శతకములు వేంకటేశ్వర శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య
చ. తగు నలమేలుమంగకును దన్మయమందెడునీకు మేనిలో
బగటులు బచ్చిమాటలను బచ్చెనయెచ్చరికల్‌ వివేకముల్‌
మొగముల లేఁతనవ్వులను మోవులనాటులుతమ్మితూటులు\న్‌
జగడపుఁబొందులు\న్‌ రతులసంపదవిందులు వేంకటేశ్వరా!
71
చ. సరి నలమేలుమంగకును జక్కనిమీకును మీకుమీకు లో
నరుదుగ నేకతస్ఫురణ నమ్ముడు వోయితి రొక్కరొక్కరు\న్‌
ఇరువురు నింక నేటితెలి వెక్కడినేరుపు లేటిసైరణల్‌
గిరపులపుచ్చె మేనఁ బులకింతలు వింతలు వేంకటేశ్వరా!
72
చ. ఒకయలమేలుమంగ మహిమోన్నతిఁ జిక్కితి యోగలీలచేఁ
జికురభరంబు జాఱ నలసె\న్‌ నిఖిలోన్నతుఁ డంచు నీకృప\న్‌
బ్రకటములైన కాంత ... ... యింతురు శీతల క్రియ\న్‌
మొకముల నిగ్గు దేఱఁగను ముచ్చటలాడుచు వేంకటేశ్వరా!
73
చ. నగ వలమేలుమంగకును నాటవవల్కలు నీకు మాటల\న్‌
బగ డలమేలుమంగకును బచ్చెనగర్వము నీకుఁ జూపుల\న్‌
జిగి యలమేలుమంగకును శ్రీమల వేడుక నీకు నిట్ల పో
మిగిలిన మోహసంపదలు మీరును మీరును వేంకటేశ్వరా!
74
ఉ. ఈయలమేలుమంగ మణిహేమకటీరశనాకలాపముల్‌
రాయఁగఁ రాలుఁ బైఁడిపొడి రంతులు మీఱినవజ్రపుంబొడి\న్‌
శ్రీయలరారుకొప్పునఁ బ్రసిద్ధిగ రాలెడు కమ్మపుప్పొడి\న్‌
నీయనుఁగుంగవుంగిటికి నిచ్చె వసంతము వేంకటేశ్వరా!
75
ఉ. ఓయలమేలుమంగ యిది యొక్కటిపో జగదేక భర్తకు\న్‌
బాయనినీకునుం గడమ ప్రాణము ప్రాణము నేకమాయె నీ
కాయము కాయముం గలసెఁ గౌఁగిటకాంక్ష యటంచు నీసతి\న్‌
బ్రాయము నిండుజవ్వనముఁ బల్మఱు మెత్తురు వేంకటేశ్వరా!
76
చ. ఇతఁ డలమేలుమంగ విభుఁ డీతఁడెవో కలశాబ్ధికన్యకు\న్‌
సతతముఁ జిత్త మిచ్చిన రసజ్ఞుఁడు ప్రాజ్ఞుఁడు సర్వవైభవో
న్నతుఁడు రమాసతీ ప్రియుఁడు నందకశార్ఙ్గధరుం డటంచు ని
న్నతివలు మెచ్చి మెచ్చి కొనియాడుదు రెప్పుడు వేంకటేశ్వరా!
77
ఉ. మాయలమేలుమంగ చలమా యలయించెద వెంతసేసిన\న్‌
దోయజగంధి నీకు మతితోడనె తక్కిన దల్క నోపు నా
చేయఁగ నేర్చుచేఁత లివె చేయుదుగాక లతాంతసాయకుం
డీయెడఁ జేయు వేదన లకిన్నియుఁ దోడుగ వేంకటేశ్వరా!
78
చ. మతి నలమేలుమంగకును మంతనమాడెడు నీవిలాసముల్‌
తతిఁ దలపోఁతలై సురతతాండవసంభ్రమలీలలై సమం
చిత సరసప్రసంగములు చిమ్మనిదొంతరలై ప్రియంబులై
వితతమనోజవిద్యల నవీనము లైనవి వేంకటేశ్వరా!
79
చ. కసిగలచూపు చిమ్ముదును కంకణహస్తము సాఁచి కుంచెచే
విసరకు రమ్మనంగ వడి వెన్నెలమోమున ముద్దుగుల్కెడి\న్‌
రసికున కంచుఁ జక్కనిపురంధ్రిని నీయలమేలుమంగతో
ముసిముసినవ్వు నవ్వుదురు ముచ్చటలాడుచు వేంకటేశ్వరా!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEshvara Satakamu - vEMkaTEshvara shatakamu - annamayya - annamAchArya - ( telugu andhra )