శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
మ. అరయం జందనగంధిపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
నరుపై ద్రౌపదిపైఁ గుచేలకునిపై నందవ్రజస్త్రీలపైఁ
బరఁగంగల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము మీ
చరణాబ్జంబుల నమ్మినాఁడ హరి కృష్ణా దేవకీనందనా.
91
మ. అనుకూలాన్వితయైన భార్యయును ధర్మార్థంబునైనట్టి నం
దనులు\న్‌ సజ్జనులైన సోదరులు యెన్నంగల్గు సంపత్క్రియా
ఘనుఁడైనట్టి మహానుభావుఁడె భవత్కారుణ్యదృగ్జాలభా
జనుఁ డప్పుణ్యుని జూచిన\న్‌ శుభము కృష్ణా దేవకీనందనా.
92
మ. శరణాగత్యనురక్తి భక్తి జనరక్షాసత్కృపాసేవ్యస
త్కరుణాపూర సుధారసంబుగల శృంగారంబు మీమూర్తియుం
దరణోపాయ మెఱుంగలేని కలుషాధారు\న్‌ ననుందావక
స్మరణాధీశునిఁ జేయు మ్రొక్కెదను కృష్ణా దేవకీనందనా.
93
మ. ప్రలయాభీల కరాళదావదహన ప్రజ్జ్వాల మబ్జోదరా
జ్వలనాకారముదాల్పఁ దానియెదుట\న్‌ సంతప్త సంతాప వాం
ఛలు దివ్యుల్మునులుం గృశాస్యులగుచుం జల్లార్పఁగాలేక ని
చ్చలు నీపాదములే భజించెదరు కృష్ణా దేవకీనందనా.
94
మ. మొఱయాలింపవొ మానమున్నిలుపవో ముల్లోకమేలింపవో
మఱదీయంచును వెంటనేతిరుగవో మన్నింపవో యందుమో
కరినో ద్రౌపదినో సురాధిపతినో గాండీవినో యెవ్వఁడ\న్‌
ధర ని\న్‌ గొల్చినవారిలో నొకఁడ కృష్ణా దేవకీనందనా.
95
మ. కుటిలారాతినిశాటకోటికదళీకూటాటవీభంజనో
ద్భటమత్తద్విపకేళిలోలము సముత్ప్రావీణ్య దైత్యాంగనా
స్ఫుట ముక్తామణిరత్నహార తిలకాపుంజాతలూనక్రియా
చటులజ్వాలము నీసుదర్శనము కృష్ణా దేవకీనందనా.
96
మ. కులిశానేక సహస్రకోటి నిశితక్రూరోరుధారాముఖా
కలితార్చి ప్రభవ ప్రభావ త్రిజగత్కల్యాణసంధాయియై
విలసిల్లు\న్‌ భవదీయచక్రమఖిలోర్వీభారనిర్వాపణో
జ్జ్వలనిర్వాహపరాక్రమక్రమణ కృష్ణా దేవకీనందనా.
97
మ. అతికాకోల కరాళ కాయక కఠోరాశీ విషావిర్భవ
క్షతినోనాటిన నాఁటిపాటు తలఁప\న్‌ శంకించి యుంకించె దౌ
సతతోద్వర్తుల వర్ణ సర్వభయదాంచత్పింఛ చూడావతం
సతతం గారుడకేతనోద్ధృతియు కృష్ణా దేవకీనందనా.
98
శా. నక్రోదగ్రతఁ బ్రాణవాయువులు మేన న్నిల్వఁగా నోప వో
చక్రీ న\న్‌ దయ గావు మన్నకరుణ\న్‌ జాజ్జ్వల్యచక్రంబుచే
నక్రంబుం దెగఁ జూచి కాచితిగదా నాగంబు వేగంబున\న్‌
శక్రాద్యామరవందితాంఘ్రియుగ కృష్ణా దేవకీనందనా.
99
మ. కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్‌ మెచ్చి యిచ్చింది ద
బ్బర కాకాసురునిం గటాక్షమునఁ జేపట్టిం దబద్ధం బహో
శరణన్న బగవానితమ్మునికి రాజ్యం బిచ్చుట ల్కల్ల యి
త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా దేవకీనందనా.
100
క. ఈకృష్ణశతక మెప్పుడు
పైకొని విన్నట్టివారు వ్రాసినవారల్‌
చేకొని పఠించువారలు
శ్రీకృష్ణునికరుణ కలిగి చెలఁగుదు రెలమిన్‌.
101
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )