వచన సాహిత్యము పీఠికలు మధురకవితలు

మధురకవితలు
"సుగ్రీవ విజయము" యక్షగానము కు పీఠిక
- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి

ప్రాచీనాంధ్ర లక్షణకర్తలు తెలుఁగుఁగవిత్వమును 'ఆశు, మధుర, చిత్ర, విస్తరము' లనుపేళ్లఁ జతుర్విధముల విభజించిరి. యక్షగానాదు లందులో మధురకవిత్వమునఁ జేరును.

"మధురకవిత్వంబన్నది నాటకాలంకారంబులు, కళికోత్కళికలు, విభక్త్యధిదేవతోదాహరణములు, సప్తతాళనటనలు, నట్టొట్లు, గీతప్రబంధంబులు, చతుర్భద్రికాష్టభద్రికలు, బిరుదావళి, నామావళి, భోగావళి, రంగఘోష, జయఘోష, త్యాగఘోష, చతురుత్తరసంఘటనలు, యక్షగానంబున వెలయు పదంబులు, దరువులు, నేలలు, ధవళంబులు, మంగళహారతులు, శోభనంబులు, నుయ్యాలజోలలు, జక్కులరేకుపదంబులు, చందమామసుద్దులు, అష్టకంబులు, ఏకపద ద్విపద త్రిపద చతుష్ప దాష్టపదలు నివి యాదిగాఁగల్గు నన్నియు."
     (- లక్షణ దీపిక)

మధురకవితలు ప్రాయికముగా భాష, భావము, ఛందము దేశిగా నుండుటచే సంగీతసంస్కారము గలిగిన సామాన్యజనుల నాలుకలమీఁద నాట్యమాడునవిగా నుండును, గాన తొలుత నవియంతగా లిపికెక్కకపోయెను. సంస్కృతప్రాయ రచనలుగల చిత్రవిస్తరకవితల ప్రాబల్యమునఁ గూడ వానికి సత్కవితలలోఁ బరిగణన మంతగా లేకపోయెను. ఇటీవల కవులుగా పురాణప్రబంధరచయితలే పరిగణింపఁబడుచుండిరి గాని మధురకవితా రచయితలు లెక్క కెక్కకున్నారు. ఆంధ్రవాఙ్మయ వృక్షమున ముఖ్యమయిన మధురకవితాశాఖ యిందాఁక సుపరిశీలనము లేకయే యున్నది. ఇక్కడ నాకిప్పుడు దేశి నాటకము లనఁదగిన యక్షగాన రచనముల ప్రశంసయే ప్రసక్తమగుటచే వాని పుట్టుపూర్వోత్తరములఁ గూర్చి మాత్రమే నాకుఁ గోచరించిన విషయములఁ గొన్నింటి వివరింతును.

దేశిదృశ్యరచనలు

యక్షగానము లన్నపేరుగల దృశ్యరచనలు నన్నయాదుల కాలమున నున్నవనుటకుఁ బ్రబలాధారములు గానరావు; కాని యానాఁ డేవో కొన్ని దేశిదృశ్య రచనము లున్నవని మాత్రము గుర్తింపనగును. నన్నయ కిన్నూఱేండ్లకుఁ దర్వాత నున్న పాల్కురికి సోమనాథుఁ డిట్లు చెప్పినాడు:

"భ్రమరులు జాళెముల్‌ బయనముల్‌ మెఱసి
రమణఁ బంచాంగపేరణి యాడువారు
ప్రమథపురాతన పటుచరిత్రములు
క్రమమొంద బహునాటకము లాడువారు
లలితాంగ రసకళాలంకారరేఖ
లలవడ బహురూప మాడెడువారు
* * *
అమరాంగనలు దివి నాడెడు మాడ్కి
నమరంగ గడలపై నాడెడువారు
ఆ వియద్గతి యక్షులాడెడు నట్టి
భావన మ్రోకులపై నాడువారు
భారతాది కథలు చీరమఱుఁగుల
నారంగ బొమ్మల నాడించువారు
కడు నద్భుతంబుగఁ గంభసూత్రంబు
లడరంగ బొమ్మల నాడించువారు
నాదట గంధర్వ యక్షవిద్యాధ
రాదులై పాత్రల నాడించువారు
"
    (- పండిత ప్రకరణము: పండితారాధ్య చరిత్రము)

