శతకములు వేంకటేశ్వర శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య
ఉ. కానిక లిచ్చె నీవిభుఁడు కౌఁగిటఁ బాన్పునఁ గమ్మవల్పుపూఁ
దేనెల ఘర్మబిందువుల దేహమునం దలమేలుమంగ నీ
వానగుమోముతో విభుని కంచుఁదలిర్చినఁ గాని తన్మయం
బైనను బాయ దంచుఁ జెలు లందురు నీసతి వేంకటేశ్వరా!
51
చ. పెనఁగకుమమ్మ! చిమ్ము జళిపించిన చూపుల గర్వరేఖ రాఁ
జెనకకు మమ్మ! లేఁ జెమటచెక్కుల నోయలమేలుమంగ నీ
ఘనుఁడు కళావినోది రతికాంత విలాససహస్రమూర్తి వ
ద్దని పొలయల్క దీర్తురు లతాంగులు నీసతి వేంకటేశ్వరా!
52
చ. కులుకకుమమ్మ చిమ్మజిలుకుం గొనచూపుల బిత్తరంబుగా
నులుచకుమమ్మ బొమ్మముడి నూల్కొనఁగోపము లేఁతనవ్వు గా
సొలయకుమమ్మ కలి నునుసోఁగల నోయలమేలుమంగ నీ
చెలువున నంచు నెచ్చెలులు చేర్తురు నీసతి వేంకటేశ్వరా!
53
ఉ. చాఁగు బళా జగత్పతికి జాఁగు బళా జగదేకమాతకున్‌
చాఁగు బళా రమేశునకుఁ జాఁగు బళా యలమేలుమంగకు\న్‌
జాఁగు బళా యటంచుఁ గడుఁ జక్కని కాంతను వీథివీథిమీ
రేఁగఁగ నిత్తు రారతు లనేకవిధంబుల వేంకటేశ్వరా!
54
చ. చొచ్చితిఁ దల్లి నీమఱుఁగు సొంపుఁగ నీకరుణాకటాక్ష మె
ట్లిచ్చెదొ నాకు నేఁడు పరమేశ్వరి! యోయలమేలుమంగ నీ
మచ్చిక నంచు నీతరుణి మన్నన నే నినుఁ గంటి నీకు నా
బచ్చెనమాట లేమిటికిఁ బ్రాఁ తిదె చూడఁగ వేంకటేశ్వరా!
55
ఉ. ఎచ్చరికమ్ము పాదములు నిందిరసింధురయాన తమ్మిపూ
నెచ్చెలి క్రొత్తక్రొత్తపలునిగ్గులతో నలమేలుమంగ నీ
వచ్చిన దాఁక నీవిభుఁడు వంచిన మోమును నెత్తఁడంచు నీ
మచ్చిక యింతి నింతులు మమత్త్వము నెంతురు వేంకటేశ్వరా!
56
చ. కనకపుఁబీఠి నెక్కి రతికాంతశరాకృతి నీవు వీథులం
జనునెడ నీదు చెంగటఁ బ్రసన్నతతో నలమేలుమంగ కాం
చననవకింకిణీరవము సన్నపుఁదాళగతి\న్‌ రచింపఁగాఁ
గనుఁగవ మోడ్చి మోడ్చి రతిఁ గౌఁగిటఁ జేర్తువు వేంకటేశ్వరా!
57
చ. ఒఱపగుమీ విహారతతు లుప్పనబట్టెలు బిల్లటీపు ల
చ్చెరువుగ బల్లకోటులు ప్రసిద్ధిగ నయ్యలమేలుమంగకున్‌
మెఱుపులు ముచ్చటల్‌ రతులమ్రొక్కులుఁ దక్కులు వచ్చి వచ్చి మీ
చిఱునగవుం బ్రమోదములు చెక్కులనొక్కులు వేంకటేశ్వరా!
58
ఉ. చక్కెర బొమ్మ చెక్కులనె సానలు పట్టిన పువ్వుటమ్ములో
గ్రుక్కినజవ్వనంబు పెనుగుబ్బలో శ్రీయలమేలుమంగ నీ
వక్కునఁ జేర్చి పట్ట సకలాధిప సౌఖ్యము నీకు నబ్బెఁగా
కెక్కువ లంటు కందువల యింపుల సొంపుల వేంకటేశ్వరా!
59
చ. పరిమళముం బ్రభావము శుభస్థితి నిత్యవిభూతి విభ్రమ
స్ఫురణము దివ్యవైభవము భోగము శ్రీయలమేలుమంగ నీ
యురమున నంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ
వరవనితాశిరోమణి నవారణఁ గొల్తురు వేంకటేశ్వరా!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEshvara Satakamu - vEMkaTEshvara shatakamu - annamayya - annamAchArya - ( telugu andhra )