నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
సప్తమాంకము - మొదటి రంగము.

(ప్రదేశము: లింగరాజుగారి పడక గది.)
(ప్రవేశము: కుక్కిమంచముపైఁ గూర్చుండి లింగరాజుగారు, చేరువను నిలుచుండి సుభద్ర.)
సుభ:- సరే కాని, నలుగురు నట్టింటికి వచ్చునప్పుడైన నానగలు నాకీయఁ గూడదా? ఇంట శుభకార్య మగునప్పుడు గూడ నేనిట్లే యుండవలయునా?
లింగ:- ఎందులకే యింత తొందర? ఎల్లుండిరాత్రి కదా వివాహము? అకారణముగా నీరెండు దినములు నఱిగిపోవుటయే గదా?
సుభ:- అబ్బబ్బా! యెప్పుడు చూచిన నగ లఱిగిపోవు ననియు, బట్టలు చిఱిగిపోవు ననియు, బియ్యము తఱిగిపోవు ననియు, నిదే గోల కద! ఎందుల కీ భాగ్య మంతయు?
గీ. స్వారి చేయని గుఱ్ఱంబు, - చదువ నట్టి
పుస్తకంబును, సేవింపఁ - బోని మందు,
ఆరగింపని వంటక, - మనుభవింప
నట్టి ధనమును వ్యర్థంబు - లనుట వినరె?
లింగ:- ఓసీ! యెందుల కేడిపించెదవు? రేపిచ్చెద నూరకుండుము.
సుభ:- రేపు శుక్రవార మని సున్న చుట్టుటకా?
లింగ:- నేఁడు గురువారము, గురువారము బొత్తిగాఁ గూడనిది.
సుభ:- ఈవన్నెవా రిఁకఁ గోడలికేమి నగలు పెట్టుదురు?
లింగ:- ఇక్కడికి నీ సంగతి యైనది? ఇఁకఁ గోడలి సంగతియా? అబ్బబ్బా! ఆఁడువాండ్ర కీ యాభరణాల రుచి యెవఁడు మప్పినాఁడో కాని యేయింటఁ జూచిన నిదేగోల గదా! ఏడువారముల నగలుఁగల యిల్లాలు కూడ- ఎదుటియింటి ముత్తమ్మ ముక్కుపుడక యెరువు తెచ్చుకున్నదాఁక నిద్రపోదు! తాలూకాలఁట, జిల్లాలఁట, లోలకులఁట, డోలకులఁట, వాచీగొలుసులఁట, పేచీగొలుసులఁట, అటుకులగాజులఁట, యిటుకులగాజులఁట, యెప్పటికప్పు డేమేమి రకములో దిగుమతి యగుచున్నవి! కమసాలులకుఁ గావలసినంత పని, షరాబులకుఁ జాలినంత బేరము.
సుభ:- మీవంటి భర్తలకుమాత్రము ప్రాణసంకటము!
లింగ:- సరేకాని చెప్పవచ్చినమాటలు పూర్తిగాఁ జెప్పనిచ్చినావే కావు, అనుదినము మనయింటికి వారు అరిసెలు, సున్ని, అప్పడములు, వడియాలు, విధవలకని పిండి, స్వయంపాకులకని యుప్పు, పప్పు, బియ్యము, నేయి, అల్లము, బెల్లము, చింతపండు, మిరపకాయలు, కూరలు, నారలు, తలంట్లకని నూనె, నలుగుబిండి, కుంకుడుకాయలు, షీకాయ, కట్టెలు, పిడుకలు, సబ్బు, సాంబ్రాణి, పసుపు, కుంకుమ మున్నగున వన్నియుఁ బంపుచుందురు. ఆ వన్నియు జాగ్రత్తగా నందుకొని, ప్రక్కగదిలో భద్రపఱిచి, ఆఱవనాఁడు నా కప్పగించవలయును.
సుభ:- ఎందు నిమిత్తము?
లింగ:- ఏకముగా బజారునఁ బెట్టి యమ్మించుటకు.
సుభ:- రామ రామా! నలుగురు నవ్వరా?
లింగ:- నవ్వుట కేమున్నది? ఉమామహేశ్వరరావుగారు మొన్న నుప్పుతోఁ గూడ నూరను ద్రిప్పి యమ్మించలేదా?
సుభ:- అట్లయిన, సదస్య సంభావనకూడ ఆయన యిచ్చినట్లే యిచ్చెదరు కావలయును.
లింగ:- ఆయన, కాని కాని యైన నిచ్చినాఁడు. నే నఱగాని గూడ నీయను. పదిరూపాయలు పోలీసువారి మొగమునఁ గొట్టి పందిటిచుట్టును పారా లేసినచో పయిన సంభావనపని యుండదు.
సుభ:- చివరకు నా చీరలసంగతి కూడ నింతియేనా యేమిటి?
లింగ:- వెఱ్ఱిమొగమా! నీకుఁ జీరల కేమిలోటు! అయిదురోజులు నైదుచీరలు. అప్పగింతలచీరతో నాఱు. ఆఱుచీరలు నాఱేండ్లు కట్టవచ్చును. ఒక్క చీరలేనా? నీకు రావలసిన లాంఛనము లింకను లక్షయున్నవి. అయిదురోజులు నైదు మొహిరీలు, అయిదు కాసులు, అయిదు వెండి పలుదోముపుల్లలు, అయిదు బంగారు తాటియాకులు, అయిదు వెండి పలుగుట్లు పుల్లలు, అయిదు వెండి కాఫీ కప్పులు, అయిదు వెండి యుప్మా ప్లేట్లు; అయిదు కుర్చీలు, అయిదు కాలిపీటలు; అయిదు మెత్తలు, అయిదు బాలీసులు, అయిదు బొట్టుపెట్టెలు, అయి దద్దములు, అయిదు దంతపు దువ్వెనలు, అయిదు కుంకుమ బరిణెలు, అయిదు కాటుక కాయలు, అయిదు గంధపు గిన్నెలు, అయిదు తలనూనె బుడ్లు, అయిదు సెంటు బుడ్లు, అయిదు సబ్బు పెట్టెలు, అయిదు పవుడరు డబ్బీలు, అయిదు చేతిరుమాళ్లు, అయిదు గంధపు చెక్కలు, అయిదు చీనా విసనకఱ్ఱలు, భోజనములో వెండిచేపలు, ఫలహారములో పసిఁడిపీతలు ఈలాటి వింకను నెన్నియో వచ్చును. అవన్నియు జాపితా వ్రాసి యుంచినాను. సాఁగదీసి సకలము రాఁబట్టుకో. ఆ యైదునాళ్ళును నీ యధికారమున కడ్డన్న మాట లేదు.
గీ. గ్రామదేవత కొకనాఁడె - కానుకలును
గొలుపులు న్వేటపోతులును - గుంభములును;
బింకముగ నైదుదినములు - పెండ్లి కొడుకు
తల్లి కొలు, పక్క కొలుపును - దాసి కొలుపు!
సుభ:- సరేకాని పెండ్లికైన క్షౌరము చేయించుకొనెదరా లేదా?
లింగ:- అదిగో మొదలు పెట్టితివా? ఆమాట మాత్రము మఱచిపోవు! అవల నాకుఁ జాల పనియున్నది పోయెద! (నిష్క్రమించును.)
సుభ:- ఔరా! సృష్టి వైచిత్ర్యము.
చ. కనికరమా కనంబడదు, - కన్పడఁ బోవదు ప్రేమ, పొట్ట చీ
ల్చినఁ గనుపట్ట దెయ్యెడను - సిగ్గనునట్టిది, పాపభీతి మ
చ్చునకును గానిపింప, దిఁక - సూనృత మన్నది లేనె లేదు, లో
భిని భువి నేపదార్థములు - పెట్టి విధాత సృజింపఁ గల్గెనో!

అన్నిటికంటెను జిత్రమేమా?

గీ. ప్రాయకంబుగ రాజు దు-ర్మతినె పెంచు;
మగువ తుంటరినే తన - మది వరించు;
అంబుదంబులు కొండల - యందె కురియు;
లచ్చి పెనులోభి యింటికే - వచ్చి తనియు.

అయినను, వీరి ననవలసిన పనిలేదు. ఐశ్వర్య మనఁ గాలచక్రమువలె నదేపనిగఁ దిరుగుచుండునదికాని యొకచోటనె యుండునది కాదు!

గీ. పేదవాని కొడుకు - పెనులోభియై కూర్చు
నతని కొడుకు త్యాగి - యై చరించు,
త్యాగి కొడుకు మరల - దారిద్ర్యయుతుఁ డగు;
సిరులు చక్రమట్లు - తిరుగు నిట్లు!
(తెర పడును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)