నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
చతుర్థాంకము - రెండవ రంగము.

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.)
(ప్రవేశము: భ్రమరాంబ, కాళింది.)
భ్రమ:- అమ్మాయీ! యీ పూఁట నీ వన్నమునకు రాలే దేమి?
కాళిం:- ఆఁకలి లేకమ్మా!
భ్రమ:- అ దేమే ! యేపూఁట కాఁపూఁట యాకలి లేదని మొదలు పెట్టినావు. పెండ్లి తలపెట్టఁగానే పెండ్లికూఁతుల కెక్కడలేని కళయు వచ్చును. నీవే మిట్లు నీళ్ళు కారుచున్నావు?
కాళిం:- అమ్మా! అడిగితివి కనుకఁ జెప్పుచున్నాను. ఈ పెండ్లి నాకిష్టము లేదే!
భ్రమ:- అ దేమీ? ఆ పెండ్లికొడుకు నచ్చలేదా యేమిటి?
కాళిం:- పెండ్లికొడుకు కాదు, పెండ్లియే నచ్చలేదు.
ఆ. మీకుఁ గులము లేద? - మాకు రూపము లేద?
యింత దైన్యమునకు - హేతు వేమి?
కట్న మిచ్చి వరుని - గడియించుకొనుకంటె
జిన్నతనము వేఱె - యున్న దమ్మ?
భ్రమ:- ఇంతియే కద, యీ దురవస్థ యిపుడు మనకే పట్టినదా?
ఉ. కొంచెముపాటి వారలను - గొంపలు గోడులు నమ్మియేనియున్‌
సంచులు చంకఁ బెట్టుకొని - సంతకుఁ బోయినయట్లుఁ బోయి శో
ధించి బిగించి తండ్రులు వి-ధించిన విత్తము ముందె చేతిలో
నుంచియ కాదె తెచ్చుకొను-చుండిరి కూఁతుల కిప్డు భర్తలన్‌.
కాళిం:- అగుఁ కాక. మనముకూడ వారినే యనుసరింపవలెనా?
గీ. అడుగువారికిఁ బాప భ-యంబు లేక
యిచ్చువారికి సిగ్గును - నెగ్గు లేక
నడచుచున్నట్టి వర శుల్క - నాటకమున
నకట! మనమును బాత్రల - మగుట తగునె?
భ్రమ:- కాక చేయవలసిన దేమి?
ఆ. అప్పుకన్నఁ నల గ-యావళీ దక్షిణ
కన్న, పన్ను కన్న - గన్నతండ్రి
తద్దినంబుకన్న - తప్పనిసరి యయి
యున్న దిపుడు కట్న - మన్ని యెడల.
కాళిం:- అమ్మా! అ దేమన్నమాట?
చ. తిరముగ నింటిముందుఁ బెను-దేవళముండఁగ మ్రొక్కుబళ్లతోఁ
దిరుపతి కేగినట్లు కుల-దీపకు లెందఱొ లేమిచే వివా
హ రహితులై కనంబడెడు - నప్పుడు వారిని రోసి కట్నమే
పరువుగ నెంచువారికయి - పర్వు లిడం బనియేమి వచ్చెనే?
భ్రమ:- తెలివిమాలినదానా! నీవిప్పటి దేశకాలపాత్రముల సంగతి తెలియక మాటాడుచున్నావు!
ఆ. పిండిబొమ్మ యైనఁ, - బిల్ల నిచ్చెద మనఁ
గానె చేయిచాచుఁ - గట్నమునకు;
ఇట్టితరిని గట్న - మీయకుండఁగఁ బుస్తె
కట్టువరుఁడు జగతిఁ - గానఁ బడునె?
కాళిం:- పోనిమ్ము. లోకమంత గొడ్డుపోవునప్పు డీలొచ్చు పనికంటె వివాహమే విసర్జింపఁ గూడదా?
గీ. కట్నమే కోరి వచ్చిన - ఖరముతోడ
తగుదునని కాఁపురము సేయు - దానికంటెఁ
బెండ్లియే మానుకొని మగ-బిడ్డ వలెనె
తల్లిదండ్రులకడ నుంట - తప్పిదంబె?
