శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్‌ హనుమంతుఁ డార్తి సో
దరుఁడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్‌
గరుణఁ దరిల్ప మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
31
చ. హలి కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో
జ్జ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలవునఁజేర్చి కావగఁదె దాశరథీ! కరుణాపయోనిధీ!
32
చ. జలనిధిలోనదూఱి కులశైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటి రక్కసుని యంగము గీటి బలీంద్రునిన్‌ రసా
తలమునమాటి పార్థివకదంబముగూర్చిన మేటి రామనా
తలఁపుననాటి రాఁగదవె దాశరథీ! కరుణాపయోనిధీ!
33
ఉ. భండనభీముఁ డార్తజనబాంధవుఁ డుజ్జ్వలబాణతూణ కో
దండకలాప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్‌
రెండవసాటిదైవమిఁక లేఁడనుచున్‌ గడగట్టి భేరికా
డాండ డడాండడాండ నినదంబు లజాండము నిండ మత్తవే
దండము నెక్కిచాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
34
ఉ. అవనిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ
కువలయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ
నవనవయౌవనంబను వనంబునకున్‌ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!
35
చ. ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచ ఢాకినీ
జ్వరపరితాప సర్వభయవారకమైన భవత్పదాబ్జవి
స్ఫురదురువజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో
ద్ధరబిరుదాంక యేమఱకు దాశరథీ! కరుణాపయోనిధీ!
36
ఉ. జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్‌
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే
జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్‌ గనువారిపదంబుఁ గూర్పవే
తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
37
ఉ. ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్‌ దరిద్రతా
కారపిశాచసంహరణకార్యవినోది వికుంఠమందిర
ద్వార కవాటభేది నిజదాసజనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!
38
ఉ. విన్నపమాలకించు రఘువీర! నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముఁడు బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ
కన్న మహాత్ముఁడుం బతిత కల్మషదూరుఁడు లేఁడునాకు వి
ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
39
ఉ. పెంపనుఁ దల్లివై కలుషబృందసమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై మెయువసించు దశేంద్రియరోగముల్‌ నివా
రింపను వెజ్జువై కృప గుఱించి పరంబు దిరంబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )