శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. సలలిత రామనామ జప సారమెఱుంగను గాశికాపురీ
నిలయుఁడఁగాను మీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియ నహల్యఁగాను జగతీవర! నీదగు సత్యవాక్యముం
దలఁపఁగ రావణాసురుని తమ్ముఁడగాను భవద్విలాసముల్‌
తలఁచి నుతింప నాతరమె దాశరథీ! కరుణాపయోనిధీ!
51
ఉ. పాతకులైన మీ కృపకుఁ బాత్రులు కారె తలంచి చూడ జ
ట్రాతికిఁగల్గె భావన మరాతికి రాజ్యసుఖంబము గల్గె దు
ర్జాతికిఁబుణ్యమబ్బె గపిజాతిమహత్త్వము నొందెఁగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!
52
ఉ. మామక పాతక వ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తు లే
మేమని వ్రాఁతురో శమనుఁడేమి విధించునొ కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ వినఁ జొప్పడదింతకుమున్నె దీనచిం
తామణి యెట్లుగాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!
53
ఉ. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ
దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే
జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ
దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ!
54
ఉ. దీక్షవహించి నా కొలది దీనుల నెందఱిఁ గాచితో జగ
ద్రక్షక తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నా మొఱఁజిత్తగించి ప్ర
త్యక్షము గావవేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!
55
ఉ. నీలఘనాభమూర్తివగు నిన్నుఁగనుంగొనఁగోరి వేడినన్‌
జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కిన రామనామ మే
మూలను దాచుకోఁగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!
56
చ. వలదు పరాకు భక్తజన వత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీ బిరుదు వజ్రమువంటిది కావకూరకే
వలదు పరాకు నా దురిత వార్ధికిఁదెప్పవుగా మనంబులో
దలఁతుమె కా నిరంతరము దాశరథీ! కరుణాపయోనిధీ!
57
ఉ. తప్పులెఱుంగలేక దురితంబులు సేసితినంటి నీవు మా
యప్పవుగావుమంటి నిఁక నన్యులకున్‌ నుదురంటనంటి నీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటనంటి నా
తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ!
58
చ. ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱడిఁగొంటి నేనెపో
పతితుఁడనంటిపో పతితపావనమూర్తివి నీవుగల్గ నే
నితరుల వేఁడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబొసంగు మీ
యతులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
59
ఉ. అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించినఁ జాలు దాన నిరసించెద నా దురితంబులెల్లఁ దూ
లించెదఁ వైరివర్గ మెడలించెదఁ గోర్కుల నీదుబంటనై
దంచెదఁ గాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )