శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. కలయ న్వేదములు\న్‌ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
వలనన్‌ భక్తి విహీనుఁ డైన పిదపన్‌ వ్యర్థప్రయత్నంబె పో
గులకాంతామణి గొడ్డు వోయిన గతిం గ్రొవ్వారుసస్యంబు దా
ఫలకాలంబున నీచపోవు పగిదిన్‌ పద్మాక్ష, నారాయణా!
61
శా. స్నానంబుల్‌ నదులందు జేయుట గజస్నానంబు చందంబగు\న్‌
మౌనం బొప్ప జపించువేద మటవీ మధ్యంబులోనే డ్పగున్‌
నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను
న్నీనామోక్తియు నీపదాబ్జరతియున్‌ లేకున్న నారాయణా!
62
మ. అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా
యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా!
63
మ. తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం
తున బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్ఛిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా
సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా!
64
మ. తనువుం జీవుఁడు నేక మైనపిదపన్‌ ధర్మక్రియారంభుఁ డై
యనయంబు న్మది దన్నెఱుంగక తుది న్నామాయచే మగ్నుఁ డై
తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద
ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా!
65
మ. తనకు\న్‌ సాత్వికసంపదాన్విత మహాదాసోహభావంబునన్‌
ననయంబు న్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్‌
జనితాహ్లాదముతోడ నీచరణముల్‌ సద్భక్తి పూజించి ని\న్‌
గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా!
66
మ. పరికింపన్‌ హరిభక్తి భేషజునకున్‌ భవ్యంబు గా మీఁద మీ
చరణాంభోరుహదర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొరయ న్నేర్చునె దుర్లభం బగు గృపాంభోజాక్ష నారాయణా!
67
మ. పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాంతరాళంబున\న్‌
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్‌ భక్తి న్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్‌ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్‌ భవ్యపదంబు నొందుటకు నై యవ్యక్త నారాయణా!
68
మ. సరిఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యము\న్‌
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతిదర్పణమున న్నిస్సంగుఁ డై తన్ను దా
నరయం గాంచినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష నారాయణా!
69
మ. పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారంభుఁ డై
నిరసిం చేరికిఁ గీడు సేయక మది న్నిర్ముక్తకర్ముండు నై
పరమానందనిషేధముల్‌ సమముగా భావించి వీక్షించు నా
పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )