నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
షష్ఠాంకము - మొదటి రంగము.

(ప్రదేశము: లింగరాజుగారి వ్యాపారపు గది.)
లింగ:- (బల్లకడఁ గూరుచుండి ప్రవేశించి) ఈ క్రొత్తగింజల దినములలోఁ గోమట్లు బదుళ్ళకొఱకుఁ గొంపచుట్టుఁ దిరిగెడివారు. ఈ యేఁ డింతవఱకు వచ్చి యడిగినవారే లేరు!
గీ. ఆస్తి కలిగి తీఱుప లేని - యప్పె యప్పు,
నూఱు గొని వేయికై వ్రాయు - నోటె నోటు,
పసిడి తాకట్టుపైనిచ్చు - బదులె బదులు,
రోజువడ్డీలు వచ్చిన - రోజె రోజు.
ఘంట:- (వచ్చి) బాబూ! బట్టలు కొనుక్కుంటాను. జీతమిస్తారా?
లింగ:- నీ బట్టలు పాడు గాను! ఎందుకురా బట్టలు! గాంధి మహాత్మునిఁ జూడరాదా, గావంచా కట్టుకొని తిరుగుచున్నాఁడు.
ఘంట:- గాంధిగార్ని మెచ్చుకుంటారు గదా, ఖద్దరు కట్టరేం మీరు?
లింగ:- ఆవిషయములో, ఆయనకు మతి లేదురా! కట్టు కట్టు మనుటయే కాని, ఖరీదు తగ్గే సాధనము చూచినాఁడు కాఁడు.
ఘంట:- మీకున్న మతి ఆయనకు లేదు గాని నాజీతం మాటేమిటి?
లింగ:- ఆనక చెప్పెదఁ గాని అమ్మగా రేమి చేయుచున్నది?
ఘంట:- గదిలో కూర్చుండి కథలు చదువుకుంటున్నారు.
లింగ:- నిన్నా వైపునకు వెళ్ళవద్దంటిని గదా యెందులకు వెళ్ళినావు?
ఘంట:- బాగానే వుంది! యేవైపూ వెళ్ళక యెల్లాగండీ? ఆవైపుకు వెళ్ళితే అమ్మగార్ని కొరుక్కుతినేస్తానా? (అని నిష్క్రమించును.)
లింగ:- పెంకికుంక! పెడేలున నెంతమా టన్నాఁడో! అయినను, వాని ననవలసిన పనిలేదు! ఈడు కడచినవెనుకఁ బెండ్లి యాడిన బుద్ధిహీనుల కిట్టి చెప్పుదెబ్బలు తఱచుగా తగులుచునే యుండును!
సీ. ప్రాయఁ ముడిగి, యేండ్లు - పైఁ బడ్డ తరి, భ్రాంతిఁ
    జెంది రెండవపెండ్లి - చేసికొనుట
ఆస్తి దాయాదుల - కగు ననుచింతచేఁ
    బెరవారి బిడ్డను - బెంచుకొనుట
క్రొత్తలోఁ జూపు మ-క్కువ లెల్ల మది నమ్మి
    అత్తవారింటను - హత్తుకొనుట
అప్పులవారిని - దప్పించుకొన సొత్తు
    లితరులపేర వ్రా-యించి యిడుట

పుడమి, నీ నాలుగుఁ జాల - బుద్ధిమాలి
నట్టి పను లని పల్కుదు - రార్యులెల్ల
రందు, మూడవ పెండిలి - యాడినట్టి
బడుగునగు నన్నుఁ గూఱిచి - పలుకనేల?
బస:- (పత్రిక చేతఁ బట్టుకొని ప్రవేశించి) నాన్నా! ఆ సంగతి పత్రికలోఁగూడ పడినది సుమా!
లింగ:- ఏ సంగతి?
బస:- ఆపిల్ల బావిలోపడి చచ్చిన సంగతి. నాక్లాసు పిల్లలందఱు నిది చదివి, నన్నుఁ గాకులవలెఁ బొడుచుకొని తినుచున్నారు! పాడు కట్నము కొఱకు నీవెందుల కంత ప్రాకులాడవలెను నాన్నా?
లింగ:- ఓరి దామోదరుఁడా సర్వము విడిచిపెట్టిన గాంధికి స్వరాజ్యము కొఱ కంత ప్రాకులాట యెందులకురా?
బస:- ఆయన ప్రాకులాట యంతయు నాయన కొఱకా?
లింగ:- నా ప్రాకులాట మాత్రము నాకొఱకా? నీ తెలివి తెల్లవారి నట్లే యున్నది. కాని ఏది యేమి యేడ్చినాఁడో చదువు!
బస:-

(చదువును)

"మాపురమునందలి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కుమార్తెను లుబ్ధాగ్రేసర చక్రవర్తి యగు సింగరాజు లింగరాజుగారు తనకుమారునకుఁ జేసుకొనుటకై, అయిదువేల అయిదువందల రూపాయల కట్నము విధించి, యాసొమ్ము, కార్యమునకు ముందే కాఁజేసిరి! కట్నపుఁ బెండ్లియెడ నిష్టము లేక కాళింది యను నాచిన్నది తల్లిదండ్రుల కొక యుత్తరమువ్రాసి తన బల్లపైనుంచి బావిలోపడి ప్రాణములు విడిచెను! ఆ యుత్తరమునం దున్నమాట లివి-

'నా ప్రియమైన తల్లిదండ్రులారా! నమస్కారములు! కట్నమిచ్చి తెచ్చిన వరునిచేఁ, గళ్యాణసూత్రము కట్టించుకొనుట గౌరవహీనమనియు - నా వివాహమునకై మీరు సర్వస్వము సమర్పించుట నా క్షేమమునకును, మీ సౌఖ్యమునకును గూడ భంగకరమనియు భావించి - ఈ రెంటియొక్కయు నివారణమునకై నేనీ లోకమును విడిచిపోవ నిశ్చయించుకొని యీ జాబువ్రాసి యిచ్చటినుంచి యనుజ్ఞ తీసికొనుచున్నాను. అమ్మకాని, మీరుకాని, నాకై అణుమాత్రమును జింతింప వలదని ప్రార్థించుచున్నాను. మీ యిరువురుకును బునః ప్రణామములు. చెల్లెలికి ముద్దులు!

ఇట్లు విన్నవించు మీ యనుంగు పుత్త్రిక - కాళింది'

ఒక పౌరుఁడు"

లింగ:- (ఆగ్రహముతో) ఈ పౌరుఁ డెవ్వడో తెలిసికొని పరువు నష్టముక్రిందఁ బదివేలకు దావా పడవేయ వలసినదే! ఈ లుల్లిగానికి నేను లుబ్ధాగ్రేసర చక్రవర్తి నఁట. ఏమి పొగరు.
పేర:- (అంతలోఁ బ్రవేశించి) అంతమాట మి మ్మనగలవా డెవఁడు?
బస:- (లేచి చక్కఁబోవును.)
లింగ:- రావోయి పేరయ్యా రా! ఏమిటి విశేషాలు?
పేర:- (కూర్చుండి) ఏం చెప్పను? భ్రమరాంబగారి దుఃఖం పట్టలేకున్నాం.
లింగ:- అది సరేకాని ఆ చచ్చిన దెష్ట, ఆముడి కాసింతయు పడిన తరువాత నైన జచ్చినదికా దేమోయి?
పేర:- అవు నవును. అలా జరిగితే యీభూమీ దక్కి, యీ అయిదువేలూ దక్కి యీపాటి కింకో అయిదువేలకు బేరం తగిలేది.
లింగ:- అదిగో అదే నాకు పట్టుకొన్న బాధ! చావునకేమి యెప్పుడైనఁ జావవలసినదే. రవంత సందర్భానుసారముగఁ జచ్చిన బాగుండెడిది! సరికాని యీసొమ్ముమాట యేమయిన వచ్చినదా?
పేర:- ఎందుకు రాదూ? ఆసొమ్ముకోసమే నేనిపుడు వచ్చింది.
లింగ:- అలాగుననా? అయితే, ఆసొమ్మంత మీఁదమీఁద నున్నదా? నేనెంత ప్రయత్నము చేసినానో యెంతైనదో యెఱుఁగుదువా?
పేర:- ఆ నష్టం మినహాయించుకుని మిగతసొమ్మే యివ్వండి!
లింగ:- ఇవ్వని యెడల?
పేర:- దావా చేస్తాడు.
లింగ:- సాక్ష్యము?
పేర:- మీ రసీదులే!
లింగ:- పేరయ్యా! నేనంత పెయ్యమ్మనా? నా దస్తూరీవలె వ్రాయలేదు. నా సంతకమువలె చేయలేదు, నన్నా రసీదు లేమి చేయును?
పేర:- (తనలో) ఆరిముండాకొడకా! అయిదువేలూ మింగివెయ్యాలనేనా కావోసు! (పయికి) అంత పనొస్తే మేమందరం లేమూ?
లింగ:- అందఱ మాటయు నావల చూతము గాని ముందు నీమాట చెప్పు. నీ యైదువందలు మరల క్రక్కుట నీకిష్టమేనా?
పేర:- కార్యం తప్పి వచ్చినప్పుడు కక్కకేం చేస్తాం?
లింగ:- ఇదిగో యిదే వైదికము! ఈమాట నియోగియైన వాఁడనునా?
పేర:- అదుగో ఆమాటమాత్రం నే నంగీకరించను. మావాళ్ళిప్పుడు మీవాళ్ళ నమాంతంగా మింగేసేవాళ్ళయినారు. మీవాళ్ళు మీసాలమీద నిమ్మకాయలు నిలబెడితే, మావాళ్ళు మామిడికాయలు నిలవబెడుతున్నారు! మీవాళ్ళు జుట్టుమానేస్తే మావాళ్ళు బొట్టుకూడా మానేశారు! మీవాళ్ళు మూరెడుగోచీ పెడితే మావాళ్ళు బారెడు గోచీ పెడుతున్నారు! మీవాళ్ళు వేలెడుచుట్ట కాలిస్తే మావాళ్ళు జానెడుచుట్ట కాలుస్తున్నారు! మీవాళ్ళు కాఫీహొటేళ్ళకుపోతే మావాళ్ళు రెపరేషుమెంటు రూములకు పోతున్నారు! విన్నారా? యిన్నిమాట లెందుకూ ఇప్పుడు మీరన్న మాటల్లో యేం నియ్యోగముంది? ఆనక కోర్టుమాట ఆలోచింతాం యీ సంగతి పైకివస్తే పదిమందీ మిమ్మల్ని బ్రతుకనిస్తారా? ఈ రోజుల్లో యింతచప్పని ఆలోచన మేము చేస్తామా!
లింగ:- అట్టయిన, నీ కమ్మని యాలోచన యేమో కాసింత చెప్పుము.
పేర:- అదిగో అల్లా అడగండి! ఆ సొమ్మూ, ఆ భూమీ దక్కించు కోవాలంటే ఆ రెండోపిల్ల నెల్లాగయినా చేసుకోవడమే సాధనము. మఱి యేదారి త్రొక్కినా మర్యాద పోకమానదు.
లింగ:- అందుల కాయన యంగీకరించుట లేదని విన్నానే?
పేర:- అది నిజమే. అయినా, నన్ను ప్రయత్నం చెయ్యమంటే చేస్తాను.
లింగ:- ప్రయత్నము చేయుటకాదు, పనియే చేసికొని రావలయును.
పేర:- సరే నాశక్తి యావత్తూ ధారపోస్తాను. శలవు. (నిష్క్రమించును.)
లింగ:- ఇంటను బయటను గూడ నల్లరి పడుటకన్న నిదే మంచిపని! పోయెనా దానితోపాటుగ నిదికూడ పోనేపోవును. లేదా అది యున్నది నే నున్నాను.
(తెర పడును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)