏమో అతగాడికి మళ్ళీ యేంబుద్ధి పుట్టునో యెవరు చెప్పగలరు? క్షణంలో దేవతార్చన చేసుకొని చక్కావస్తాను. తమరుకూడా భోజనంచేసి, దానికి సంబంధించిన కాగితాలన్నీ తీసి వుంచండి. శలవు. (అని పోవుచుఁ దనలో) అదృష్టమనగా యిదీ అధమం రెండువేలయినా లాభిస్తాయి. ప్రస్తుతం అల్లుడుపేర వ్రాయించి, పదిరోజులు పోయాక ఫిరాయించుకుంటాను.
పురు:- ఏమే స్నానమునకు లేవ వచ్చునా?
భ్రమ:- లేవ వచ్చును గాని, యీ పదియెకరముల భూమియుఁ బోయినచో నిఁక మన బ్రతుకు తెర వేమిటి?
పురు:- వెఱ్ఱిదానా! యెంత మాటాడితి వే!
సీ. కూలి నాలియు లేక - కుడువ తోవయు లేక
    మలమల పస్తులు - మాడువారు
ఇల్లు వాకిలి లేక - యిల్లాలు లేక, యే
    చెట్టు నీడనొ నివ-సించువారు
పయిని పాతయు లేక, - పండఁ జాపయు లేక
    వడవడఁ జలిలోన - వడకుఁవారు
కాళ్ళుఁ గన్నులు లేక, - కదల మెదల లేక
    దేవుఁడా! యనుచు వా-పోవువారు

కలరు మనదేశమునఁ గోట్ల - కొలఁది నేఁడు
వారినెల్లర నెపుడుఁ గ-న్నాఱఁ గనుచు
పందలంబోలె మన మికఁ - బ్రతుకు టెట్టు
లనుచుఁ జింతింప వచ్చునే - యజ్ఞురాల!
భ్రమ:- నిజమే, నిజమే!
సీ. ఱాతిలోఁ గప్పను - రక్షింపఁగల తండ్రి
    బొరియలోఁ జీమను - బ్రోచు తండ్రి
గంగలోఁ జేఁపను - గాపాడఁగల తండ్రి
    మంటిలో నెఱ్ఱను - మనుచు తండ్రి
పుట్టలోఁ జెదలను - బోషింపఁగల తండ్రి
    కలుగులో నెలుకను - గాంచు తండ్రి
నాభిలోఁ గ్రిముల క-న్నము పెట్టఁగల తండ్రి
    పేడలోఁ బురుగును - బెంచు తండ్రి

భూజములకెల్ల నీరము - పోయు తండ్రి
శిశువుతో స్తన్యముం దయ - సేయు తండ్రి
దయయె స్వస్వరూపంబుగాఁ - దనరు తండ్రి
మనలఁ బోషింపఁడే వెఱ్ఱి-మాట గాక!
(తెర పడును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)