శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
శా. బొంకు ల్లక్షలు నిత్యసంభరితసంభోగారతుల్‌ దుర్మదా
హంకారంబులు కోట్లసంఖ్యయగు మోహంబాయనంతంబు దు
ష్పంకాభార మపార మిన్నిగల భూపవ్రాతసర్పాళి ని
శ్శంకం బ్రాజ్ఞులు చేర వోవుదురె కృష్ణా దేవకీనందనా.
71
శా. చీమల్‌ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించిన\న్‌
పాముల్‌ జేరినరీతి లోభిజనసంపన్నార్థరాసుల్‌ వృథా
భూమీపాలుల పాలుగాక చనునా పుణ్యంబులే లొల్లరో
సామాన్యంబు ధనాధినాథులకుఁ గృష్ణా దేవకీనందనా.
72
మ. అదనం బొద్దులనీడచందమున నిచ్చల్‌ సృక్కి దుష్టాత్ముసం
పద పెంపై ధరనిల్వదించుకయు సౌభాగ్యప్రభాభాసియై
పొదలు\న్‌ మాపటినీడకైవడి భవత్పూజావిధేయజ్ఞుఁడై
సదయుం డైనను లేమి జేకురునె కృష్ణా దేవకీనందనా.
73
శా. కీడు\న్‌ మేలును వచ్చుఁ గర్మవశత\న్‌ క్రీడాగతి\న్‌ జోకలై
వాడల్‌ వచ్చును బండ్లునొక్కెడధర న్నొక్కప్పుడు\న్‌ బండ్లపై
వాడల్‌ నౌఁ గద దేశకాలగతి శీతోష్ణంబు లీరీతి నే
జాడ\న్‌ వచ్చును దుఃఖసౌఖ్యములు కృష్ణా దేవకీనందనా.
74
శా. అంతశ్శత్రుల గెల్వలేరు మమతాహంకారము ల్మానలే
రింతే మూర్ఖము వీడలేరు భవదీయాంఘ్రిద్వయీచింతనా
చింతారత్నముఁ గానలే రిలను దుశ్చిత్తు ల్వృథా వేదవే
దాంతంబుల్‌ చదువంగ నేమి యగుఁ గృష్ణా దేవకీనందనా.
75
శా. నానావేదపురాణశాస్త్రముల నానందింపఁగా నిత్య మిం
పౌనార్యు ల్వినుతింప ధార్మికరహస్యంబు ల్విన న్వచ్చునౌ
మీ నామాంకభవద్వివేకులకు మున్నాశ్చర్యమే సత్వరా
జ్ఞానాధిక్యము గానిముక్తిఁ గని కృష్ణా దేవకీనందనా.
76
శా. గట్రాల\న్‌ బలుకానల\న్‌ గుహల గంగాసింధుదేశంబుల\న్‌
వట్రాఠావుల దేహమెల్లఁ జెదర\న్‌ వర్తించిన\న్‌ మేరువు\న్‌
చుట్రా యేఁబదిమార్లు మెట్టినమనశ్శుద్ధుండు గాకుండిన\న్‌
చట్రా వాని ప్రయాస మంతయును గృష్ణా దేవకీనందనా.
77
శా. గంగాజన్మపదాబ్జమందు నభిషేకంబు ల్సదా గాంచెదన్‌
నంగారార్చనచేసి యేరణమున\న్‌ నర్పింతు నంభోధరా
శృంగారాధిప కౌస్తుభాభరణ యేశృంగారముల్‌ జేతు మీ
కంగీకారము గాఁగ నాతరమె కృష్ణా దేవకీనందనా.
78
మ. అతిమోహాంధులఁ బాపకర్ముల మహాహంకారుల\న్‌ దోషదూ
షితుల\న్‌ గర్వితదుర్విచారులఁ బ్రశంసింపం బ్రశంసింపఁగా
దితిపర్యాప్తిదినంబు లొంది త్రిజగద్విఖ్యాతియుష్మత్సము
న్నతసేవాభిముఖుండ నైతి నిట కృష్ణా దేవకీనందనా.
79
మ. పలుమాఱు\న్‌ ఇహభోగకాంక్షసభల\న్‌ పాండిత్యముల్‌ సేయువా
రలయజ్ఞానము మాన్పఁగాఁ గలరె యెట్లైన\న్‌ బ్రకాశించు కో
మలదీపాళిఁదొలంగఁ ద్రోయునె భవన్మాయాంధకారంబును
జ్జ్వలితానందమయ స్వరూపయుత కృష్ణా దేవకీనందనా.
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )