శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. దురితలతానుసారి భయదుఃఖకదంబము రామనామ భీ
కరతర హేతిచేఁదెగి వకావకలై చనకుండ నేర్చు నే
దరికొని మండుచుండు శిఖదార్కొనినన్‌ శలభాదికీటకో
త్కరము విలీనమై చనదె దాశరథీ! కరుణాపయోనిధీ!
81
చ. హరిపదభక్తి నింద్రియజయాన్వితుఁ డుత్తముఁడింద్రియంబులన్‌
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారవశ్యుఁడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!
82
చ. వనకరిచిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేఁదుఱు జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేఁటి తరమా యిరుమూఁటిని గెల్వనైదుసా
ధనములనీవె కావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!
83
చ. కరములు మీకు మ్రొక్కులిడఁ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణఁ దనర్ప వీనులు భవత్కథలన్‌ వినుచుండ నాస మీ
యఱుతనుబెట్టు పూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ! కరుణాపయోనిధీ!
84
చ. చిరతరభక్తి నొక్కతులసీదళ మర్పణ సేయువాఁడు ఖే
చరగరుడోరగ ప్రముఖసంఘములో వెలుఁగన్‌ సదాభవత్‌
స్ఫురదరవింద పాదములఁ బూజలొనర్చినవారికెల్లఁ ద
త్పర మఱచేతిధాత్రిగద దాశరథీ! కరుణాపయోనిధీ!
85
ఉ. భానుఁడు తూర్పునందు గనుపట్టినఁ బావక చంద్రతేజముల్‌
హీనతఁజెందినట్లు జగదేకవిరాజితమైన నీ పద
ధ్యానముచేయుచున్నఁ బరదైవమరీచులడంగకుండునే
దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!
86
ఉ. నీ మహనీయతత్త్వ రసనిర్ణయబోధకథామృతాబ్ధిలోఁ
దామును గ్రుంకులాడక వృథా తనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థములనెల్ల మునింగిన దుర్వికార హృ
త్తామసపంకముల్‌ విడునె దాశరథీ! కరుణాపయోనిధీ!
87
ఉ. కాంచన వస్తుసంకలిత కల్మషమగ్నిపుటంబు బెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ! కరుణాపయోనిధీ!
88
ఉ. నీ సతి పెక్కుగల్ములిడ నేర్పరి లోక మకల్మషంబుగా
నీ సుత సేయు పావనము నిర్మితి కార్యధురీణదక్షుఁడై
నీ సుతుఁడిచ్చు నాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే
దాసుల కీప్సితార్థములు దాశరథీ! కరుణాపయోనిధీ!
89
ఉ. వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దనువంటని కుమ్మర పుర్వురీతి సం
సారమునన్‌ మెలంగుచు విచారగుఁడై పరమొందుగాదె స
త్కారమెఱింగి మానవుఁడు దాశరథీ! కరుణాపయోనిధీ!
90
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )