శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
మ. విలసత్కావ్యకళాధురీణతలు తద్విజ్ఞానులైనట్టి వే
త్తలకుం గాకవి యేల మూర్ఖులకు గాధల్‌ జెందు భాగీరథీ
దళితాంభోరుహ షండమండిత మరందగ్రాస మాధుర్యవాం
ఛలు జోరీఁగల కేల తేంట్లగతి కృష్ణా దేవకీనందనా.
31
మ. చతురంభోధిపరీత భూవలయరాజానేకకోటీర రం
జితమాణిక్యవిరాజమానపద రాజీవుండు ధర్మాత్మజుం
డతికారుణ్యముచేత మత్స్యపతికొ ల్వాసింపఁడే నీదు శా
శ్వత కారుణ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా.
32
మ. శుకమద్గౌతమ కణ్వ కుత్స జమదగ్న్యోదంక శాండిల్య శౌ
నక పారాశర కశ్యపాత్రి ఘటజాహ్నేంద్ర ప్రభూత త్రియం
బక కంజోద్భవ నారదాదిమునిహృత్పంకేజ సౌమ్యత్పిపా
సకృపాసాగర నీకు మ్రొక్కెదను కృష్ణా దేవకీనందనా.
33
మ. వివిధోగ్రస్థవన ప్రచండబలవిద్వేషావనీనాయకో
త్సవభంజీకృతశాలి యర్జునుఁడు దోస్సత్వుండు మత్స్యావనీ
ధవుగేహంబున నాట్యతాళధరియై తా నిల్వఁడే సన్ముని
స్తవ నీసత్కృప గల్గునంతకును కృష్ణా దేవకీనందనా.
34
మ. బలభేది న్నలయించి ఖాండవవని\న్‌ భస్మంబు గావించి ము
న్నెలమి\న్‌ దైత్యులఁద్రుంచి యొక్కటి శివున్నిర్జించి కౌరవ్యుల\న్‌
బలి గావించి కిరీటి బోయలకు గోపస్త్రీల నొప్పింపఁడే
యల నీతేజము నీవు గైకొనినఁ గృష్ణా దేవకీనందనా.
35
మ. ఇలఁ దద్వైరి నృపాల ఫాలఫలక ప్రత్యగ్ర రక్తచ్ఛటా
కలితోదార గదావిజృంభణ భుజాగర్వుండు భీముండు కు
క్కలకుం జాపఁడె యేకచక్రపురి భిక్షావేళ యుష్మత్సము
జ్జ్వలకారుణ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా.
36
మ. అతిసౌందర్యసమగ్రధైర్యఘనశౌర్యస్ఫూర్తియు\న్‌ గీర్తియు
న్నతులప్రాభవరేఖయు\న్‌ గలిగి చోద్యంబెన్నఁగా ఘోటక
ప్రతతిం దిద్దఁడె నిత్యము\న్‌ నకులుఁ డేపారంగ నీసత్కృప\న్‌
సతమై రాజ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా.
37
మ. బక దైతేయమహాబలు\న్‌ సమరభూభాగంబున\న్‌ వాయుపు
త్రకుఁ డీల్గించిన నేకచక్రపురివారల్‌ మెచ్చి యింటింట వం
టకము ల్బెట్టిరిగాని భిక్షయనుమాట\న్‌ మాన్పలేరైరి యం
తకు వారల్‌ గొఱఁతేమి చాలుటకుఁ గృష్ణా దేవకీనందనా.
38
మ. గహనావాసములోన నన్నలకుఁ దా గారాబుతమ్ముండునై
విహరించేతఱి భావికాలగతి నన్వేషించుచు\న్‌ శౌర్యసం
గ్రహుఁడై యావులఁగాచె మత్స్యపురిలోఁ గర్మానుగుణ్యక్రియ
స్సహదేవుం డతిధైర్యమార్గమునఁ గృష్ణా దేవకీనందనా.
39
మ. వినుతానేకతురంగవారణ రథోర్వీనాథదీవ్యన్నికే
తన చక్రధ్వజచామరద్రఢిమతోఁ దథ్యాత్ముఁడౌ నాసుయో
ధనుఁ డేకాకియుఁ బాదచారియునునై దర్పంబువోనాడి పో
యెను మిమ్మెట్టుఁ దలంచి చూడకయ కృష్ణా దేవకీనందనా.
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )