శతకములు సుమతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శత్రునింటఁ గూరిమి తోడన్‌
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వఁగ సుమతీ!
61
క. నమ్మకు సుంకరి జూదరి
నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్‌
నమ్మకు మంగడివానిని
నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!
62
క. నయమునఁ బాలుం ద్రావరు
భయమున విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియొ
భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ!
63
క. నరపతులు మేరఁ దప్పినఁ
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్‌
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌను గాని మానదు సుమతీ!
64
క. నవరస భావాలంకృత
కవితా గోష్ఠియును మధుర గానంబును దా
నవివేకి కెంతఁ జెప్పినఁ
జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ!
65
క. నవ్వకుమీ సభ లోపల
నవ్వకుమీ తల్లిదండ్రి నాథుల తోడన్‌
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
66
క. నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!
67
క. పగ వలదెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్‌
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ!
68
క. పతికడకుఁ దన్నుగూర్చిన
సతికడకును వేల్పుకడకు సద్గురుకడకున్‌
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ!
69
క. పనిచేయు నెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్‌
దన భుక్తియెడలఁ దల్లియు
ననఁ దన కులకాంత యుండ నగురా సుమతీ!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - sumati shatakamu ( telugu andhra )