నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
షష్ఠాంకము - రెండవ రంగము.

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి కచేరి చావడి.)
(ప్రవేశము: క్రిందఁ గూర్చుండి యొకవంక పురుషోత్తమరావుగారు, పేరయ్య, మఱియొక వంక కమలను ముం దిడుకొని భ్రమరాంబ.)
పురు:- చివరకుఁ దేలిన యంశ మేమి?
పేర:- ఏం తేలిం దని మనవి చేయను? మీరు నానుకోవాపరేటర్లనీ కోర్టుకు వెళ్లరని ఆయనకు బాగా తెలుసును. అందుచేత అంత మొండికెత్తి కూర్చున్నాఁడు.
పురు:- అందుల కిప్పుడు మన మాచరింపవలసిన పని యేమిటి?
పేర:- నేనేం మనవి చెయ్యను? కోటివరహాలు పోయినా మీరు కోర్టుకు వెళ్ళడం ధర్మం కాదు. అకారణంగా అంతసొమ్ము పోగొట్టుకోవడం అంతకన్నా ధర్మంకాదు. ఈచిక్కు లన్నీ ఆలోచించే చిన్నమ్మాయి నా చిన్నవాడికే యిస్తే తీరిపోతుందని మనవి చేశాను.
పురు:- అయిదువేల యైదువందలు నా బ్రాహ్మణుఁడు హరించినను సరియే కాని, యిఁక నాయనతో సంబంధము నాకిష్టము లేదు!
చ. పరువుఁ బ్రతిష్టయుం గనక, - పాపభయం బను మాటలేక యి
క్కరణి ధనంబె జీవితము-గాఁ దలపోసెడు వానితోడఁ జు
ట్టరికముచేసి, నిత్య మ-కటా! యని చింతిలు కంటె; గౌరవా
దరపరు లౌ గృహస్థుల ప-దంబుల పైఁ బడవైచుటే తగున్‌!
పేర:- బాబూ! యీ విషయంలో మీ రిల్లాటి పట్టుదల పెట్టుకో వలసిన పనిలేదు. ఆయనమీద రోతచేత ఆయన పిల్లవాణ్ణి పోగొట్టుకోవడం నా అభిప్రాయం కాదు, ఏభయ్యేళ్ళ ముండాకొడు కెన్నాళ్లు బ్రతుకుతాడు! ఆ తరువాత పెత్తనమంతా అమ్మాయిదే. అవన్నీ అటుండఁగా అంతసొమ్ము ఆయన చేతులలో చిక్కుపడ్డప్పుడు అడుసు త్రొక్కడమా అని సందేహించడం ఆలోచన తక్కువపని కాదూ? అమ్మా! మీరల్లా వలపోస్తూ యేమీ చెప్పకపోతే యెల్లాగ? ఏదోవిధంగా మఱచిపోవాలి కాని యెల్లకాలం అదేపనిగా విచారిస్తూ వుంటే యెల్లా సాగుతాయి వ్యవహారాలు!
భ్రమ:- (కన్నీటితో ) అయ్యా పేరయ్యగారూ!
ఉ. ఆనునుచెక్కు, లాపెదవు, - లామొగ, మామురిపెంపు భ్రూయుగం,
బానొస, లాశిరోరుహము, - లామృదువాక్యము, లామృదుస్వరం
బానయనంబు, లానడక, - యావినయం బకటా! సుషుప్తియం
దేనియు సాధ్యమే మఱువ - నీ దురదృష్టపు జీవితంబునన్‌!
సీ. ఎన్నఁడు నామాట - కెదురు చెప్పఁగ లేదు!
    తండ్రి గీచినగీఁటు - దాఁట లేదు!
బడి యన్న నెన్నఁడుఁ - బ్రాలుమాలఁగ లేదు!
    రాట్నంబు నెడలఁ బ-రాకు లేదు!
అది నాకుఁ గావలె - నని యెన్నఁ డన లేదు!
    కుడుచునప్పుడుఁ గూడ - గొడవ లేదు!
ఆటలయం దైన - నలుక యెన్నఁడు లేదు!
    పొరుగింటి కేనియుఁ - బోక లేదు!

కలికమున కేనియును నోటఁ - గల్ల లేదు!
మచ్చునకు నేనియుం బొల్లు - మాట లేదు!
అట్టి బిడ్డను బ్రతికి యు-న్నంతవఱకు
మఱవ శక్యమె! వెఱ్ఱి బ్రా-హ్మణుఁడ! నాకు!
పురు:- అహర్నిశ లిట్లు వలపోయుచు ఆబిడ్డ నడలఁ గొట్టెదవా?
తే. ఎంత చెప్పిన విన విది - యేమి వెఱ్ఱి
యెవరిపని యైనతరువాత - నెవ్వ రుంద్రు?
నాటకములోని వేష గాం-డ్రకును మనకు
నించుకేనియు భేద మెం-దేని గలదె!
పేర:- అంతే నమ్మా! అంతే. బొమ్మలాటకా డేంచేస్తాడు? ఏబొమ్మ పనివచ్చినప్పు డాబొమ్మను తెరమీది కెక్కిస్తాడు. ఆబొమ్మ పని కాగానే అడుగున పారేస్తాడు. ఆలాగే భగవంతుడూను! ఇం తెందుకూ? ఇరవయేళ్ళ నుంచివున్న పొడుంకుండు మొన్న నిట్టె పగిలిపోతె, నే నేం చెయ్యగలిగాను! ఏడిస్తే వచ్చేలా గుంటే యెన్నా ళ్ళేడవమన్నా యేడుస్తును!
పురు:- ఏమే? యీ విషయమునందు నీ యభిప్రాయ మేమిటి?
భ్రమ:- (కన్నులు తుడుచుకొని) మన యభిప్రాయములకు ఫలితముగా మనకు జరుగవలసిన శాస్తి జరుగనే జరిగినది. ఇంకను మన యభిప్రాయముల మీఁదనే నడచినచో ఈయమ్మ కేమిబుద్ధి పుట్టునో యెవరు చెప్పగలరు! కావున, దాని యభిప్రాయము తెలుసుకొని దాని యిష్ట మెట్లో యట్లే జరిగింపుఁడు.
పేర:- అదీ బాగానే వుంది. అమ్మాయీ! నీయభిప్రాయ మేమిటో చెప్పమ్మా! నీ కా చిన్నవాణ్ణి నిశ్చయించమంటావా? లేక, అయిదువేల అయిదువందల పదిరూపాయలూ - ఆబ్రాహ్మడికి అర్పితంచేసి వూరుకోమంటావా!
కమ:- (తనలో) ఇప్పుడు నా కర్తవ్యమేమిటి? అక్క సిద్ధాంతమునే యనుసరింపఁ దగునా? అందులకు భిన్నము గావించి తల్లిదండ్రులకుఁ దాత్కాలిక మనశ్శాంతిని గలిగింపఁ దగునా! అక్క చెప్పిన వాక్యము లన్నియు నాణెముత్తెము కోవలు. కట్నాల రాయలచేఁ గళ్యాణసూత్రము గట్టించుకొనుట కంటెఁ గతిమాలినపని మఱి లేదనుట నిశ్చయము! అట్టి వివాహము నాకును నంగీకారము లే దన్నచోఁ, దలిదండ్రులు నన్నుఁ బలవంతపెట్ట రనుటయు నిశ్చయమే. కాని, దానివల్లఁ దేలు పర్యవసాన మేమి? అయిదువేల యైదువందలు నా దుర్మార్గుని పొట్టను బెట్టించుట తప్ప మఱేమియు లేదు. అందువల్లఁ నా దారి విడిచిపెట్టి యా సంబంధమునే యంగీకరించి, పణమునకుం దగిన ప్రాయశ్చిత్తము చేయఁ గలిగినచో వీరిచ్చిన ద్రవ్యము వినియోగములోనికిఁ దెచ్చినదాన నగుటయేగాక అక్క కసి తీర్పఁగలిగిన దాననై ప్రపంచమున కొక పాఠము నేర్పినదానను గూడ నగుదును. అయితే, అట్టి ప్రతీకార మే విధముగాఁ జేయగలుదును. (ఆలోచించి) సరే కానిమ్ము.
గీ. కట్టె మథియింప మథియింపఁ - గలుగు నిప్పు!
భూమి త్రవ్వంగఁ ద్రవ్వంగఁ - బుట్టు నీరు;
పెరుఁగు తరువంగఁ దరువంగఁ - బేర్చు వెన్న;
కన్పడదె దారి యోజింపఁ - గార్యములకు?
పురు:- అమ్మాయి! ఆయన యడిగిన మాటకు బదులు చెప్ప వేమి! సందేహ మక్కఱలేదు. నీ యభిప్రాయ మేమో స్పష్టముగా జెప్పు, నిన్ను మే మించుకయు నిర్బంధించువారము కాము.
కమ:- (తల వంచుకొని) మీ యిష్టము.
పురు:- మా యిష్టము కొఱకుఁ జూడ వలదు. నీ యిష్టమే మా యిష్టము, నిశ్చయముగా నీ యిష్ట ప్రకారము జరిగింతుము.
కమ:- (కొంచె మాలోచించి) ఈ వివాహమునకు సంబంధించిన యితర విషయములలోఁ గూడ నా యిష్టానుసారముగ నడువనిత్తురా?
పురు:- సందేహ మేమీ, సర్వత్ర నీ యిష్టమే మా యిష్టము. ఈ మాటకు నే నిసుమంతయుఁ దప్పిపోవువాఁడను గాను.
కమ:- అట్లయిన, నా కంగీకారమే.
భ్రమ:- (తల నిమురుచు) అమ్మా! ఆనక మా గొంతుక కోయక ఆలోచించి మఱి జెప్పుము!
కమ:- ఆలోచించియే చెప్పినాను. అనుమాన మక్కఱలేదు.
పేర:- సెబాసు తల్లీ! నా మనస్సు కిప్పుడు నచ్చావు! సమయానికి లేకపోయింది కాని, వుంటే, వుద్ధరిణెడు పంచదార నోట్లో పోస్తును.
పురు:- పేరయ్యగారూ! పెరయాలోచనము లిఁక నెందులకు. సాయంకాలము మీరు వెళ్లి సంగతి యాయనతోఁ జెప్పి, సరే యనిపించుకొని రండు. (మెల్లగా) ఇంకొకటి కార్య మీ నెలలోనే కావలెను. యేమనెదరా? యీబిడగా రీసందడిలోఁబడి యిప్పటి వ్యసనమును గొంత మఱచిపోఁ గలదు.
పేర:- బాగుంది బాబూ! బాగుంది. శలవు పుచ్చుకొని వెళ్ళి శటల్‌ చేసుకు చక్కావస్తాను. అమ్మా! శలవు. (అని నిష్క్రమించును.)
పురు:- (లేచి కమల నెత్తి యక్కునఁ జేర్చుకొని) తల్లీ!
ఆ. ఏండ్లకన్నఁ జాల - హెచ్చగు బుద్ధి నీ
కిచ్చి మమ్ముఁ దేల్చె - నీశ్వరుండు!
అక్క యట్లు చేసి-నందుల కీ వైన
మాదు కనుల యెదుట - మనఁ గదమ్మ!
కమ:- (కొంచె మీవలకు వచ్చి తనలో)
ఉ. అక్కరొ! నీ మతంబునకు - నడ్డముగాఁ జనుచున్న నా యెడన్‌
మక్కున వీడబోకు! మభి-మానము లేని కతాన గాదు నే
నిక్కరణిం భ్రమించుట మ-ఱేమన దేవుఁడు మధ్యవర్తిగా
నిక్కము దెల్పుచుంటి నిటు - నీ కసి తీర్ప మదిం దలంచితిన్‌.
(తెరపడును.)
ఇది షష్ఠాంకము.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)