శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. కుక్షినజాండ పంక్తులొనఁగూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవు గావలదె పాపము లెన్ని యొనర్చినన్‌ జగ
ద్రక్షక కర్త వీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!
41
ఉ. గద్దరి యోగిహృత్కమల గంధరసానుభవంబుఁజెందు పె
న్నిద్దపు గండుఁదేఁటి ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్‌
ముద్దులు గుల్కు రాచిలక ముక్తినిధానమ రామ రాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ! కరుణాపయోనిధీ!
42
చ. కలియుగ మర్త్యకోటి నినుఁ గన్గొనరాని విధంబొ భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధిఁగ్రుంకుచో
బిలిచినఁ బల్కవింతమఱపే నరులిట్లనరాదుగాక నీ
తలఁపునలేదే సీత చెఱ దాశరథీ! కరుణాపయోనిధీ!
43
చ. జనవర! మీ కథాళి విన సైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్‌ సలుపు నీచునకున్‌ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
దననుత! మాకొసంగుమయ దాశరథీ! కరుణాపయోనిధీ!
44
ఉ. పాపము లొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం
తాపముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ!
45
చ. అగణితజన్మకర్మదురితాంబుధిలోఁ బహుదుఃఖవీచికల్‌
దెగిపడ నీఁదలేక జగతీధవ నీ పదభక్తినావచేఁ
దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబుమాన్పవే
తగదని చిత్తమందిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
46
ఉ. నేనొనరించు పాపము లనేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యె మీపరమ పావననామము దొంటి చిల్క "రా
మా! ననుఁగావు"మన్న తుది మాటకు సద్గతిఁజెందెఁ గావునన్‌
దాని ధరింపఁగోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
47
చ. పరధనముల్‌ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్‌
మురిపముకాని మీఁదనగు మోసమెఱుంగదు మానసంబు దు
స్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే
తఱిదరిఁజేర్చి కాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!
48
ఉ. చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్‌
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
చేసితినేరముల్‌ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్య యయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
49
చ. పరుల ధనంబుఁజూచి పర భామల జూచి హరింపగోరు మ
ద్గురుతరమానసంబనెడు దొంగనుబట్టి నిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునఁ గట్టివేయఁగదె దాశరథీ! కరుణాపయోనిధీ!
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )