శతకములు వేంకటేశ్వర శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య
చ. తుఱు మఱవీడెఁ బయ్యెదయుఁ దోడనె జాఱె మెఱుంగు ఱెప్పల\న్‌
బరవశభావ మేర్పడియెఁ బాయక నీ వలమేలుమంగ నీ
వరునిఁ దలంచితో యనుచు వాసనమేనుల దేవ కామినుల్‌
సరగున నీలతాంగి కుపచారము సేతురు వేంకటేశ్వరా!
91
ఉ. రాజసలీల నన్నును గరంబునఁ బట్టకు చూప వేల నీ
తేజము నాకటంచు సుదతీమణి శ్రీయలమేలుమంగ ని
న్నీ జగదేకనాయకుని నింపొలయించుచు సారెసారెకు\న్‌
జాజులకొప్పువీడ సరసంబున వీచును వేంకటేశ్వరా!
92
ఉ. చక్కదనంబు రాశి నునుసానల\న్‌ బట్టినపువ్వుటమ్ములోఁ
జక్కెర నించి చేసిన రసస్థితి శ్రీయలమేలుమంగ నీ
మక్కువఁ జిక్కి మాతలభ్రమం దగులై కలవంత నిట్ల నీ
వక్కుఁనఁ జేర్పఁగా నలరె నన్నువ కౌఁగిట వేంకటేశ్వరా!
93
ఉ. మానవతీశిరోమణికి మంజులవాణికి మోవితేనియల్‌
కానిక లిచ్చినాఁడవట కౌఁగిట నాయలమేలుమంగకు\న్‌
మీనచకోరనేత్రి నిను మెచ్చి మదంబునఁ గౌఁగిలించి నీ
పానుపుమీఁది చేఁత లివి పచ్చితలంపులు వేంకటేశ్వరా!
94
చ. ధళధళ మించు కన్నుఁగవ తమ్ముల మిమ్ములఁ జూపు చిమ్మిన\న్‌
గళవళమందకుండుదురె గ్రక్కున శ్రీయలమేలుమంగకు\న్‌
సళువుల నవ్వుఁ గొంత నునుసోనలగర్వముఁ గొంతనవ్వుఁగా
కెలపులఁ గొంతకొంత పులకింతలు వింతలు వేంకటేశ్వరా!
95
ఉ. దర్పక రాజ్యసంపదలు తన్మయకోటులు రాగిలోకసం
తర్పణముల్‌ లతాధరసుధాపరిధానము లాననవ్రతుల్‌
కర్పురగంధసౌఖ్యములు గ్రక్కున శ్రీయలమేలుమంగకు\న్‌
మార్పడు దేహసంగతుల మర్మిపుఁజేతలు వేంకటేశ్వరా!
96
ఉ. అంబరమెల్లఁ జంద్రమయ మైనటులామదనాంకముల్‌ మెయి\న్‌
బంబిన నేడ వంచు సిరి పల్కిన నయ్యలమేలుమంగ పా
దంబుల యానవెట్టితివి తమ్మియిగుళ్లని నీకు బొంకులే
నెంబళమాయె నెవ్వరికిఁ జెల్లవు రంతులు వేంకటేశ్వరా!
97
చ. చెఱఁగులు చూపి క్రొవ్విరులు చిందెడు తేనెలు నాల్గువంకల\న్‌
వఱదలువాఱె ఘర్మములు వాహినులై యలమేలుమంగతోఁ
గఱఁగుచు నీవు కౌఁగిట సుఖస్థితిఁ గూడుచు బంధుసంగతి\న్‌
దెఱ దిగనేసి వేడుకలు తెప్పలఁ దేలఁగ వేంకటేశ్వరా!
98
ఉ. వాలికనేత్రపద్మములు వంచినయావదనంబు పద్మినీ
పాల జనింపనందుననె పద్మినియై యలమేలుమంగ గో
పాలకచక్రవర్తి నినుఁ బాయనికౌఁగిట భోగలీలఁ బాం
చాలునిఁ జేసె పుష్పశరశాస్త్రవిదగ్ధుని వేంకటేశ్వరా!
99
ఉ. అమ్మకుఁ దాళ్లపాకఘనుఁ డన్నఁడు పద్యశతంబుఁ జెప్పెఁగో
కొమ్మని వాక్ప్రసూనములఁ గూరిమితో నలమేలుమంగకు\న్‌
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్‌
సమ్మది మంది వర్ధిలను జవ్వన లీలల వేంకటేశ్వరా!
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEshvara Satakamu - vEMkaTEshvara shatakamu - annamayya - annamAchArya - ( telugu andhra )