శతకములు సుమతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!
21
క. ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక నొగిఁ దఱచైనన్‌
గకవికలు గాకయుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ!
22
క. ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లని వాఁడే
గొల్లండు కాక ధరలో
గొల్లండును గొల్లఁడౌనె గుణమున సుమతీ!
23
క. ఓడల బండ్లును వచ్చును
ఓడలు నాబండ్లమీఁద నొప్పుగ వచ్చు\న్‌
ఓడలు బండ్లును వలెనే
వాడంబడుఁ గలిమి లేమి వసుధను సుమతీ!
24
క. కడు బలవంతుండైనను
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ బుట్టినయింటన్‌
దడవుండ నిచ్చెనేనియుఁ
బడుపుగ నంగడికిఁ దానె పంపుట సుమతీ!
25
క. కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండఁబెట్టి శుభ లగ్నమునం
దొనరఁగఁ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
26
క. కప్పకు నొరగాలైనను
సర్పమునకు రోగమైన సతి తులువైనన్‌
ముప్పున దరిద్రుఁడైనను
దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ!
27
క. కమలములు నీటఁ బాసినఁ
గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్‌
దమ తమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
28
క. కరణముఁ గరణము నమ్మిన
మరణాంతకమౌను గాని మనలేఁడు సుమీ
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
29
క. కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్నతిండి వికటించుఁ జుమీ
యిరుసునఁ గందెనఁ బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - sumati shatakamu ( telugu andhra )