నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
అష్టమాంకము - మొదటి రంగము.

(ప్రదేశము: వెఱ్ఱిబుఱ్ఱల వెంగళప్పగారి కచేరి చావడి.)
వెంగ:- (పడకకుర్చీలోఁ బరుండి) అదిగో! పదికూడా అయినది. ఇప్పటికొక్క పార్టీ రాలేదు; ఇంకావచ్చే దేమిటి? ఈ విధంగా వున్నది వ్యాపారం! పది కొట్టేసరికి పాగా, కోటూ, తగిలించుకుని సాయలవాళ్లలాగు చక్కాబోయి, కచేరీకాంపౌండులలోనూ, రైలుస్టేషనులవద్దనూ, ఘాటీపాకలవద్దనూ కూడా కాచి మనిషి కంటబడేసరికి మరిడీ దేవతవలె పట్టుకుంటూ వుంటే యెందరికని యేడుస్తవి కేసులు! ఈరోజులలో నాలుగే వృత్తులు. ఒకటి సిగరెట్ల దుకాణం. రెండు కాఫీహోటలు. మూడు మెడికల్‌ ప్రాక్టీసు, నాలుగు ప్లీడరీ. యేసందులోకి వెళ్ళి, యే గుమ్మంవంక చూచినా ఏ 'సిటీసిగరెట్‌ స్టోర్సు' బోర్డో, యే 'మైసూరు మహాలక్ష్మీవిలాస్‌ కాఫీక్లబ్బు' బోర్డో, యే 'ఏ.డి.రాజు, ఎల్‌.ఎమ్‌.యస్‌. మెడికల్‌ ప్రాక్టిషనర్‌' బోర్డో, యే 'బీ. వీ. రాఘవాచారి, బి.యే.,బి.యల్‌. హైకోర్టు వకీలు' బోర్డో ప్రత్యక్షం! ఈ నాలుగు వృత్తులలో కాఫీహోటలు ఫస్టు; ప్లీడరీ లాస్టు! నాన్‌కోవాపరేషను కొంత నాశనం చేస్తే స్టాంపుడ్యూటీ పెరిగి సర్వం నాశనం చేసింది! ఈ తాలూకాబోర్డు ప్రెసిడెంటు పదవే రాకపోతే యీపాటి కీబీరువా లమ్ముకొని పోవలసిందే! దీనితల్లీ బొడ్డు పొక్క, దీనికీ వచ్చా యిప్పుడు తిప్పలు! పోయిన సంవత్సరం అమాంబాపతులూ అయిదువేలు గిట్టాయి. ఈసంవత్సరం టి.యే. ఫిక్సెడ్డు చేసి, మానోట్లో మన్ను కొట్టారు! ఇదిపోతే యిక, కంట్రాక్టర్ల కమీషను ఈ సంవత్సరం వాళ్ళివ్వవల్సిందికూడా నిరుడే వాడుకున్నాను. ఇక వాళ్ళిచ్చే దేమిటి, చచ్చేదేమిటి? పోతే, యిక, చచ్చుముండా స్కూలు టీచర్లున్నారు. ఫయినులు వేసీ, బదిలీలు చేసీ, బర్తరఫులు చేసీ గోలయెత్తేస్తే ఒక్కొక్క నెలజీతం వూడిపడేసేరికి చుక్కలు రాల్తాయి. పయివాళ్ళను తగ్గించి, బంధువులను తెచ్చిపెట్టుకోవడం మొదలు పెట్టాక అదీ అఘోరంగానే వుంది! ఈకాకిపిండా లైనా ముట్టకుండా స్వరాజ్యపార్టీవా రిక్కడకూడా సన్నాహాలు మొదలుపెట్టారు. ఎలక్షనురోజులు దగ్గిర పడుతున్నాయి! వెనుకటిలాగే వోట్లు కొందామంటే వెనుకటి ఋణమే యిప్పటికింకా తీరలేదు. బాగా వచ్చేటప్పుడు వొల్లు తెలియక బ్రాందిదగ్గరనుంచీ అలవాటు చేసుకున్నాను. ప్రాతఃకాల మయ్యేసరికి బాటిల్‌ కావాలి. ఈ తిప్పలకుతోడు యింటిదాని బా ధొకటి పట్టుకున్నది! ఫస్టు తారీఖున రెండు పెద్దకాసులూ చేతులో పెట్టకపోతే చెప్పుదెబ్బలు తప్పవు! ఆరాత్రి దానికంట పడడము చేత, ఆవిధంగా రాజీ చేసుకోక తప్పిందికాదు. ఎవరో వచ్చుచున్నారు! (అని లేచి, గంభీరముగాఁ గూరుచుండును.)
ఒక టీచరు:- (చేతులు కట్టుకొని ప్రవేశించి, నమస్కరించి) అయ్యా! నేను అచ్చన్నపేట స్కూలుతాలూకు అయిదో టీచర్నండి.
వెంగ:- అయితే, యేమంటావు? ఆ నంగినంగివేషా లేమిటి?
టీచ:- వల్లూరులో నాభార్య కనలేక మూణ్నాళ్ళనుంచి కష్టపడుతూ వుందండి. రెండురోజులు సెల విప్పిస్తే వెళ్ళివస్తానండి.
వెంగ:- నీభార్య కష్టపడుతూ వుంటే, నీ వెందుకు యేడవనూ? నీవు కనిపిస్తావా? లేక, వకాల్తానామా పుచ్చుకొని నీవే కంటావా?
టీచ:- డాక్టరు దొరసానిగార్ని తీసుకు వెళతానండి.
వెంగ:- అబ్బో! నీ మొహాని కది కూడానా! ఇనస్పెక్టరుగార్ని చూచావా?
టీచ:- చూచానండి. చూస్తే తమతో మనవి చేసుకో మన్నారు.
వెంగ:- అయితే, ఆపిడతను ముందుచూచి ఆపిడత వెళ్లమంటే అప్పుడు వచ్చావన్నమాట. ఫో! సెలవూలేదూ గిలవూలేదు ఫో!
టీచ:- (దైన్యముతో) అయ్యా! కటాక్షించాలి. కష్టసమయం.
వెంగ:- పొమ్మంటే పొయ్యావుకావు కనుక రెండురూపాయలు ఫైను.
టీచ:- మహానుభావులు! దైవస్వరూపులు, మన్నించాలి.
వెంగ:- ఫయినన్నా కదల్లేదు గనక, పదిహేన్రోజులు సస్పెంటు.
టీచ:- అధికార్లు ఆగ్రహపడితే నే నాగలేను. అనుగ్రహించాలి.
వెంగ:- సస్పెంటన్నా జంకావుకావు కనుక డిస్మిస్‌ చేశాను ఫో.
టీచ:- ఆరి ఛండాలుడా! ఆమాటకూడా అనేశావా; సరే? ఇంతేనా యిం కేమయినా చెయ్యగలవా? ఈమూడేళ్ళ ముష్టిపదివీ పోగానే, యింటింటా, అడుక్కుతినే యోగం నీకుగాని యీపాటి కాటికాపరి పని మాకు దొరకకపోదు. అదిగాక నీవంటి అధమాధముల కాలంలో, హడలిపోతూ నవుకరీ చెయ్యడం కంటె యాయవార మెత్తుకున్నా మంచిదే. శేషాద్రిగారి చెప్పులుమోసి, కామరాజుగారి కాళ్ళుగుద్దీ మాలవాడికి వంటింట్లో మంచంవేసీ వారికి సాధ్యంకాని వోట్లకు వందలకు వందలు సమర్పించీ, యీ సామ్రాజ్యం సంపాదించావు! అయితేయేమీ ఆపడ్డపా టల్నీ అప్పుడే దులిపేశావు! అల్పున కధికారం పట్టినా, ఆడదానికి వైధవ్యం వచ్చినా, యెద్దు కచ్చుపోసినా, యేనాదికి పెత్తనమిచ్చినా, క్షణంలో స్వరం మారుతుం దన్నవాఁడు వెఱ్ఱివాఁడా! ఏమి విపరీతకాలం వచ్చిందో! యెక్కడ చూచినా మునిసిపాలిటీలూ, లోకలు బోర్డులూ, నిరక్షర కుక్షులతోనో, నీవంటి నీచాతినీచులతోనో నిండిపోతున్నాయి! అయిందాకా, అడ్డమైనగడ్డి కరవడం! అయిందనగానే, ఆకాశం ముట్టడం! ఇదీ ఇప్పటి మర్యాద! అయినా, మీ యాపద మ్రొక్కులు నమ్మి మీలాంటివాళ్ళకు వోట్లిచ్చేవారి ననాలిగాని మిమ్మనవలసిన పనిలేదు! మీకు వోట్లివ్వడంవల్ల మీపాపాల్లో భాగం పంచుకోవలసి వుంటుందన్న సంగతి తెలిస్తే వొక్కరైనా మీకు వోటిస్తారా? నీకూ కాలం దగ్గిర పడ్డది! కాకపోతే, కళ్ళింత మూసుకుపోవు! ఇనస్పెక్టరుగారిమీద నీకింత కడుపుమం టెందుకూ? నీతో గలిసి నీపాటకు తాళం వేశారు కారనేనా? ఆయన చెప్పులు మొయ్యడానికైనా నీ కర్హత వున్నదా; నీవు చేసిన దారుణాలకు, నీగుండెల్లో గునపంలాగు, ఆమహారాజు కాస్త అండగా వుండబట్టే, యింత అన్నం తిన్నాం! ప్రతివార్నీ పిడత పిడతంటావు! పిడతేమిటి, నీ పిండాకూడు! ఎంతమంది నీజీవానికిపడి యేడుస్తున్నారో, యెందరి వుసురు నీ యింటా వంటా చుట్టుకుంటూ వుందో యెరక్క యింత పొంగి బోర్ల పడుతున్నావు! భగవంతుడు మామొర వినకా పోడు, పటుక్కున నీదుంప తెంపకాపోడు! ఈసారి నిన్నెల్లాగా యీడ్చిపారేస్తారు. ఈమాటలుమాత్రం మనస్సులో వుంచుకో! ఇక సెలవు! (నిష్క్రమించును.)
వెంగ:- హమ్మా! హమ్మా! యెంతలేసి మాట లన్నాడు! ఆ వెధవ అల్లా దులిపేస్తూవుంటే, పాడునోరు పైకి లేచిందే కాదేం? ఇదే కామోసు గిల్టీకాన్షన్సంటారు! నిజంగా యింతనిర్భాగ్యపు వెధవను నే నిదివరకెన్నడూ కాలేదు. నా ధూం ధాములు చూచి, నలుగురు టీచర్లూ నా అంతవాడు లేడనుకునేవారు. ఈసంగతి తెలిస్తే యిక నన్నెవడైనా లక్ష్య పెడతాడా! సమయానికి చాకలి వెధవకూడా లేకుండా పోయాడు! అవసరానికి లేకపోయినందు కావెధవను డిస్మిస్‌ చేసి తీరుతాను! అదెవరు?
లింగ:- (ప్రవేశించి) ఈపూఁట పంతులుగా రింత తీరికగానున్నారేమి?
వెంగ:- దయచెయ్యండి! యేమి తీరిక, యేమిలోకం! పార్టీలంతా యిప్పుడే బసలకు పోయారు. ఎవరో టీచరువచ్చి, యేదో చెప్పుకుంటుంటే వింటున్నాను. ఏమిటి సమాచారం? కూర్చోండి!
లింగ:- (కూర్చుండి) పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తెను మాపిల్లవాని కిచ్చిన సంగతి మీరెఱిగినదే గదా? వివాహకాలమున నాలుగువేల రూపాయల నగ లుంచినారు. వివాహమై మూడేండ్లు కావచ్చినది. పిల్లను గాఁపురమునకు బంపరు. మానగలు మాకిమ్మన్న మాటాడను మాటాడరు. అసలు రహస్య మేమా? ఆనగలు మనవి కావు. తరువాతఁ జూచుకొంద మని తాకట్టు వస్తువులు తీసి తగిలించినాను. తాకట్టు పెట్టినవా రిపుడు నన్ను తాటించుచున్నారు.
వెంగ:- కార్యంకాగానే చల్లగా సంగ్రహించుకోక పోయారా?
లింగ:- అప్పటి నాయభిప్రాయ మదే. కాని సాగినది కాదు. ఆపిల్ల యేలాగుననో నాయభిప్రాయము కనిపెట్టి అందుల కవకాశము చిక్కనిచ్చినది గాదు.
వెంగ:- ఆపిల్ల కిప్పు డెన్నో యేడు?
లింగ:- పదునాఱవ యేఁడు ప్రవేశించినది.
వెంగ:- అయితే, మైనార్టి వదలలేదన్నమాట. అబ్బాయికో?
లింగ:- పందొమ్మిది.
వెంగ:- సరే, దానికేం, ముందో నోటీసుముక్క వ్రాసి పారేసి అబ్బాయి పేరుతో, తక్షణం తండ్రిమీద దావా దాఖలు వేదాం!
లింగ:- తండ్రిమీఁదనే కాదు. దానినిగూఁడఁ గోర్టునకీడ్చి తెప్పించి నలుగురిలో నగ లూడ దీయించినఁ గాని నా కసి తీఱదు.
వెంగ:- అదెంతపని? పసిపిల్లను నగలతో పరారీ చెయ్యడానికి సిద్ధంగా వున్నారని చెప్పి, యింజక్షను ఆర్డరు పుచ్చుకుని, యిట్టే యీడ్పించుకు రావచ్చును. కోర్టులో మన మాటంటే యిపుడు కోటిరూపాయల క్రింద చెలామణీ అవుతూవుంది.
లింగ:- ఇంకొకటి. మనకు మనోవర్తి బాధ లేకుండా ఈ సంబంధ మింతటితోఁ దప్పిపోవు దారికూడఁ జూడవలెను.
వెంగ:- దాని కేముంది? ప్రతిరాత్రీ మునసబుగారు పేకాటకు మనఇంటికి వస్తూనే వుంటారు. ఇది నా స్వంతవ్యవహారం వంటిదని చెప్పితినా, ఆయన స్వంతకార్యం క్రింద జూస్తారు.
లింగ:- సరే, సాయంకాల మబ్బాయినిఁ గూడఁ దీసికొని వచ్చెదను. మీరు కోర్టునుండి రాఁగానే నోటీసు వ్రాయుఁడు. (అని లేచును.)
వెంగ:- వచ్చేటప్పుడు ఫీ జేమయినా తెచ్చి జమకట్టిస్తారు గాదూ?
లింగ:- అయ్యో, దానికేమీ? ఆమాట మీరు చెప్పవలెనా? (కొంచెము పరిక్రమించి) ప్లీడరింటఁ గాలు పెట్టగానే, ఫీజుగోల సిద్ధము! ఫీజు ముట్టువఱకుఁ ప్లీడరు పిశాచమే!
గీ. రోగి చావనీ, బ్రతుకనీ - రొక్క మెటులొ
లాగ జూచును వైద్యుఁడు - లాఘవముగ;
వ్యాజ్యె మోడనీ గెల్వనీ - వాట మెఱిఁగి
పిండుకొనఁ జూచు ప్లీడరు - ఫీజు ముందె!
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)