నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
పంచమాంకము.

(ప్రదేశము: కాళిందీ కమలల గది.)
కాళిం:- (విచారముతోఁ బచారు చేయుచు) కటకటా! కట్నము కాళ్లకడకుఁ బంపుటకూడ జరుగునపు డిఁక గార్య మేమున్నది?
ఉ. తెల్లముగా మనోగతము - తెల్పిన, నేడ్చిన, మొత్తుకొన్న, నా
తల్లికిఁ దోఁచదాయె నిది - తప్పిదపుం బని యంచు! దండ్రియుం
జల్లఁగ గ్రిందిమెట్టునకు - జారి ననుం గమనింప డాయె! నన్‌
జెల్లని డబ్బుక్రింద నిటు - చేసితి వేమిటి కయ్య దైవమా!

ఔరా! ఆఁడుదానిబ్రతు కెంత యలసుబ్రతు కైనది!

ఉ. లేదు స్వతంత్ర మొక్క లవ-లేశము కూడ, నొకంతయేనియున్‌
లేదు, యధార్థ గౌరవము - లే దొక యింతయు మెప్పు, పెండ్లియే
కాదు గృహంబు లమ్ముకొని - కట్నము లర్పణ సేయకున్న నీ
మాదిరి నాఁడుపుట్టు వవ-మానపుఁ బుట్టువు క్రింద నేర్పడెన్‌.

ఇంతకును మూల మిప్పుడు నేను జేయవలసిన దేమిటి?

గీ. పయిక మాశించి దిగిన య-బ్బాయిచేత
బొందు కట్టించుకొని తృప్తిఁ - బొందఁ దగున?
తల్లిదండ్రుల నెదిరించి - తగవు పెంచి
మొండికెత్తినయట్లు కూ-ర్చుండఁ దగున?
కమ:- అక్కా! అక్కా! యీయాశ్చర్యము విన్నావా? (అని యఱచుచు వార్తాపత్రిక చేతఁ బట్టుకొని, చరచరఁ బ్రవేశించును.)
కాళిం:- ఏమి టది?
కమ:- ఇదిగో చదివెద వినుము. "ఓరుగల్లులో నొక యువతి యొక యువకుని వరించెను. ఆ యువకుఁ డాఱువేలు కట్నమిచ్చినఁ గాని యామెను బెండ్లి యాడ నని నిరాకరించెను. ఆమె తలిదండ్రులా విత్తమీయలేక, అన్య సంబంధమును సిద్ధపఱిచిరి, ఆయువతి ఆయువకుం దక్క నన్యుని బెండ్లియాడుట కిష్టములేక, యారాత్రి విషపానము చేసి మరణించెను! ఈ వరశుల్కముల ఫలిత మింతవఱకు వచ్చినది."
కాళిం:- సెబాసు! చాల చక్కనిపని చేసినది!
గీ. పుట్టినప్పుడె లిఖియించు - గిట్టు మనుచు
సకల జీవుల నొసటను - జలజభవుఁడు,
ఇట్టిచో నంతరాత్మ స-హింపని పని
కొడఁ బడుట కంటె జచ్చుటే - యుత్తమంబు.
కమ:- అట్టిసాహస మందఱకు నలవడుట యెక్కడ కాని, అమ్మ యన్నమునకుఁ బిలుచుచున్నది పోవుదము రమ్ము.
కాళిం:- నాకింకను నాఁకలి యగుట లేదు. నీవు పోయి భుజింపుము.
కమ:- అయ్యో! నీయాకలి అక్షయము కాను! ఇప్పు డెంత ప్రొద్దుపోయినదో యెఱుఁగుదువా? నాన్నగారు భోజనముచేసి, నారాయణ దాసుగారి హరికథలోనికి వెళ్ళినారు. అమ్మ మనకొఱ కట్టెయున్నది.
కాళిం:- సరే కాని, యొక్కమాట, ఇంట నిప్పుడు సొమ్మేమియులేదు గదా, యీ కట్నపుసొ మ్మెట్లు వచ్చినదో నీకేమేని తెలియునా?
కమ:- పోతునూరులోని పొల మమ్మివేసినారు.
కాళిం:- శ్రీరామ రామా! చివర కిదికూడనా?
కమ:- ఏమి చేయమనెదవు? ఈ దినములలో బిడ్డలం బడయుట యిందులకుఁ గాక మ ఱెందుల కని నీ యభిప్రాయము?
ఆ. కొడుకు పుట్టి చదువు - కొఱకుఁ దాతలనాఁటి
మడులు మాన్యములును - దుడిచివేయ;
కూఁతు రవతరించి - కొంపలుం గోడు ల
మ్మించుచుండెఁ బెండ్లి - లంచములకు.
కాళిం:- నిజమే! నిజమే! అదిగో అమ్మ పిలుచుచున్నది. వెళ్ళు.
కమ:- నీవుకూడ రమ్ము.
కాళిం:- నా కాకలి లేదని చెప్పలేదా? తలకూడ నొచ్చుచున్నది. తక్షణమే పండుకొనినగాని తగ్గదు. (అని తివాచిపైఁ గూలఁ బడును.)
కమ:- సరే, నీ యిష్టము! (అని నిష్క్రమించును.)
కాళిం:-

హరహరా! ఆ పదియెకరములు విక్రయించి, అల్లునకుఁ జెల్లించుచుండిరిగదా ఆవల వీరిగతి యేమికావలసినది. మా ప్రాణముల కుసూరు మనుచు మలమల మాడవలసినదేనా? ఈమాట వినికూడ నేనీ దుర్నయకార్యమున కెట్లు సిద్ధపడుదును? దైవమా? యిందుల కేదియు దారి యగ పఱుపవా? (స్మృతితో) అన్నట్లు దారికేమీ? అపురూపమైన దారి యా యోరుగంటి యువతి యగపఱిచియే యున్నది. ఆ దారిని నేను మాత్రమేల యనుసరింప గూడదు?

ఈశ్వరాదేశము కూడ నదియె కాకున్న ఈ పూఁటనె యావార్త యేల చెవిని బడవలెను? కమల యేమన్నది? "అట్టి సాహస మందఱకు నలవడుట యెక్క"డనియా? కాళిందీ? నీవీపాటి సాహసమునకుఁ గన్నులు మూసికొని సిద్ధపడలేవా? మానము కాపాడుకొన లేకున్న మానవతి యనిపించుకొనఁ గలవా? చెఱుపు నుండి మరలించిన దే స్నేహము, పాపరహితమైనదే పని, పుణ్యమార్జించినదే బుద్ధి, అనుభవించినదే యైశ్వర్యము, స్వాతంత్ర్యము కలిగినదే జన్మము, మర్యాద గాపాడుకొన్న వాఁడే మగవాఁడు, మానము దక్కించుకొన్నదే మగువ. ఇప్పుడు తప్పిన నీవిక నెన్నఁడును జావకుండ బ్రతుక గలవా?

ఏనాఁడు ప్రాణులు తల్లికడుపునఁ బడునో ఆనాడె మృత్యువుకూడ వెంట బడును. శిశువు పుట్టగానే, ముందు మృత్యువు ముద్దుపెట్టుకొని తరువాత దాదికిం బలెఁ దల్లి కిచ్చును. అట్టి స్థితిలోఁ జావున కంత సందేహింపవలసిన పని యేమున్నది? లెమ్ము. లేచి నీ తలిదండ్రుల కొక లేఖ వ్రాసి అవమానకరమైన నీ యాఁడుబొంది నింతటితో విడిచిపెట్టుము. (అని దిగ్గునలేచి, గది తలుపు మూసి) అవునుగాని ఆత్మహత్య అపకీర్తికిని, అధోగతికిని గూడ గారణముకదా. అట్టిపని చేయవచ్చునా? (క్షణ మాలోచించి) అయ్యో! నా మతికాల! నన్ను నేనే పొరపెట్టు కొనుచుంటినేమి? బుస్సీ కంటఁ బడనొల్లక బుగ్గియైన బొబ్బిలి వెలమ యాఁడువారి పోడిమి తగ్గినదా? రుస్తుంఖానుని వశమగుట కిష్టము లేక, రుధిరాంబరంబులతో నగ్నింబడి రూపుమాసిన పెద్దాపుర క్షత్రియాంగనల పెంపు సన్నగిల్లినదా? ఆయుధముచే నరులం బరిమార్చుట హత్యకాక, వీరధర్మ మగునప్పుడు, భర్తతో సహగమనము సలుపుట బలవన్మరణము కాక, పాతివ్రత్య మగునప్పుడు, అవమానమును దప్పించుకొనుటకై ప్రాణములను విడుచుట ఆత్మారాధనముకాక ఆత్మహత్య యెట్లగును? కాదు ముమ్మాటికిని గాదు. ఈ త్యాగమువల్ల నా గౌరవము నాకు దక్కుటయె కాక తల్లిదండ్రుల ధననష్టము కూడఁ దప్పును. (అని వ్రాఁతబల్ల కడకుఁ బోయి యుత్తరము వ్రాసి, మడిచి, బల్లపై నుంచి, లేచి)

ఓ గదీ! నీకొక నమస్కారము! ఓ శయ్యాదులారా, మీకు సాష్టాంగ ప్రణామములు. (రాట్నము కడకుఁ బోయి, ముద్దు పెట్టుకొని) నా ముద్దుల రాట్నమా! యింతటితో నీకును నాకును ఋణము సరి. గడియారపు ముండ్లవలె నీయాకు లెప్పుడును గదులుచునే యుండుగాక! నీ మధురగాన మెల్లప్పుడు నిఖిల దిశలయందును ధ్వనించుచునే యుండుగాక! కడపటి సేవగా నిన్నొకసారి కదిపి మఱిపోయెద! (అని రాట్నము త్రిప్పి నూలు తీసి) ఈ బారెఁడు పోగును నాభక్తికి నిదర్శనముగాఁ బ్రపంచమున నుండుఁగాక!

(అంతట తెరయెత్తగా పెరడును, బావియు గోచరించును.)

(అటు నిటు జూచుచు, మెల్లఁగాఁ బెరటిలోని కరిగి) నా కంటె ముందు పుట్టిన నవమల్లికా! నమస్కారము. కమలయు, నేనును గష్టపడి పెంచిన చేమంతులారా! మీకుఁ జేమోడ్పు. (అనుచు బావి కడకుఁ బోయి)

ఓ పరమేశ్వరా, ప్రయోజనార్థమై నీవు ప్రసాదించిన యీశరీరము నిట్లు బావిపాలు చేయుచున్నందులకు మన్నింపుము. ఓ తలిదండ్రులారా, నన్నుఁ గని పెంచినందులకు మీ కివిగో నా కడపటి వందనములు. కాళింది యను కూఁతును గననే లేదనుకొనుఁడు గాని, గర్భశోకముచేఁ గృశింపకుఁడు! భరతమాతా, ప్రణామములు. తల్లీ, నీవే నిర్భాగ్యస్థితిలో నుండునప్పుడు నీ తనయల కేమిదారి చూపఁగలవు? ఓ పాలకులారా, మీ పన్నుల గొడవయే మీది కాని, ఆపన్నులగు నాఁడుఁబడుచుల పన్నుల గొడవ మీ కక్కఱలేదు గదా! వంగరాష్ట్ర శిక్షాస్మృతులే కాని, వరశుల్క శిక్షాస్మృతులను గల్పింపరుగదా,

ఓ సంఘ సంస్కర్తలారా, ఉపన్యాసవేదికలపై నూఁదర గొట్టుటయేగాని, మీ రేకరుపెట్టు ధర్మములనైన మీ రనుష్ఠింప రేమి? పాచినోటనె కాఫీ, ప్రాతఃకాలము కాఁగానే క్షౌరము, మైల గుడ్డలతో తిండి, మదరాసు కాఫీ హోటళ్ళలో టిఫెను, ఇంటిలోఁగూడ నింగ్లీషు, బయటను గూడ పాడుమొగము, గొల్లవానిచేతి రొట్టె, గొడారువాని చేతి సోడా, స్వమతమునెడ రోత, స్వధర్మమునెడ విముఖత, పదవులకై ప్రాకులాట, బిరుదులకై పీకులాట, దాస్యమునకు ముందడుగు, త్యాగమునకు వెనకడుగు. ఇవితప్ప, యింతవరకు, సంఘమునందు మీరు ప్రవేశపెట్టిన సంస్కారము లగపడవేమి? ఓ దేశసేవా దురంధరులారా, ఈ కట్నముల దుర్నయమును గూర్చి మీ రించుకయు నాలోచింపరేమి? శుల్క మననేమి? సుంకము, సుంక మననేమి? పన్ను. ఈ పన్ను చెల్లించినంగాని బాలికలకు భర్తృయోగము లేదట, ఇంతకుమించిన యవమాన మింకేమున్నది? మీ బిడ్డల యవమానమును దప్పించలేని మీరు, మీ దేశమాత యవమానమేమి తప్పింపఁగలరు? మీయల్లుర పన్నుల నడ్డుకొనలేని మీరు మీదొరతనమువారి పన్నుల నేమి యడ్డుకొనఁ గలరు? ఎన్నెన్ని సంసారము లేటఁ గలిసిపోవుచున్నవో యెఱుఁగుదురా! ఎందఱాఁడుబిడ్డల తండ్రులు ఏమిగతి దైవమా యని యెత్తుపడి యున్నారో చిత్తగించితిరా, కాసునకు గతి లేనివాఁడు, కడుపుచీల్చి కంచుకాఁగడాలతో వెదకిన గాసింత యక్కరముముక్క కానిపింపనివాఁడు, కన్యనిచ్చెద మనగానే, కట్నముకొఱ కెంత బిఱ్ఱబిగియుచున్నాడో గమనించితిరా?

ఆఁడుపడుచుల యవమానము ని ట్లలక్ష్యము సేయుచున్న దేశమున కయ్యయో, అన్నవస్త్రము లుండునా, ఓ మగబిడ్డలం గన్న యొయ్యారులారా, కొడుకు పుట్టినది మొదలు, కొండంత యాశతో, కలలో గూడ కట్నములనే పలవించు కలికాల పిశాచములారా, మీరు పుట్టినది మాత్ర మాఁడుపుట్టువు కాదా? ఆఁడపడుచు నిట్లవమానపరుచుట మిమ్మలను మీ రవమాన పఱచుకొనుటకాదా? ఇఁకనైన బుద్ధితెచ్చుకొని యీ దురాచారమును విడువుఁడు. విడువకున్న కాళింది యుసురు మీ కంఠములకు జుట్టుకొనక మానదు.

ఓయాఁడుబిడ్డలంగను నదృష్టహీనురాండ్రారా, ఆఁడుబిడ్డ పుట్టగానే ఆవలనైనఁ బాఱవేయుఁడు గాని, అడిగిన లంచమిచ్చి పుస్తె కట్టించి అవమానముపాలు మాత్రము చేయకుఁడు! చెల్లీ! కమలా! యిరువుర మొక కంచమునఁ దిని యొక మంచమునఁ బరుండి పెరిగినఁవార మగుటచే, నిన్ను విడిచి పోవుట నాకు నిజముగ దుస్సహముగానే యున్నది! తప్పనిసరియైనచో, నీవుఁగూడ నీదారినే యనుసరింపుము కాని, అవమానమున కొడంబడి, నీ యక్క కప్రతిష్ఠ మాత్రము కలిగింపకుము! ఓ శరీరమా! నీ యవమానమును దప్పించుటకై, నిన్ను విడనాడి పోవుచున్నాను! ఓ జీవితమా! నీకుఁ జిరకాలచింత లేకుండఁ జేయుటకై, నీ లెక్క ముగించుచున్నాను! ఏమి హృదయమా! యేమి చేయుచున్నావు? నీవు నిర్మలముగా నుండవలసిన నిముసమిదియే! సాహసమా! నీవు సాయపడవలసిన సమయ మాసన్నమైనది. పిఱికితనమా! నా దరికి రాకుము. దాక్షిణ్యమా! నీవు దవ్వులకుం బొమ్ము. మోహమా! నీవు మొద్దువలెఁ బడియుండుము. ధైర్యమా! నీవు దాపునకు రమ్ము. కన్నులారా! మీ కడసారి చూపులు కానిండు. (చీర చెంగులు బిగించుకొని, బావికి ప్రదక్షిణము చేసి) ఓ కూపమా! నా తొలిస్నానము నీ నీటితో నైనది. నా శరీరము నీ నీటితోఁ బెరిగినది. నా తుది స్నానము కూడ నీ నీటితోనె కావించి, నీవు పెంచిన శరీరమును నీకే సమర్పించుచున్నాను! (వినుట నభినయించి) అదిగో! ఆకాశవాణి న న్నమ్మాయీ ర మ్మని పిలుచుచున్నది. అమ్మా! ఇదిగో వచ్చుచున్నాను. హా! పరమేశ్వరా!

(అని బావిలో పడును.)

ఇది పంచమాంకము.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)