శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. ఇరవొంద\న్‌ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా
కరయ\న్‌ పద్మభవాండ భాండచయము న్నారంగ మీకుక్షిలో
నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం
తర వాఃపూరము చంద మొంది యెపుడున్‌ దైత్యారి నారాయణా!
21
మ. దళదిందీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ
లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో
మల నాభీచరణారవిందజనితామ్నాయాద్యగంగా! లస
జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చింతు నారాయణా!
22
మ. జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ! భూ
గగనార్కేందుజలాత్మపావక మరుత్కాయా! ప్రదీపప్రయో
గి గణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణ సంసేవితా!
త్రిగుణాతీత! ముకుంద! నాదు మదిలో దీపింపు, నారాయణా!
23
శా. భూతవ్రాతము నంబుజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై
ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో
పేతంబై పరమాత్మవై నిలుతు నీ పెంపెవ్వరుం గాన ర
బ్జాతోద్భూతసుజాతపూజితపదాబ్జశ్రేష్ఠ, నారాయణా!
24
మ. వరనాభీధవళాంబుజోదరమున\న్‌ వాణీశుఁ గల్పించి య
ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం
బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ
సరి యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా!
25
మ. ప్రభ మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం
బ్రభవంబైన విరించి ఫాలజనిత ప్రస్వేదసంభూతుఁడై
యభిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా
నభవాఖ్యుండవు ని న్నెఱుంగవశమే యబ్జాక్ష, నారాయణా!
26
మ. పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా
కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంభోధిపై
వటపత్రాగ్రముఁ జెంది యొప్పిన మిము న్వర్ణింపఁగా శక్యమే
నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా!
27
మ. సవిశేషోరు సువర్ణబిందువిలస చ్చక్రాంకలింగాకృతి\న్‌
భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే
ధ్రువుచే నా దివిజాధినాయకులచే దీప్యన్మునీంద్రాళిచే
నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ, నారాయణా!
28
మ. సర్వంబున్‌ వసియించు నీతనువునన్‌ సర్వంబునం దుండగా
సర్వాత్మా! వసియించు దీవని మదిన్‌ సార్థంబుగాఁ జూచి యా
గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్‌ గీర్తింతు రేప్రొద్దు నా
శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా!
29
మ. గగనాద్యంచితపంచభూతమయమై కంజాతజాండావలిన్‌
సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్‌ సంసారివై చిత్కళా
సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్ష్మంబునై
నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )