శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. వగవకు గడిచిన దానికిఁ
బొగడకు దుర్మతుల నెపుడు, పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను గుమారా!
31
క. పనిఁబూని జనులు సంతత
మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
చిన యశము నొందుచుందురు
గనుగొను మిదె దొడ్డనడక గాఁగ కుమారా!
32
క. విను లోకంబున ధర్మం
బఁనగఁ గులాచార మట్ల నరసి నడువ! దాఁ
గను నాయుఃకీర్తుల నిహ
మునఁ బరమునఁ బొందు సౌఖ్యములను గుమారా!
33
క. సరివారిలోన నేర్పునఁ
దిరిగెడు వారలకుఁగాక తెరువాటులలో
నరయుచు మెలఁగెడి వారికిఁ
బరువేటికిఁగీడె యనుభవంబు గుమారా!
34
క. ఒరు లెవ్వరేని దనతోఁ
బరిభాషించినను మేలు పలుకవలయు సా
దరము గల చోటఁ గీడు
న్గరము నొనర్పంగరాదు గదర! కుమారా!
35
క. సిరి చేర్చు బంధువుల నా
సిరియే శుభముల నొసంగు చెలువులఁ గూర్చున్‌
సిరియే గుణవంతుండని
ధరలోఁబొగడించునంచుఁ దలఁపు కుమారా!
36
క. ఆకులతఁబడకు మాపద,
నేకతమునఁ జనకు త్రోవ, నింతికిఁదగు నం
తే కాని చన వొసంగకు,
లోకులు నిన్నెన్న సుగుణ లోల! కుమారా!
37
క. తనదు కులాంగన యాలో
చనమున మంత్రియును భుక్తి సమయంబునఁ దా
జననియు రతిలో రంభా
వనజేక్షణ యయినఁ బుణ్య వశము కుమారా!
38
క. మనుజుఁడు సభ్యుఁడు దానై
గనియున్న యధార్థమెల్ల గానని యట్లా
మనుజుండు పలుకకున్నను
ఘనమగు పాతకము నాఁడు గనును గుమారా!
39
క. అంగీకార రహిత మగు
సంగతికి బోవరాదు సామాన్యులతో
డం గడు జగడమునకుఁ జన
వెంగలితనమండ్రు వినుము కుమారా!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )