శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
శా. విందుల్‌ విందు లటంచు గోపరమణుల్‌ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ
డందెల్‌ మ్రోయఁగ ముద్దుమోమలర ని న్నాలింగితుం జేయుచో
డెందంబుల్‌ దనివార రాగరసవీటీలీలల\న్‌ దేల్చు మీ
మందస్మేర ముఖేందురోచులు మము న్మన్నించు, నారాయణా!
41
శా. విందు ల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబె పొ మ్మయ్యయో
నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁబో వేమి మా
మందం జాతర సేయఁబోద మిదె రమ్మా యంచు మి మ్మెత్తుకో
చందం బబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్త్రీలు, నారాయణా!
42
శా. అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో
వెన్నల్‌ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తి వై
యున్నన్‌ దిక్కులు చూచుచున్‌ బెగడి నిన్నోలి న్నుతుల్‌ సేయుచున్‌
గన్నుల్‌ మూయ యశోదకున్‌ జిఱుత వై కన్పింతు, నారాయణా!
43
శా. ఉల్లోలంబులుగాఁ గురుల్‌ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ
మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు వ్రే
పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లంబు మీ
పిల్లంగ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెంపొప్పు, నారాయణా!
44
మ. కసవొప్పన్‌ పసి మేసి ప్రొద్దు గలుగం గాంతారముం బాసి య
ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాంగనా
రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్‌
పసిఁ గొంచున్‌ బసిఁ గొంచు వచ్చుటలు నే భావింతు, నారాయణా!
45
శా. చన్నుల్‌ మీదిఁకి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం
పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా
విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ
వన్నెల్‌ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు, నారాయణా!
46
మ. పెరుగుల్‌ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా
గ రసావేశత రిత్త ద్రచ్చ నిడ నాకవ్వంబు నీవు న్మనో
హరలీలం గనుగొంచు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ
వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు, నారాయణా!
47
శా. కేల\న్‌ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం
బీలీపించముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళి\న్‌ గట్టి క
ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ
వాలన్‌ గాచినభావ మిట్టి దని నే వర్ణింతు, నారాయణా!
48
శా. కాళిందీతటభూమి నాలకదుపుల్‌ కాలూఁది మేయ\న్‌ సము
త్తాలోల తమాలపాదప శిఖాంతస్థుండవై వేణురం
ధ్రాలిన్‌ రాగరసంబు నిండ విలసద్రాగంబు సంధించి గో
పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు, నారాయణా!
49
శా. రాణించెన్‌ గడు నంచు నీసహచరుల్‌ రాగిల్లి సోలంగ మీ
వేణుక్వాణము వీనులం బడి మనోవీథుల్‌ బయల్‌ముట్టఁగా
ఘోణాగ్రంబులు మీదిఁ కెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో
శ్రేణుల్‌ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు, నారాయణా!
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )