శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసంపత్కళా
స్పద యోగీంద్రమనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా!
81
మ. వెలయన్‌ యౌవనకాలమందు మరుఁడున్‌ వృద్ధాప్యకాలంబునన్‌
బలురోగంబులు నంత్య మందు యముఁడుం బాధింప నట్టైన యీ
పలుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా!
82
మ. బలుకర్మాయత పాశబంధవితతి\న్‌ బాహాపరిశ్రేణికి\న్‌
జలయంత్రాన్విత బంధయాతనగతిన్‌ సంసారకూపంబులో
నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్‌
వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్‌ వేవేగ నారాయణా!
83
మ. మమహంకార వికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగ\న్‌ రా దింక నాలోన నీ
విమలాపాంగ దయా దివాకరరుచిన్‌ వెల్గింపు మింపార నో
కమలానంద విహారవక్షలలితా! కంజాక్ష! నారాయణా!
84
మ. పరిపంధిక్రియ నొత్తి వెంటఁ బడునప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్నీ కపకీర్తి గాదె శరదంభోజాక్ష నారాయణా!
85
మ. సతతాచారము సూనృతంబు కృపయున్‌ సత్యంబునున్‌ శీలమున్‌
నతిశాంతత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయు\న్‌ ధ్యానము\న్‌
ధృతియున్‌ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స
మ్మతికిం జేరువ మీనివాససుఖమున్‌ మానాథ నారాయణా!
86
మ. భవనాశి\న్‌ గయ తుంగభద్ర యమున\న్‌ భాగీరథిం గృష్ణ వే
త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగ యం
దవగాహంబున నైన పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చట\న్‌
భవదంఘ్రిస్మరణంబునం గలుగు పో పద్మాక్ష నారాయణా!
87
మ. ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహముం జేసినన్‌
పరగం జెల్లుట సూచి తీ భువనసంపాద్యుండ వైనట్టి మీ
వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్‌ జేసితి\న్‌
కరుణం జేకొని కావు మయ్య త్రిజగత్కల్యాణ నారాయణా!
88
మ. గణుతింప\న్‌ బహుధర్మశాస్త్రనిగమౌఘం బెప్పుడు న్ని న్నకా
రణబంధుం డని చెప్ప నత్తెఱఁగు దూరం బందకుండంగ నే
బ్రణతుల్‌ జేసెదఁ గొంత యైనఁ గణుతింపం బాడి లేకుండినన్‌
ఋణమా నానుతి నీవు శ్రీపతివి నీ కే లప్పు? నారాయణా!
89
మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ
కరచక్రంబున నక్రకంఠము వెస\న్‌ ఖండించి మించెం దయా
పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా!
90
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )