శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుఁడ
వ్వారిధిలోన డాఁగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిఁ దొంటి కైవడిని దక్షిణశృంగమునన్‌ ధరించి వి
స్తార మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
71
చ. పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీథి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపున్‌ విదలించి సురారిపట్టి నం
తటఁగృపఁజూచితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
72
చ. పదయుగళంబు భూగగన భాగములన్‌ వెసనూని విక్రమా
స్పదుఁడగు నబ్బలీంద్రునొక పాదమునం దలక్రిందనొత్తి మే
లొదవ జగత్త్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
73
చ. ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి భూ
సురవరకోటికిన్‌ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
74
చ. దురమునఁ దాటకం దునిమి ధూర్జటివిల్‌ దునుమాడి సీతనుం
బరిణయమంది తండ్రిపనుపన్‌ ఘనకాననభూమి కేఁగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరములఁ గూల్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
75
చ. అనుపమ యాదవాన్వయసుధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తి నీ
కనుజుఁడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ
తనయుఁడనంగ బాహుబల దర్పమునన్‌ బలరామమూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
76
చ. సురలునుతింపగాఁ ద్రిపుర సుందరులన్‌ వరియింప బుద్ధరూ
పరయఁగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించుచున్నప్పుడా
హరునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్రసాధనో
త్కర మొనరించితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
77
ఉ. సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల నుత్తమ తురంగమునెక్కి కరాసిఁబూని వీ
రాంక విలాసమొప్ప గలికాకృతి సజ్జనకోటికిన్‌ నిరా
తంక మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
78
చ. మనమున నూహపోహణలు మర్వకమున్నె కఫాదిరోగముల్‌
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకున్‌ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ!
79
చ. ముదమున కాటపట్టు భవమోహమద ద్విరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబునకాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికి నావ గదా సదాభవ
త్సదమల నామసంస్మరణ దాశరథీ! కరుణాపయోనిధీ!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )