నాటకములు వరవిక్రయము (1923) కాళ్లకూరి నారాయణరావు
అష్టమాంకము - రెండవ రంగము.

(ప్రదేశము: కమల గది.)
కమ:- (నూలు వడుకుచు) కనుకనే పెద్దలు కదురు తిరిగినను, కవ్వము తిరిగినను కాటక ముండదని చెప్పుదురు. సందియ మేమి?
గీ. రాట్నపుఁజక్ర మిటు లహో-రాత్రములును
గాలచక్రంబు కైవడిఁ - గదిలెనేని
విష్ణుచక్రంబువలె క్షామ - విదళనంబు
చేసి, భూచక్ర మెల్లను - జేత నిడదె!

ఎందులకుఁ జెపుమా నాన్నగారు వచ్చుచున్నారు! (అని లేచును.)

పురు:- (కాగితము చేతఁ బట్టుకొని ప్రవేశించి) అమ్మా వియ్యంకుఁడుగారు చివరకు వీధి కెక్కినారు! ఇదిగో నోటీసు.
కమ:- ఏమని?
పురు:-

చదివెద వినుము. (అని యిట్లు పఠించును.)

"బి.యే, బి.యల్‌. హైకోర్టు వకీలు, వెఱ్ఱిబుఱ్ఱల వెంగళప్పగారి వద్దనుంచి, పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి, అయ్యా! మా క్లయింటు సింగరాజు బసవరాజుగారికి మీ కొమార్తె కమలను యివ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టున్నూ, వివాహకాలంలో మాక్లయింటు మీపిల్లకు నాలుగువేలు రూపాయల కిమ్మత్తుగల నాడెమైన బంగారం నగలు వుంచబడ్డట్టున్నూ, సదరు నగలను మీరు హరించడం దురుద్దేశ్యంతో, సదరు చిన్నదాన్ని కాపరానికి పంపకుండా వుండబడ్డట్టున్నూ, మీపైన దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సమజాయిషీ యివ్వబడి వున్నారు. ఈ నోటీసు అందిన యిరవైనాలుగు గంటలలోగా, సదరు వస్తువులు సహితం పిల్లను కాపురానికి పంపబడి మావల్ల క్రమమైన రశీదు పొందకుండా వుండబడే యడల, మీ వగైరాలపైన దావా చెయ్యడమే కాకుండా, మీవల్ల యావత్తు ఖర్చులున్నూ రాబట్టుకోబడడం కాబడుతుం దనీ యిందు మూలంగా తెలియశాయడ మైనది. ఈనోటీసు తాలూకు ఖర్చులుగూడా పిల్లతో పంపబడేది. చిత్తగించవలెను. వెఱ్ఱిబుఱ్ఱల వెంగళప్ప."
కమ:- సరే, దీనికి సమాధాన మేమియుఁ వ్రాయ వలదు. దావా కూడ దాఖలు కానిండు.
పురు:- అమ్మా! నీ యభిప్రాయ మేమో నాకు బోధపడ లేదు. "నన్నిప్పు డేమియు నడుగ వలదు. సమయము వచ్చినప్పుడు సర్వముఁ దేటపడఁ గల"దని నీవాదిలోఁ జెప్పియుండుటచేత ని న్నేమియు నిరోధించి యడుగ లేదు. కాని, యేమి యపకీర్తి వచ్చునో యను నాందోళనము మాత్రము లేకపోలేదు. అదిగాక,
గీ. పరులకుం దాస్య మొనరించి - పరువు మాలి
బ్రతుకఁ జూచుటకంటెను - బస్తు మేలు!
సరస మెఱుఁగనివారితో - జగడ మాడి
కోర్టు కెక్కుట కంటెను - గొఱత మేలు!
కమ:- అది నిజమే కాని యీవ్యవహార మట్టిది కాదు. దీనికై మీ రించుకయు దిగులు పడవలసిన పనియు లేదు. సర్వము నాకు విడిచిపెట్టి మీరు శాంతమనస్కులరై యుండుడు.
పురు:- సరే కానిమ్ము. నీ మాటయే నాకు నిట్రాట. (నిష్క్రమించును.)
కమ:- (ఆకసమువంకఁ చేతులు జోడించి) ఓ సర్వేశ్వరా!
ఉ. గట్టిగ నిన్నె నమ్ముకొని, - కష్టము లోర్చినవారి నేరి, చే
పట్టి, భరించు కేవల కృ-పామయమూర్తి వటంచు నెట్టనం
బట్టితి నీదు పాదములు, - బాలను, బేలను, దీనురాల న
న్నెట్టులు తేల్చెదో! తరుణ - మియ్యదియే సుమి డాయ వచ్చెడున్‌.
(తెరపడును.)
ఇది అష్టమాంకము.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - varavikrayamu - kALlakUri nArAyaNarAvu - vara vikrayaM varavikrayam Kallakuri Narayana Rao Kallakuri Narayanarao kaallakoori naaraayana raavu telugu natakamulu telugu natakam telugu play telugu stage play ( telugu literature andhra literature)