భ్రమ:- అవివాహితయగు నాఁడుబిడ్డ యింటనుగల తల్లి యవస్థ అమ్మా! నీకిపుడేమి తెలియును?
సీ. పెరవారి పిల్లకు - వరు డేరుపడె నన
    మనపిల్ల కెవ్వడో - మగఁడటంచు
పరుల పిల్లల పెండ్లి - పరికించు నపుడెల్ల
    మనపిల్ల కెప్పుడో - మను వటంచు
ఎదుటి యింటికి నల్లుఁ - డేతెంచినపుడెల్ల
    మనయల్లుఁ డెపు డింట - మసలు ననుచు
పొరుగింటి పిల్ల కాఁ-పురము విన్నపుడెల్ల
    మనపిల్ల కెట్టిద-బ్బునొ యటంచు

ఆఁడుబిడ్డ జనించుటే - యాదిగాను
బుస్తె మెడ బడువఱకు మా-పులును బవలుఁ
గుడుచుచున్నను గూర్చున్నఁ - గునుకుచున్నఁ
దల్లి పడుబాధ తెలుపఁగఁ - దరమె బిడ్డ?
కాళిం:- అమ్మా! యిన్ని బాధలు పడి పెంచిన బిడ్డను ఇట్టి లంచగొండులకుఁ గట్టబెట్టుటకంటె నవమాన మిం కేమున్నదే?
భ్రమ:- అయ్యవమాన మాలంచ మాసించు వారికిఁగాని మనకేమి?
కాళిం:- అదేమన్నమాట?
గీ. త్రాగువా రుంట చేతనే - తాళ్ళగీత;
కొనెడువా రుంట చేతనే - గోవుల వధ;
పోవువా రుంట చేతనే - భోగవృత్తి;
అట్లె, ప్రోత్సాహమే హేతు - వన్నిటికిని.
భ్రమ:- (వినుట నభినయించుచు) ఆఁగు మాఁగుము. అదిగో! మీ నాన్నగారు కావలయును దలుపు తట్టుచున్నారు. ఆఁ! వచ్చె వచ్చె. (అని నడచి తలుపు తెఱచుట యభినయించును.)
పురు, పేర:- (ప్రవేశింతురు.)
భ్రమ:- వెళ్ళిన పని యైనదా?
పేర:- అవడంలో అఖండ దిగ్విజయంగా అయింది. ఆ రిజిష్టారుముండాకొడుకు చేతులో అయిదురూపాయల నోటూ పెట్టగానే, అదివరకు వచ్చినవార్నందర్నీ వెనకబెట్టి అరగంటలో తేల్చేశాడు.
పురు:- పెండ్లికొడుకు ముడుపు పేరయ్యగారిచేతఁ బంపివేయ మనెదవా? అదేమి నీ వట్లున్నావు?
భ్రమ:- కాళింది నా కీ పెండ్లి వల దని కావలసినంత గందరగోళము చేయుచున్నది! ఏమి చెప్పినను దానితల కెక్కుట లేదు!
పురు:- అదేమీ?
భ్రమ:- కట్న మిచ్చి వరునిఁ దెచ్చుకొనుట గౌరవహీన మని. ఆనవాయత లట్టెపోవునా? మీ పోలికలు పుణికి పుచ్చుకొన్నందులకు మీ తిక్కయే దానికిని బట్టుకొన్నది!
పురు:- నాతిక్క నాబిడ్డలకుఁ గూడ నంటుకొనుట నా కానందమే కాని, భగవంతుఁడు ప్రతికూలుఁ డయినందున మాతిక్కతీఱు మార్గము మాత్రమే లేకపోయినది! ఏదీ యెక్కడనున్న దొక్కసారి యిటు పిలువు.
కాళిం:- (తలవంచుకుని ప్రవేశించి) ఇదిగో యిక్కడనే యున్నానండి.
పురు:- (దగ్గఱకుఁ దీసికొని, తల నిమురుచు) అమ్మా! మీయమ్మతో నేమో యన్నావఁ టేమిటి!
కాళిం:- అమ్మతో నన్నమాట మీతోఁగూడ ననుటకే వచ్చినాను. నాన్నగారు! నాయెడ మీకు నిజముగాఁ బ్రేమ యున్నదా?
పురు:- అమ్మా! నీ కట్టి సందేహ మేల కలిగినది?
కాళిం:- ఉన్న యెడల -
ఆ. కూఁతు రనుచుఁ బరుల - చేతిలోఁ బెట్టక
కొడు కటంచు నన్నుఁ - గొంపలోనె
యుంచుకొనుఁడు, మీరు - పెంచ లేకున్నఁ, గ
ష్టించి మిమ్ము నేనె - పెంచు దాన.
పురు:- (గడ్డము పుడుకుచు) వెఱ్ఱితల్లీ! బిడ్డను బెరవారి కిచ్చుట ప్రేమలేక కాదు. మఱే మందువా!
ఆ. ఆఁడుబిడ్డ యెపుడు - నన్యుల సొత్తౌట
దానివారికడకు - దానిఁ జేర్చు
భారమెల్లఁ దండ్రి-పై నుండుఁ గావునఁ
దండ్రి ఱాతిగుండెఁ - దాల్ప వలయు!
కాళిం:- నాన్నగారు! నా కీ పెండ్లి యెంతమాత్రము నచ్చ లేదు! ఎందుచేత నందురా?
గీ. కట్న మర్పించి వరునిచేఁ - కంఠమునకుఁ
బుస్తె కట్టించుకొని తృప్తిఁ - బొందుకంటెఁ
దనకుఁ దానుగ ముప్పేట - త్రాటితోడఁ
గంఠమున కురి యిడుకొంటె - గౌరవంబు!
పురు:- (చటాలున గౌఁగలించుకొని) నాతల్లి! నాతల్లి! నా కడుపునఁ బుట్టి, నాకు బుద్ధి చెప్పగలదాని వైనందులకు, నా యాయువు గూఁడ బోసికొని బ్రతుకుము!
చ. సొరిదిగ హెచ్చుచున్న వర-శుల్క విపద్దశ మాన్పఁబూని, బి
ట్టఱచితి వేదికాస్థలుల, - నాడితి బెక్కు సభాంతరంబులం,
బఱబఱ వ్యాసముల్‌ బరికి - పత్రికలం బ్రచురింపఁ బంపితిన్‌,
హరహర! నీదుపాటి తెగు-వైనను లేక భ్రమించితిం దుద\న్‌!
భ్రమ:- సరి సరి! చక్కఁగానే యున్నది! దాని పాటకు మీరు తాళముగూడ మొదలు పెట్టినారా?
పురు:- తాళమును లేదు, తప్పెటయును లేదు గాని, దాని నేమియు ననక, తగుమాటలతో నచ్చజెప్పుము.
కాళిం:- నాన్నగారూ! నాకీ యేహ్యకృత్య మేమాటల చేతను నచ్చదు. నాయెడ నిజముగ దయ కలదేని నాపలుకులను బాటించి, ఈ యవమానపు వివాహప్రయత్న మింతటితో విరమింపుఁడు, లేదా ... (అని, పైమాట రాక, యేడ్చుచుఁ గాళ్ళపై బడును.)
పురు:- (లేవనెత్తి) అయ్యో తల్లీ! నే నేమి చేయుదును? ఆఁడుపడుచు అవివాహితయై యింటఁబడి యున్న, అపనిందల పాలు గాదా?
ఆ. లోటు లేనియెడనె - లోపంబు కల్పన
చేసి, దానఁ దుష్టిఁ - జెందు జగము!
ఇఁక రవంత లోప - మే నిక్కముగఁ గాన
వచ్చె నేని బ్రతుక - నిచ్చు నమ్మ?
కాళిం:- అయ్యయ్యో, మీరుఁ గూఁడ న ట్లనెద రేమి? నా కింగ్లీషు చెప్పిన దొరసానికి నలుబదియాఱేం డ్లున్నవి. ఇప్పటికిఁ బెండ్లి లేదు. ఆమె యేమి యపనిందలపా లైనది?
భ్రమ:- సరే యిఁక నేమీ, చక్కని యుపమానమే దొరకినది. ఆమెకును మనకును గల యంతర మేమో తెలియునా? మన దేశములో, నాఁడుది యాఁడుదే, మగవాఁడు మగవాఁడే. అక్కడనో, ఆఁడుది మగవాఁడు, మగవాఁ డాఁడుది. తెలిసినదా? ఈమంకుతన మిఁకఁ జాలును గాని, ఈపాటికి లోపలికి బోవుదము రమ్ము. (అని బలవంతముగాఁ గాళిందిని దీసికొని పోవును.)
పురు:- పేరయ్యగారూ, విన్నారా సంగతి?
పేర:- విన్నాను బాబూ, విన్నాను. ఏమిటో యెఱిగి ఎఱగని పిల్లలకేం తెలుస్తాయి కష్టసుఖాలు.
పురు:- ఇప్పు డే మని మీ సలహా?
పేర:- తమకు నేను సలహా చెప్పాలా. అయినా దీని కంత సలహాతో ప నేముంది? కట్నంసొమ్ము పంపివేసినట్లు తెలిస్తే, కార్యం లేదని ఆ చిన్నదే వూరుకుంటుంది. ఆ కాస్తముడి పడిందా పెనిమిటి బెల్లమే అవుతాడు.
పురు:- అట్లయిన నిఁక నాలస్య మెందులకు? ఇదిగో సొమ్ము. ఇచ్చి చక్కరండు. (అని నోట్లు లెక్కపెట్టి) బజానాక్రింద నిచ్చిన పదిరూపాయలు మినహాయింతమా?
పేర:- ఆ బ్రాహ్మడు నోట్లకు మారకం అడక్కుండా విడిచిపెడతాడా? ఆ పదిరూపాయలూ అందుక్రింద సరిపుచ్చుతాను.
పురు:- అట్లే కానిండు. (అని నో ట్లిచ్చి) మీ రొకసారి చూడుడు.
పేర:- (లెక్కచూచి) అయిదువేల అయిదువందలూ సరిగావున్నాయి. ఈదారినే వెళ్ళి యిచ్చివేసి, ముట్టినట్టు ముక్కకూడా వ్రాయించుకు వస్తాను. శలవు. (అని కొంచ మీవలకు వచ్చి) బ్రతుకు జీవుడా, బ్రాహ్మడు పప్పులో అడుగువేస్తాడేమో అని ప్రాణాలు కొట్టుకొన్నాయి. లేచిన వేళ మంచిది. అయినా, ఆడపిల్ల నింత హద్దుమీరనివ్వ గూడదు. అందుకనే ఆడపిల్లలకు చదు వంటే, నాకరికాలుమంట నెత్తి కెక్కుతుంది. వెనక నోసారి వెంకిముండ, ప్రక్కయింటి పిల్లతో బళ్ళోకి వెళ్ళడానికి సిద్ధపడితే నేనేం చేశాను, స్తంభానికికట్టి చావగొట్టాను, అక్కడితో ఆరోగం వదలి అయిదుగురు బిడ్డల త ల్లయ్యింది. (అనుకొనుచు నిష్క్రమించును.)
పురు:- (రవంత నడయాడి) ఔరా! దురదృష్టము.
చ. కరమును నీతిబాహ్యములు కట్నపుఁ బెండిళు లంచు సుద్దులం
గురిసెను నిన్నదాఁక, దన కూతుఁ వివాహముపట్ల నేఁడు కి
క్కురు మనకుండఁ గాళ్ళకడ కు న్నడిపించెను గట్న మంచు న
ల్గురు ననుఁగూరిచి లేవిడులు గొట్టెడు యోగముపట్టె నే మనన్‌?
(తెరపడును.)
ఇది చతుర్థాంకము.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)