శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
మ. అమరు ల్పద్మజువ్రాతఁదాఁటి యిపుడొక్కబ్దంబు పెద్దయ్య దు
ర్దమ దోర్దండపటుప్రతాప నిజసంరంభామరానీక వి
క్రమ దుర్వారగజాసురప్రళయ మింకం జేయ ఫాలాక్షుని\న్‌
సమరక్షోణి జయించె నర్జునుఁడు కృష్ణా దేవకీనందనా.
51
శా. అక్రూరాత్మకు లైన పాండవుల బాహశక్తియు\న్‌ ధాత్రి ని
ర్వక్రంబయ్యెడునట్లు జేతు ననుచు\న్‌ వాత్సల్య మింపొంద నా
శక్రాత్మోద్భవు తేరిపై దురమున\న్‌ సారథ్యముం జేసితౌ
చక్రీ నీమునికోలకు\న్‌ జయము కృష్ణా దేవకీనందనా.
52
శా. గంభీరంబుగ రాయభారగరిమ\న్‌ గౌంతేయుకార్యార్థమై
శుంభల్లీలల ధార్తరాష్ట్రుసభఁ దామూహించి తద్వాక్యము
ల్సంభాషింపఁగ వా రవజ్ఞ దలఁప\న్‌ సర్వంబు నీవైనచో
శంభుండేయెఱుఁగు\న్‌ భవన్మహిమ కృష్ణా దేవకీనందనా.
53
శా. ఏలావిద్యలు సొంపు రూపవిభవం బేలా కులీనత్వము\న్‌
శీలత్వంబును నేల యేటికి వచశ్శ్రీ యేల బాహాబలం
బేలా చాతురి మీకృపాగరిమ నిక్షేపంబు లేకుండిన\న్‌
జాలిం బొందినఁ గల్గునే సిరులు కృష్ణా దేవకీనందనా.
54
శా. సర్వజ్ఞుండును సర్వలోకగురుఁడు\న్‌ సర్వంసహానాథుఁడు\న్‌
సర్వేశుండును సర్వసాధకుఁడునౌ సర్వేశ నీమూర్తి దా
సర్వంబు న్గలిగించు పెంచునణఁచు\న్‌ సందేహమేలా స్మృతుల్‌
'సర్వం విష్ణుమయం జగ'త్తనఁగ కృష్ణా దేవకీనందనా.
55
మ. పుడమి\న్‌ బెద్దలబోటివారి నడుగం బోరాదె చోద్యంబు పా
ల్కడలి\న్‌ గల్గినముద్దరాలు గలుగంగా పూర్వకాలంబున\న్‌
పొడవెల్ల\న్‌ గడుతగ్గి దానవునితో బొంకైనమాటాడి మూఁ
డడుగు ల్నేలను వేఁడఁగాఁ జనవు కృష్ణా దేవకీనందనా.
56
శా. రంగప్రౌఢిమ భార్గవుం గెలిచి కౌరవ్యుల్‌ భయం బంది వీ
రాగంబుం ధరియించి జీవము సతంబై యుండ వర్తించునా
గాంగేయుండు శిఖండిచేతఁ దెగె నీ కారుణ్యముం దప్పియుం
డంగా మృత్యువుధాటి కోపుదురె కృష్ణా దేవకీనందనా.
57
శా. అక్రూరస్థితి నుండఁగా వలయు రాజాస్థానమధ్యంబున\న్‌
వక్రింపం బనిలేదు ధర్మమునకై వర్తింపఁగాఁ బోయిన\న్‌
శుక్రాచార్యుని కన్నుఁ బో నడఁచవే సూటి\న్‌ గుశాగ్రంబున\న్‌
జక్రీ నీకరపంకజాంతరముఁ గృష్ణా దేవకీనందనా.
58
మ. వరసౌందర్యవివేకధైర్యనయనావాత్సల్యధౌరేయుఁ డీ
ధరణీనాయకరత్న మంచు మహితార్థంబాశ్రితశ్రేణికి\న్‌
స్థిరసామ్రాజ్యవిభుత్వ మాధ్రువునికి\న్‌ దేజంబుగానిచ్చి తా
సరణి\న్‌ మీకృప గల్గువాఁ డగుట కృష్ణా దేవకీనందనా.
59
శా. ధారాపూర్వముగాఁగ సంయమికి సప్తద్వీపముల్‌ సూనృత
ప్రారంభమున నిచ్చి చేతితడియాఱ\న్‌ లేక వర్తింపఁడే
శారీరార్థ మటంచు భిక్షము హరిశ్చంద్రుండు యాగాదిసం
చారుం డుండు మనండె తొల్లి హరి కృష్ణా దేవకీనందనా.
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )