శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంత మం
దరయం బైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్‌
మరణావస్థను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్‌
ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా!
71
మ. వెర వొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వే తెల్పి మీ
వరనామామృతపూర మానుచుఁ దగన్‌ వైరాగ్యభావంబున\న్‌
సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్‌ సంసారమాతుఃపయో
ధరదుగ్ధంబులు గ్రోల నేరరు వెస\న్‌ దైత్యారి నారాయణా!
72
శా. వేదంబందు సునిశ్చయుండగు మహావేల్పెవ్వఁడో యంచు నా
వేదవ్యాస పరాశరుల్‌ వెదకిన న్వేఱొండు లేఁ డంచు మీ
పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్‌
శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా!
73
మ. సుతదారాప్తజనాదివిత్తములపై శూన్యాభిలాషుండు నై
యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్‌
మృతిఁ బొందించి దమంబునన్‌ శమమునన్‌ మీఱంగ వర్తించు ని
ర్గతసంసారి భవత్కృపం బొరయు నో కంజాక్ష నారాయణా!
74
మ. ప్రమదం బారఁగ పుణ్యకాలగతులన్‌ భక్తి న్ననుష్ఠింపుచున్‌
నమర న్నన్న సువర్ణ గో సలిల కన్యా ధారుణి గ్రామ దా
నము లామ్నాయ విధోక్తి భూసురులకున్‌ సన్మార్గుఁ డై యిచ్చువాఁ
డమరేంద్రార్చిత వైభవోన్నతుఁ డగు న్నామీఁద నారాయణా!
75
మ. ఇల నెవ్వారి మనంబులో నెఱుక దా నెంతెంత గల్గుండు నా
కొలదిం జెంది వెలుంగుచుందు కలయ న్గోవింద నీరూపుల\న్‌
అలర న్నంబు మితంబు లైసరసిలో నంభోరుహంబుల్‌ దగ\న్‌
నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా!
76
మ. మదిలో నుత్తమభక్తి పీఠముపయి\న్‌ మానాథ మీపాదముల్‌
గదియం జేర్చిన వాని కే నొడయడన్‌ గా దంచు నత్యున్నతిన్‌
పదిలుం డై సమవర్తి మృత్యువునకు\న్‌ బాఠంబుగాఁ బల్కు మీ
పదపద్మార్చకు లెంత పుణ్యులొ కృపాపారీణ నారాయణా!
77
మ. కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా
షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్‌ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబు సోఁకు నిను మున్‌ హేమాకృతిస్తోమమై
వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్‌ వేదాత్మ నారాయణా!
78
మ. నిరతానందయోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులై మ్రగ్గువా
రరయ న్ని న్నొగి నాత్మయం దిడనివా రబ్జాక్ష నారాయణా!
79
మ. ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై
ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొనర న్నొప్పెడువారు నీపదరుచి న్నూహించు నారాయణా!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )