శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. జలనిధులేడునొక్క మొగిఁ జక్కికిఁదెచ్చె శరంబు ఱాతినిం
పలరగఁ జేసెనాతిగఁ బదాబ్జపరాగము నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలఁప నగణ్యమయ్య యిది దాశరథీ! కరుణాపయోనిధీ!
61
ఉ. కోతికి శక్యమా యసుర కోటుల గెల్వను గెల్చెబో నిజం
బాతని మేన శీతకరుఁడౌట దవానలుఁడెట్టివింత మా
సీత పతివ్రతామహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్‌
ధాతకు శక్యమా బొగడ దాశరథీ! కరుణాపయోనిధీ!
62
ఉ. భూపలలామ రామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం
స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్‌
పాపఁగదయ్య రామ నినుఁ బ్రస్తుతిసేసెదనయ్య రామ సీ
తాపతి రామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
63
ఉ. నీ సహజంబు సాత్త్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప
ద్మాసనుఁడాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి గొడుగాకస మక్షులు చంద్రభాస్కరుల్‌
నీ సుమతల్పమాదిఫణి నీవె సమస్తముఁ గొల్చునట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ! కరుణాపయోనిధీ!
64
చ. చరణము సోఁకినట్టి శిల జవ్వనిరూపగు టొక్కవింత సు
స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణఁ దనర్చుమానవులు సద్గతిఁజెందిన దెంతవింత యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ! కరుణాపయోనిధీ!
65
ఉ. దైవము తల్లిదండ్రి తగుదాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్న తఱిఁబాపములెల్ల మనోవికార దు
ర్భావితుఁజేయుచున్నవి కృపామతివై నను గావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
66
ఉ. వాసవ రాజ్యభోగ సుఖవార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
ఉయాసకు మేరలేదు కనకాద్రిసమానధనంబు గూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్‌
వీసరబోవ నీవు పదివేలకుఁజాలు భవంబునొల్ల నీ
దాసునిగాఁగ నేలికొను దాశరథీ! కరుణాపయోనిధీ!
67
ఉ. సూరిజనుల్‌ దయాపరులు సూనృతవాదులలుబ్ధమానవుల్‌
వీరపతివ్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్‌ మహీ
భారముఁ దాల్పఁగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగలే రకట దాశరథీ! కరుణాపయోనిధీ!
68
ఉ. వారిచరావతారమున వారధిలోఁ జొఱఁబాఱిఁ క్రోధ వి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్‌
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్‌ మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ! కరుణాపయోనిధీ!
69
చ. కరమనురక్తి మందరము గవ్వముగా నహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో
ధరణిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
ధరము ధరించితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )