నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
సప్తమాంకము - రెండవ రంగము.

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి పెరటిలోని పెండ్లి పందిరి.)
పురు:- (కన్యాదాత వేషముతోఁ బ్రవేశించి) ఈప్రొద్దు మూడవదినము ఇఁక రెండుదినములు గడపవలెను. ఆఁడుపిల్లలకుఁ బెండ్లిసేయుట కంటె అశ్వమేధయాగము సేయుట సులభము.
సీ. తెల్ల వాఱఁగనె బిం-దెలతోడ నీళ్ళును
    పలుదోము పుల్లలుఁ - బంపవలయు
కావిళ్లతో వెన్క - కాఫీయు, దోసె, లి
    డ్డెనలు, నుప్మాయు న-డ్పింపవలయు
తరువాత భోజనా-ర్థము రండు రం డని
    పిలిచిన వారినే - పిలువవలయు
కుడుచునప్పుడు పంక్తి - నడుమ నాడుచుఁ బెండ్లి
    వారి వాంఛలు కని-పట్టవలయు

నొకఁడు రాకున్న వానికై - యోర్పుతోడ
మంచినీరైన ముట్టక - మాడవలయు
నిన్నిటికి సైచి, వేలు వ్య-యించి, గౌర
వించినను నిష్ఠురములె ప్రా-ప్తించు దుదకు!
ఘంట:- (ప్రవేశించి) అయ్యా! వియ్యపురాలుగారు లేచేవే ళయింది. అమ్మగార్నింకా పంపించారుకా రేం?
పేర:- ఎందు నిమిత్తము?
ఘంట:- ఎందు నిమిత్త మంటారేమిటి? వియ్యపురాలుగారికి తెలివిరాగానే కండ్లు తుడవాలి; కాళ్ళు మడవాలి; కోక సర్దాలి; కిందకు దింపాలి; పెరట్లోకి పంపాలి; నీళ్ళచెం బందివ్వాలి; రాగానే కాళ్ళు కడగాలి; పండ్లు తోమాలి; మొహం తొలవాలి; నీళ్ళు పోయాలి; వళ్ళు తుడవాలి; తల దువ్వాలి; కొత్తచీర కట్టాలి; కుర్చీ వెయ్యాలి; కూర్చోబెట్టాలి; పారాణి రాయాలి; గంధం పుయ్యాలి; అత్తర్లివ్వాలి; పన్నీరు చల్లాలి; మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని వరహాలద్దాలి; వెండి పలుపు వెనకను కట్టాలి; బంగారుపలుపు పక్కను చుట్టాలి; దిష్టి తియ్యాలి; హార తివ్వాలి; అద్ధాన్న మివ్వాలి; యిల్లాంటి వింకా నా తలవెంట్రుక లన్ని వున్నాయి. ఆలస్యమైతేఁ అలకకట్నం చెల్లించవలసి వస్తుంది. త్వరగా పంపించండి. (అని నిష్క్రమించును.)
పురు:- ఎన్నఁడూ వినలే దివెక్కడి పద్ధతులు దేవుఁడా! దాని యవస్థతోఁ బోల్చి చూచిన నా యవస్థయే మెఱుఁగు! ఓసీ యెక్కడ?
భ్రమ:- (ప్రవేశించి) ఎందులకుఁ బిలచినారు?
పురు:- వియ్యపురాలు లేచువేళ యైనదఁట. వర్తమానము వచ్చినది.
భ్రమ:- ఇదిగో వెళ్ళుచున్నాను. మొహిరీ లెక్కడ నున్నవి?
పురు:- నా చేతిపెట్టెలో నున్నవి. ఇవిగో తాళములు.
భ్రమ:- (తాళములు తీసికొని నిష్క్రమించును.)
పేర:- (ప్రవేశించును.)
పురు:- వచ్చినారా! ఇఁక రెండుదినము లున్నవి! ఈ రెండుదినములుఁ కూడ దాటించితిరా యీ జన్మమున కీ శిక్ష చాలును.
పేర:- ఇది గడ్డురోజు! ఈరోజు గడిచిందంటే యిక భయమే లేదు. లింగరాజుగారు సంచులుకోసి సంభావ నిస్తారని పైవూళ్లనించి కూడా బ్రాహ్మలు వచ్చారు. ఆయ నేమో, పోలీసువార్ని అరంజిమెంటు చేస్తున్నారట, విన్నారా?
వీర:- (ప్రవేశించి) అయ్యా! ఫలహారాల కావిళ్ళింకా పంపించారే కారు. పెళ్ళివా రెంతసే పాగుతారు? ఎవరిమట్టుకు వారు కాఫీహోటళ్ళకు ప్రయాణా లవుతుంటే, పరుగుపరుగున నేను చక్కా వచ్చాను. మగపెళ్లివా ర్నిలా చూస్తే మర్యాద దక్కుతుందా?
పురు:- ఇదుగో యిప్పుడే పంపెద. ఈపాటికి సిద్ధ మయ్యేయుండును.
వీర:- ఏమి కావడమో. నిన్నటి వుప్మాలో నిమ్మపళ్లరసమే లేదట. ఇడ్డెన్లలో అల్లంముక్కలు లేవట. కాఫీలో పంచదారలేదట. ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు. ఖారాఖిల్లీలు కాస్త యెక్కువగా పంపండి. చుట్టలూ, సిగరెట్లూ, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్లపేకలు నిన్ననే చిరిగిపోయాయి. ఈపూ టింకో నాలు గెక్కువ పంపండి. మదరాసు నశ్యం మాట మరిచిపోకండి. శలవు. మఱి యాలస్యమైతే మాటదక్కదు. (అని నిష్క్రమించును.)
పురు:- ఏమి నిరంకుశాధికారము! ఏమి మిలటరీ ఫోర్సు! మగపెండ్లి వారన మరిడీ దేవతలు కారుగదా. (అనుచు లోన కేగును.)
పేర:- ఎనిమిదివేలకూ, యేభయ్యో, వందో వుంటాయి. యింతవఱకు నాచేతిలో పయిసా పడలేదు. ఇప్పుడే నాది నేను వడుక్కోవాలి కాని, ఆనక వీరిచ్చే దేమిటి చచ్చే దేమిటి. ఆనక వీరి కన్న ముంటే గద. ఈరోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక, యింకా వుండే దేమిటి, వుద్ధరి! తొలినా డడావడి, మలినా డాయాసం; మూడు మంగళాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు; ఆరు అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగువు; ఎనిమిది ఋణదాత నోటీసు; తొమ్మిది జవాబు; పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ; పదమూడు డిక్రీ; పద్ధానుగు టమటమా; పదిహేను వేలం; పదహారు చిప్ప. ఈ రోజుల్లో యిదే పదహారు రోజుల పండుగ. కాబట్టి, వెళ్ళీ కదిపి చూస్తాను. (నిష్క్రమించును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)