శతకములు వృషాధిప శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. ఉద్ధతభక్తవృద్ధ! వినుతోత్తమ సిద్ధపరీత జంగమ
శ్రద్ధ! సదాత్మశుద్ధ! గుణరాజిసమృద్ధ! విముక్తపాశస
న్నద్ధ! మహాప్రసిద్ధ యగుణ త్రయబద్ధ! శరణ్యమయ్య! భా
స్వద్ధత చిత్ప్రబుద్ధ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
31
ఉ. నందితభక్తబృంద! యవినాశిరదాంశు ముఖారవింద! సా
నంద వినీతికంద! కరుణామకరంద! రసోపలాలిత
స్కంద! యుదాత్త భక్తి తరుకంద! యశోజితకుంద! నాకరా
డ్వందిత! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
32
ఉ. లౌల్యపరాయణాత్మ గుణలౌల్య! యమూల్య సదోపయుక్త ని
ర్మాల్య! వినీతికల్య! యసమానదయా రసకుల్య! నిత్యనై
ర్మల్య! యమూల్య! దుష్టజనమానసశల్య! పదాబ్జలబ్ధ కై
వల్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
33
చ. గురుపద సద్మ సద్మ! యవికుంఠిత జంగమశీలఖేల! సు
స్థిర మృదుపాదమోద! సముదీర్ణ విశేషమహత్వ తత్త్వ! ని
ర్భర భుజశౌర్య ధుర్య! పరిరంభితభక్తి కళత్ర గోత్ర! మ
ద్వరద శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
34
చ. భువన హితార్థ తీర్థ! భవభూరుహ శాతకుఠారధార! గౌ
రవ సముదాత్తవృత్త! యనురాగ రసామృతసారపూర! శాం
భవమయ వేదబోధ! శివభక్తహృదబ్జ వికాసభాస! దే
వ వరద కావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
35
చ. వినుత నవీనగాన గుణవిశ్రుత భక్తవిధేయకాయ! య
త్యనుపమగణ్యపుణ్య నయనాంచలదూర భవోపతాప! స
ద్వినయ వికాసభాస సముదీర్ణ శివైక సుఖైకపాక! దే
వ నను భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
36
ఉ. అంచిత భక్తియుక్త! యసహాయ విశృంఖల వీరపూర! ని
శ్చంచలశైవభావ! శ్రిత జంగమపాదకిరీట కూట! హృ
త్సంచిత సత్త్వ తత్త్వ! దురితవ్రజశైలకదంబశంబ! ని
ర్వంచక నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
37
ఉ. నిర్గతధర్మ కర్మ! యవినీత పునర్చవ యంత్ర తంత్ర! దు
ర్మార్గ విహీనయాన! గుణమాన్య మహావృషసామ్య! సౌమష
డ్వర్గ విరక్త శక్త! మదడంబర వర్జిత వేషభూష! నీ
వర్గమునేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
38
చ. సరసవచస్క! నిర్మలయశస్క! శివైక్యమనస్క! భక్తహృ
త్సరసిజగేహ! క్లుప్తభవదాహ! దయాపరివాహ! చిత్సుఖో
త్తర నిజశిల్ప! భక్తపరతల్ప! మహావృషకల్ప! మన్మనో
వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
39
చ. హర సమసౌఖ్య! యాదివృషభాఖ్య! పురాతనముఖ్య తత్త్వవి
త్పరిషదుపాస్య! వీతగుణదాస్య! త్రిలోకసమస్య! తార్కికో
త్కర జయశౌండ! దీర్ఘభుజదండ! మహాగుణషండ! మన్మనో
వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vR^ishhAdhipa shatakamu ( telugu andhra )