శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
శా. రక్షింపం దగువీరుఁ డెవ్వఁ డననీరాజుల్‌ వృథాతేజులే
మోక్షశ్రీయొసఁగు\న్‌ విభుండెవఁడు శ్రీమోహాకృతి న్దేవతల్‌
రక్షోజాక్ష శుభప్రధానగరిమ\న్‌ రాజిల్లురాజేంద్రుల\న్‌
సాక్షాద్బ్రహ్మము నీవె ధన్యులకుఁ గృష్ణా దేవకీనందనా.
41
మ. కొలిచేది\న్‌ వగలేకనే నడిగితే కోపించు టీలేకనే
చెలువం బెచ్చుటకోటనేవిభవముల్‌ చేకూరుటల్‌ రూకనే
బలవంతుం డగుమూకనే సతిచెడు\న్‌ ప్రాణేశుపైఁ గోపనే
జలదశ్యామల శంఖచక్రధర కృష్ణా దేవకీనందనా.
42
మ. బలశౌర్యోన్నతి శత్రులం గెలిచి సప్తద్వీపవిశ్వంభరా
స్థలి నేలించి సమస్తవైభవములన్‌ దీపించి దిక్పాలకా
వళి కీర్తింప మెలంగునైషధుఁడు దా వర్తింపఁడే తొల్లి వం
టలవాఁడై ఋతుపర్ణుచెంగటను కృష్ణా దేవకీనందనా.
43
మ. ధరలో గోళకుఁ డైనపాండునికళత్రం బందు వేర్వేఱనే
వురకు\న్‌ బుట్టినపాండునందనులు దివ్యుల్మెచ్చ వర్తింపఁ ద
చ్చరితం బంతయు భారతంబని ప్రశస్తంబయ్యె నీనామసం
స్మరణప్రౌఢిమఁ గాదె యీఘనత కృష్ణా దేవకీనందనా.
44
మ. క్రతువుల్‌ నూఱొనరించి యింద్రపదవిన్గర్వించియింద్రాణికై
ధృతిఁదూల\న్‌ మరుఁడేచఁగా నహుషుఁడద్దేవేంద్రుభోగానుసం
గతిగాఁ గోరినకుంభసంభవుఁడు గిన్క\న్‌ దిట్టిన\న్‌ జెందఁడే
సతతంబు\న్‌ పెనుబాముచందమును కృష్ణా దేవకీనందనా.
45
మ. ఘనుల\న్‌ నీచుల నీచుల\న్‌ ఘనుల సత్కారాఢ్యుల\న్‌ దుష్క్రియా
జనితోద్యోగుల నర్థవంతులను భిక్షాయుక్తుల\న్‌ భిక్షుల\న్‌
ధనికవ్రాతముగా నొనర్చుచును నిత్యంబు\న్‌ మహాగారడం
బని నందించు వినోదరాయ హరి కృష్ణా దేవకీనందనా.
46
శా. శ్రీలక్ష్మీధవ వాసుదేవ వరదా రాజీవపద్మాసనా
వ్యాళాధీశ్వర శర్వ షణ్ముఖ శుకాద్యస్తోత్ర సత్పాత్ర గో
పాలానీక ముఖాబ్జభాస్కర కృపాపాథోధి న\న్‌ గావు మూ
ర్ధాలంకార మయూర పింఛధర కృష్ణా దేవకీనందనా.
47
మ. పతులున్నేవురునెన్నఁగాఁగలిగి భూపాలాంగనానీకముల్‌
సతతంబు\న్‌ గనుసన్నల\న్‌ మెలఁగుచైశ్వర్యంబుతోనుండి తా
నతిభక్తిం జని యాసుధేష్ణకును జేయం బూనదే ద్రౌపదీ
సతి యాశ్చర్యము నీవిలాసములు కృష్ణా దేవకీనందనా.
48
శా. మీసామర్థ్యము గల్గునంతకును నెమ్మి\న్‌ బాండుసూనుండు నా
యాసం బొంద మహాద్భుతంబుగ విరాటాధీశుపట్ణంబులో
గ్రాసోపాయము లేక భిక్ష మడుగ\న్‌ గాషాయముంబూని స
న్యాసంబు\న్‌ ధరియింపఁడే యచటఁ గృష్ణా దేవకీనందనా.
49
మ. విరటుం గొల్చినవాఁడు నొక్కఁడిలఁ బృథ్వీనాథుల\న్‌ గూల్చి సం
గరభూమి\న్‌ ఘనవైరివీరతతులన్గారించుచు\న్‌ ద్రుంచి యి
ద్ధరకు న్నగ్రజు రాజుఁ జేసియు తుది\న్‌ దా నీకృపంబాయఁడే
సరిపోదే భువి నింద్రసూనుధృతి కృష్ణా దేవకీనందనా.
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )