శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
శా. చన్నే నిన్నును బాలుఁగాఁ దలఁచి యిచ్చం బూతనాకాంత దాఁ
జన్నుల్నిండఁగఁ జేఁదుఁ బూసికొని యా చన్బాలు నీకిచ్చినం
జన్నుంబాలకు లోనుగాక యసుర\న్‌ సాధించి యాయింతికి\న్‌
సన్న\న్‌ ముక్తి యొసంగితీవు భళి కృష్ణా దేవకీనందనా.
11
మ. విలసిల్ల\న్‌ పదియాఱువేలసతుల\న్‌ వీక్షించి వారిండ్ల లో
పల వర్తించుచునుండి వీటఁ గల గోపస్త్రీలనెల్ల\న్‌ గడుం
బలిమి\న్‌ బట్టి రమించినాఁడవు భళీ ప్రాజ్ఞుండ వీవౌదు భూ
స్థలి నీవేకద కొంటెదేవరవు కృష్ణా దేవకీనందనా.
12
మ. పొలుపొంద\న్‌ నడిరేయిఁ గుక్కుట రవంబుల్‌ చూపి గోపాలకా
వళి విభ్రాంతులఁ జేసి మందలకునై వారేఁగఁ దత్కామినీ
కలనాయత్నము తామ్రచూడగతుల\న్‌ గావించి నీకీర్తి ర
చ్చల కెక్కెం గడుగొయ్యదేవరవు కృష్ణా దేవకీనందనా.
13
మ. అనిరుద్ధాచ్యుత యీశకేశవ ముకుందాధోక్షజోపేంద్రవా
మన దామోదర చక్రపాణి హలి రామా శౌరి శార్ఙ్గీ జనా
ర్దన పీతాంబర భక్తవత్సల నమో దైత్యారి వైకుంఠవా
స నృసింహాంబుజనాభ ప్రోవు ననుఁ గృష్ణా దేవకీనందనా.
14
మ. ఇల గోవర్ధన మెత్తితీ వనుచు బ్రహ్మేంద్రాదు లెంతో నినుం
బలుమారున్నుతులొప్పఁ జేసెదరు పద్మాక్షా కుచాగ్రంబునం
జులకన్నెత్తిన రాధనెన్న రిదిగో సొంపొంద సత్కీర్తి ని
శ్చలపుణ్యంబునఁ గాక చొప్పడునె కృష్ణా దేవకీనందనా.
15
శా. మౌళిం బింఛపుదండ యొప్పుగ నటింపంగౌను శృంగారపు\న్‌
శ్రీ లెంచంగను పిల్లఁగ్రోవి రవము\న్‌ జేకోలము\న్‌ జెక్కుచు\న్‌
గేల\న్‌ మెచ్చొనరింపఁ గోపకులతోఁ గ్రీడారసస్ఫూర్తి నీ
వాలం గాచువిధంబు నేఁ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా.
16
శా. పెచ్చుల్‌ ప్రేలుచుఁ బిల్లఁగ్రోవి రవము\న్‌ బెంపొందఁగాఁ జొక్కుచు\న్‌
నిచ్చల్‌ నిన్ను భజింప గోపగణము\న్‌ నిత్యోత్సవక్రీడమై
నెచ్చల్‌ మచ్చిక ముచ్చటచ్చుపడఁగా హెచ్చించి కీర్తించి నీ
సచ్చారిత్రము విన్నఁ బుణ్యమగుఁ గృష్ణా దేవకీనందనా.
17
మ. లలనాకుంచితవేణియుం దడవ మొల్లల్‌ జాఱ కస్తూరికా
తిలకంబుం గఱఁగంగ లేఁతనగవు\న్‌ దీపింప నెమ్మోమున\న్‌
దళుకుల్‌ చూపెడిచూపు లుల్లసిల నానారీతుల\న్‌ వేణుపు
ష్కలనాదంబులపెంపుఁ జూపుదువు కృష్ణా దేవకీనందనా.
18
మ. కలకాంచీమణికింకిణీమధురనిక్వాణంబు మంజీరమం
జులరావంబును గొంతకొంత వినవచ్చెన్‌ బట్ట లేనైతి నం
కిలి నిద్రించుట మోసపుచ్చె హితవాగ్గేయుండు నేఁడంచు ని
చ్చలు మీశౌర్యము లెంచు గోపతతి కృష్ణా దేవకీనందనా.
19
మ. కలనైన\న్‌ నగియైనఁ గోప మెసఁగంగా నైన మీనామ ని
ర్మలవర్ణద్వయ మెవ్వరేఁదలఁచినం బాపౌఘముల్వాయును
జ్జ్వలభాన్వప్రతిమానచండకిరణవ్రాతాహతిం జీఁకటుల్‌
చలనం బంది తొలంగుచందమునఁ గృష్ణా దేవకీనందనా.
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )