శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. పసులంగాపరి యే మెఱుంగు మధురప్రాయోల్లసద్వృత్తవా
గ్విసరారావము మోవి దా వెదురుగ్రోవిం బెట్టినాఁ డంచు ని\న్‌
గసటుల్‌ సేయఁగ నాఁడు గోపిక లతద్గానంబులన్‌ మన్మథ
వ్యసనాసక్తులఁ జేయుచందములు నే వర్ణింతు, నారాయణా!
51
మ. జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసె\న్‌ శైలంబు మాచేతులం
దిడు మన్న\న్‌ జిరునవ్వుతో వదలిన\న్‌ హీనోక్తి గీపెట్ట నె
క్కుడు గోవుల్‌ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్‌
గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా!
52
మ. లలితాకుంచితవేణియం దడవిమొల్లల్‌ జాఱ ఫాలస్థలి\న్‌
దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్‌ దీపింప లేఁజెక్కులన్‌
మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకల\న్‌ బోవఁగా
నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా!
53
శా. మాపాలం గడు గ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
మాపాలెంబుల వచ్చి యుండుదు వెస న్మాపాలలో నుండు మీ
మాపా లైనసుఖాబ్ధిలో మునుగుచున్‌ మన్నించి తా గొల్లలన్‌
మాపాలం గలవేల్పు వీవె యని కా మన్నింతు, నారాయణా!
54
మ. ఒకకాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండ వై
సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క
ల్పకమూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో
పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా!
55
మ. లలితం బైన భవత్తనూవిలసనన్‌ లావణ్యదివ్యామృతం
బలుఁగు ల్వారఁగ నీకటాక్షమునఁ దా మందంద గోపాంగనల్‌
తలఁపు ల్పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతు రా
నెలతల్‌ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా!
56
మ. లీలన్‌ పూతనప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి, దు
శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా
రోల న్మద్దులు గూల్చి ధేనుదనుజున్‌ రోఁజంగ నీల్గించి వే
కూలన్‌ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్‌ దీర్తు, నారాయణా!
57
మ. రసనాగ్రంబున నీదు నామరుచియు\న్‌ రమ్యంబుగాఁ జెవ్లుకు
న్నసలారంగ భవత్కథాభిరతియున్‌ హస్తాబ్జయుగ్మంబులన్‌
వెస నీపాదసుపూజితాదియుగమున్‌ విజ్ఞానమధ్యాత్మకున్‌
వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ, నారాయణా!
58
మ. వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడుభంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష, నారాయణా!
59
శా. చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డ కట్టి మదనోద్యోగానులాపంబుల\న్‌
చల్లన్‌ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరుతెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )