శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
మ. పటుబాహాబలసత్త్వవైఖరుల దిక్పాలుల్‌ బ్రశంసించు నం
తటివాఁడయ్యుఁ ద్రిశంకునన్దనుఁడు కాంతారత్నము\న్‌ విక్రయిం
చుటలు\న్‌ నీమహిమంబుచేతఁ గద యిట్లాశ్చర్యమేమర్త్యులెం
తటివారైనను నేమిచేసెదరు కృష్ణా దేవకీనందనా.
61
మ. తన శౌర్యోన్నతి యుగ్రసాధనముగా తాళాయణీశు\న్‌ శివు\న్‌
దనర\న్‌ మెచ్చఁగఁజేసి లోకముజయస్తంభంబు గావించియు\న్‌
మును దాఁ జేసినకర్మవార్ధిఘనమై ముంపం గడుంబాలుచేఁ
జనఁడే దుర్మతి విక్రమార్కుఁ డిల కృష్ణా దేవకీనందనా.
62
మ. తెగువన్నిర్జరుల\న్‌ జయించుచు మదోద్రేకంబున\న్‌ గానలో
మృగనేత్రి\న్‌ ధరణీతనూజ నసురు ల్మెచ్చంగఁ దాఁదెచ్చి నె
వ్వగలం బెట్టి విధిప్రయత్నమున నిర్వంశంబుగా రాముచే
జగతిం గూలఁడె యాదశాననుఁడు కృష్ణా దేవకీనందనా.
63
మ. పరనారీహరణం బొనర్చినమహాపాపాత్ముఁ డారావణుం
డరయ న్నాతని తమ్ముఁడైన దనుజుం డత్యంతసద్భక్తితో
శరణన్నం దయఁజూచి యగ్రజునిరాజ్యం బిచ్చి రక్షింప వా
సరణి\న్‌ నీపదభక్తియే ఘనము కృష్ణా దేవకీనందనా.
64
మ. వెఱచైన\న్‌ మఱచైనఁ గార్యముతఱి\న్‌ వేసారుచున్నైన యా
దరమొప్పైనను మాయనైన నృపతుల్‌ దండింపఁగా నైనను\న్‌
పరిహాసంబుననైన మిమ్మునుడువ\న్‌ బ్రాపించు పుణ్యాత్మకుల్‌
నరకావాసముఁ జేరరా ఘనులు కృష్ణా దేవకీనందనా.
65
మ. నొసట\న్‌ గన్నులఁగట్టి వేల్పుసతి నెంతోభక్తితోఁ జూఁడఁగా
నిసుమంతైన భయంబులేక తలమీఁ దెక్క న్నదట్లుండనీ
వసుధ\న్‌ భర్తను స్త్రీల కెవ్వరయిన\న్‌ వశ్యాత్ములై మట్టులే
కస మియ్యం దల కెక్క కుండుదురె కృష్ణా దేవకీనందనా.
66
మ. కరితో దోమ మృగేంద్రుతో నరుఁడు బంగారంబుతోఁ గంచు భా
స్కరుతో మిణ్గురుబుర్వు కల్పకముతోఁ గానుంగు రత్నాకరే
శ్వరుతో నూషరపల్వలంబు నురుశేషస్వామితో మిడ్తయు\న్‌
సరియైన\న్‌ సరి మీకు దైవములు కృష్ణా దేవకీనందనా.
67
మ. నుతలోకప్రతిసృష్ట నిర్మలకళానూత్నాబ్జగర్భు\న్‌ మహా
ప్రతిభు\న్‌ గౌశికుఁ గుక్కమాంసము భుజింపం జేసి మాలాతని\న్‌
బతిమాలించవె చండచండతరశుంభత్వంబు పాల్మాలునా
శతఁ బొందించవె దేవదేవమయ కృష్ణా దేవకీనందనా.
68
మ. వరభోగాధ్వరదానధర్మగుణముల్‌ వర్జించి తృష్ణారతి\న్‌
నరులత్యంతము మూఢలోభమతులై నారీరతిం గూర్పఁగాఁ
దరముం గాని ధనంబు తస్కరవరు\న్‌ ధాత్రీశులుం జేకొన\న్‌
సరఘవ్రాతము జేర్చుతేనెక్రియఁ గృష్ణా దేవకీనందనా.
69
మ. ఖలవాక్యప్రతిపాలకుల్‌ పరధనాకాంక్షుల్‌ పరస్త్రీరతుల్‌
కులధర్మౌఘనిబద్ధచిత్తులు నయాకూపారపారంగతుల్‌
కలుషుల్‌ రాజులు వారిసేవకులకెల్లం గల్గు నత్యంతని
శ్చలసౌఖ్యంబులు నిన్భజింపఁగను కృష్ణా దేవకీనందనా.
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )