శతకములు దాశరథి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. ఎక్కడి తల్లితండ్రి సుతులెక్కడివారు కళత్రబాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తనువెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్నవాఁ
డొక్కఁడె పాపపుణ్యఫల మొందిననొక్కడె కానరాడు వే
ఱొక్కఁడు వెంటనంటిభవ మొల్లనయా కృపఁజూడవయ్య నీ
టక్కరి మాయలందిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
91
ఉ. దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్‌
మెఱపులుగాగజూచి మఱి మేదినిలోఁ దమతోడివారు ముం
దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము
ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
92
చ. సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడు దలంచి పుణ్యముల్‌
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁగల్గునె గాలిచిచ్చుపైఁ
గెరలినవేళఁ దప్పికొని కీడ్పడువేళ జలంబుగోరి త
త్తరమునఁ ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ!
93
ఉ. జీవనమింకఁ బంకమునఁ జిక్కినమీను చలింపకెంతయున్‌
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలఁమైనగాని గుఱి దప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ!
94
చ. సరసుని మానసంబు సరసజ్ఞుఁడెఱుంగును ముష్కరాధముం
డెఱిఁగి గ్రహించువాడె కొలనేక నివాసముఁగాగ దర్దురం
బరయఁగ నేర్చునెట్లు వికచాబ్దమరంద రసైక సౌరభో
త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ!
95
ఉ. నోఁచిన తల్లితండ్రికిఁ దనూభవుఁడొక్కడె చాలు మేటి చే
చాఁచనివాఁడు వేఱొకఁడు చాచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్‌
దాఁచనివాఁడు భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
96
ఉ. "శ్రీయుత జానకీరమణ చిన్మయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహి"యని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం
బాయక కిల్బిష వ్రజ విపాటనమందఁగజేసి సత్కళా
దాయి ఫలంబు నాకియవె దాశరథీ! కరుణాపయోనిధీ!
97
ఉ. ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్‌
సంతసమందఁజేసితివి సత్కులజన్మమ దేమిలెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
98
ఉ. బొంకనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం
జంకనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం
గొంకనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా
తంకమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ!
99
చ. భ్రమరము గీటకంబుఁగొని పాల్పడి ఝాంకరణోపకారియై
భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమును ధరించుటేమరుదు దాశరథీ! కరుణాపయోనిధీ!
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dAsharathi shatakamu ( telugu andhra )