శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. కంటి నదీతటంబుఁ బొడఁగంటిని భద్రనగాదివాసముం
గంటి నిలాతనూజ నురు కార్ముకమార్గణ శంఖచక్రముల్‌
గంటిని మిమ్ము లక్ష్మణునిఁ గంటి కృతార్థుడనైతి నో జగ
త్కంటక దైత్యనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!
21
చ. హలికునకున్‌ హలాగ్రమున నర్థము చేకురుభంగి దప్పిచే
నలమటఁజెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు
ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడఁగూర్చి నీపయిం
దలపు ఘటింపఁజేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ!
22
ఉ. కొంజక తర్కవాదమను గుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్‌
రంజిలఁద్రవ్వి కన్గొనని రామనిధానము నేఁడు భక్తి సి
ద్ధాంజనమందు హస్తగత మయ్యె భళీయనగా మదీయహృ
త్కంజమునన్‌ వసింపుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ!
23
ఉ. రాముఁడు ఘోరపాతకవిరాముఁడు సద్గుణకల్పవల్లికా
రాముఁడు షడ్వికారజయరాముఁడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁ గెం
దామరలే భజించెదరు దాశరథీ! కరుణాపయోనిధీ!
24
ఉ. చక్కరమాని వేము దినఁజాలిన కైవడి మానవాధముల్‌
పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెద రట్లకాదయా
మ్రొక్కిన నీక మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెన్‌
దక్కినమాట లేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!
25
ఉ. రాకలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై
దీకొనిఁ బ్రోచు నిక్కమని ధీయుతులెన్నఁ దదీయవర్ణముల్‌
గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక విపత్పరంపరల్‌
దాకొనుచే జగజ్జనుల దాశరథీ! కరుణాపయోనిధీ!
26
ఉ. "రామహరే కకుత్స్థకుల రామహరే రఘురామరామ శ్రీ
రామహరే" యటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామనివాసులౌదుఁరట దాశరథీ! కరుణాపయోనిధీ!
27
ఉ. చక్కెర లప్పకున్‌ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకుఁ జొక్కులుచుం గనలేరుగాక నేఁ
డక్కట రామనామ మధురామృతమానుటకంటె సౌఖ్యమా
తక్కినమాధురీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
28
ఉ. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్‌
కొండలవంటివైన వెసఁ గూలి నశింపకయున్నె సంతతా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ! కరుణాపయోనిధీ!
29
ఉ. చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీఁగడ పంచదారతో
మెక్కినభంగి మీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువపళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్‌
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )