నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
సప్తమాంకము - మూడవ రంగము.

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి భోజనముల పందిరి.)
పురు:- ఇప్పుడు రెండుగంట లైనది. ఇంతవర కొక్కరును రాలేదు. వంటలు చల్లారిపోవుచున్నవి. వంటవారు కస్సుమనుచున్నారు.
సీ. పిలిచిన బలుకక - బిగఁ దన్నుకొని లోన
    ముసుఁగుఁ బెట్టెడు శుద్ధ-మూర్ఖుఁ డొకఁడు
ఇదె వత్తు మీ వెన్క-నే మీరు పొండని
    చుట్ట ముట్టించెడు - శుంఠ యొకఁడు
ఒగిఁ దనకై వేచి - యుంద్రొ లేదో చూత
    మని జాగు సల్పెడి - యల్పుఁ డొకఁడు
ముందు వచ్చినఁ బర్వు - ముక్కలౌ ననుకొని
    కడను రాఁజూచు ము-ష్కరుఁ డొకండు

కుడిచి యింటను హాయిగాఁ - గూరుచుండి
వత్తురానని చెప్పని - వాజె యొకఁడు
వచ్చి కోపించిపోవు ని-ర్భాగ్యు డొకఁడు
ఆఱువేల్వారి విందుల - తీరు లివ్వి.
పేర:- (వగర్చుచుఁ బ్రవేశించి) బాబూ, యీపూట నామచ్చ మాసింది. తిరిగి తిరిగి తిరిగి కాళ్ళు విరిగాయి. (అని కూలఁబడును.)
పురు:- ఏ మన్నారు? పెండ్లివా రెవరైన వచ్చుచున్నట్లా?
పేర:- ఏం పెళ్ళివారు, ఏం రావడం. పోలీసువారిచేత పొడిపించినందుకు బయటకువస్తే బ్రాహ్మలు చంపేస్తారని, యీపూట లింగరాజుగా రింట్లోనే అత్తీసరు వేయించుకుని ఆరగించారు.
పురు:- కడమవారు?
పేర:- ఇదిగోవస్తున్నా. లింగరాజుగారి మొదటిభార్య మేనమామ బావమరిది తోడల్లుడు తమ్ముడట, ఆయనకీపూట యిడ్డెన్లలో అల్లం ముక్కలు తక్కు వైనాయట, అందుకోసం అలిగి కూర్చున్నాడు. పెళ్ళికొడుకు జనకసంబంధంబాపతు పినతండ్రిగారి సవతితల్లి తమ్ముడు బావమరిదికి వేలువిడిచిన మేనమామకొడుకట. ఆయనకు రాత్రి చిన్నపీట వేశారట. అందుకోసం భీష్మించి కూర్చున్నాడు. వియ్యపురాలిగారి అన్న పిన్నత్తగారి ఆడపడుచు తోడికోడలు సవతితల్లి తమ్ముడు మేనమామగారి మేనత్తకొడుకు మేష్టరుగారితో వచ్చిన స్నేహితుఁడు గారట. ఆయన్ని రాత్రి మీరందరితోపా టాదరించలే దట, అందుకోసం రైలుకు పోతానని రంకెలు వేస్తున్నాడు. స్టూడెంట్లకు రాత్రి బంగాళాదుంపల కూరా, పకోడీల పులుసూ చేయించారు కారట, అందుకోసం వారీపూట వెళ్ళడం మానివేదామా అని ఆలోచిస్తున్నారు. వారంతా రానిది మే మెల్లా వస్తా మని కడంవారు కాళ్ళు చాచుకు కూర్చున్నారు. ఇక తమరు వెళ్ళి తంటాలు పడవలసినదే కాని నావల్లకాదు.
పురు:- ఊరివారు?
పేర:- వూరివారు మామూలుపాటే "యిదుగో వస్తున్నాం పదండి."
పురు:- రామమూర్తిగారు రాలేదేమీ?
పేర:- పట్టుబట్ట మరచెంబూ తేవడానికి బ్రాహ్మడు దొరకలేదట, బ్రాహ్మణ్ణి వెతికించడానికి కూలిమనిషి కోసం బయల్దేరారు.
పురు:- చైనులుగారో?
పేర:- నిన్న తలవెంట్రుక లున్న పూర్వసువాసినీ యెవరో వంటశాల వైపునకు వచ్చిం దట, పాప మందుకోసం ప్రాయశ్చిత్తం చేయించుకుంటున్నారు. ఈ పూట శాకపాకా లేమి టని అడిగితే, పనసకాయ కూరా, పులిహోరా, బొబ్బట్లు, బూన్దీ మిఠాయి అని చెప్పాను. అయితే, అయిదు నిముషాల్లో వస్తాను, పద మన్నారు.
పురు:- అచ్యుతరామయ్యగారో?
పేర:- ఈ మధ్య బ్రహ్మసమాదిగా డెవరో పైఅధికారిగా వస్తే ఆయనకోసం యజ్ఞోపవీతాలు తీసి పారవేశారట. నిన్న చొక్కాతో వస్తే నలుగురూ నవ్వారట. సాయంకాలానికి జంధ్యం సంపాదించుకుని వస్తానన్నారు.
భ్రమ:- (కోపముతోఁ బ్రవేశించి) పేరయ్యగారూ! ఏరి యేరి చివర కెంతచక్కని సంబంధము సంపాదించినారండి! వారి లాంచనములు వారు పుంజాలు తెంపి పుచ్చుకొనుచున్నారు! మన కీయవలసి వచ్చినప్పుడు "మా కానవాయిత లే"దనుచున్నారు. మన మిచ్చిన కట్నమునుబట్టి మంగళహారతిలో మన కైదు నూట పదాఱులు రావలెను గదా? వారు వరహాకంటె వేయరట!
పురు:- ఈమాట చెప్పుట కేనా నీవిపుడు వచ్చినది?
భ్రమ:- ఇదికాదు. ఈపూట వియ్యపురాలి పినతల్లికూతురు తోడికోడలియక్క యాఁడుబిడ్డ సవతి మొగమున నద్దిన మొహిరీ మోటుగా నున్నదఁట. అందులకై యామె యలిగినదఁట. వియ్యపురాలు విచారించుచుఁ గూర్చున్నదఁట. అమ్మలక్క లందఱుఁ జుట్టును మూఁగి యామెకుఁ బురెక్కించుచున్నారఁట.
పురు:-

సరే వెళ్ళి కాళ్లమీదఁ బడి కటాక్షింపుమని వేడుదము పద! పేరయ్యగారు, నేను వచ్చువరకును మీరిచ్చట నుండుఁడు.

(అని భార్యతోఁ బరిక్రమించి, ఆకసమువంకఁ జేతులు జోడించి)

గీ. ఆఁడుబిడ్డ పెండ్లి - అతి లోభితోఁడఁ జు
ట్టఱిక మెముకలెల్లఁ - గొరుకు లౌక్య
జాతి కింట విందు - సర్వేశ్వరా! పగ
వారికి న్విధింప - వలదు, వలదు.
(తెరపడును.)
ఇది సప్తమాంకము.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)