పై ద్విపదలందు, నేఁటి వీథినాటకములు, దొమ్మరాటలు, తోలుబొమ్మలాటలు మొదలగునవి పేర్కొనఁబడినవి. ఇట్టి సంప్రదాయములు వీనిఁ బేర్కొన్న సోమనాథుని కిన్నూఱేండ్ల పూర్వకాలమునఁ గూడ నుండుట సంభావ్యమే. తెలుఁగునకు సాటిభాషలగు ద్రవిడ కర్ణాటభాషల పద్ధతులను బట్టియుఁ దెలుఁగులో నిప్పు డుపలభ్యమానము లగుచున్న కొన్ని ప్రాచీన దృశ్యరచనముల తీరులను బట్టియు, ద్రావిడభాషా సామాన్యముగాఁ దొలుత వెలసిన నాటకరచనల స్వరూపము కొంత గుర్తింప వచ్చును.

కురవంజి

తొలుత ద్రావిడభాషలలో వెలసిన దృశ్యరచనములు కురవంజు లనఁబడునవి. ఆంధ్ర కర్ణాట ద్రవిడ దేశముల యరణ్యములలో వసించు నాటవికులు చెంచులు, కురవలు (క్రోవ, కోయ) అనువారు. అందు కురవజాతివారి యంజె (=అడుగు, నృత్యవిశేషము) కురవంజె యనఁబడెను. చిందు, గంతు, గొండ్లి, అంజె, అంగ - ఇత్యాదులు నృత్యవిశేషములు. ఆంధ్రదేశమున బహుకాలమున నుండి శివక్షేత్రములగు శ్రీశైలము, ఇంద్రకీలనగము (బెజవాడకొండ) మొదలగు పర్వతముల మీఁదను, నృసింహక్షేత్రములగు వేదాద్రులు (పెక్కు లున్నవి. మంగళాద్రి, సింహాద్రి, గరుడాద్రి, మాల్యాద్రి, వెంకటాద్రి) మొదలగు పర్వతముల మీఁదను వర్షోత్సవములు (యాత్రలు, జాత్రలు, జాతరలు) జరుగునప్పు డక్కడికి నాగరక ప్రజలు చేరుచుండువారు. వారి వినోదమునకై యక్కడి యాటవికులు రాత్రులందు నృత్యవిశేషములు నెఱపి ధనార్జనము చేయుచుండువారు. అక్కడక్కడి కొరవజాతుల వారు చేయు నృత్యములు కొరవంజు లనఁబడెను. కొరవంజె యన్న పేరు తొలుత వారి నృత్యమునకును, పిదప నృత్యవిశిష్టమయిన వారి చిన్నిచిన్ని గేయరచనలకును, నాపై కురవజాతివారికిని గూడఁ బేరైనది. కురవజాతివారు తొలుతచేయు నృత్య విశేషము కాలక్రమమున నాయాపర్వత ప్రదేశముల స్థలమాహాత్మ్యకథలతోను, శివవిష్ణులీలా కథలతోను మిళితములయి గేయవిశిష్ట నాట్యరూపములను బడసెను. అపుడు, మాయాకిరాతవేషులగు పార్వతీశివుల కథలతోనున్న కిరాతార్జునీయము, నృసింహస్వామి చెంచీతను బెండ్లాడు స్థలమాహాత్మ్య కథలు (చెంచీతకథ) కురవంజులుగా వెలసెను. ఇట్లు వెలసిన యా దృశ్య రచనములు తొలుత నత్యల్పముగా గేయభాగములును విశేషముగా నృత్యమును గలవై యుండెను. అవి సింగి, సింగఁడు అని యిద్దఱు పాత్రములు గలవై సంస్కృత వీథీనాటకములఁ బోలి యున్నవి. సింగి, సింగఁడు సంస్కృత నాటకములలోని నటీనటులవలె నాలుమగండ్రు. వీరిద్దఱే కథాపాత్రము లగుచుందురు. కొన్నింట కథాసంధాయకుఁడు - సంధివచనములఁ జెప్పువాఁడు విదూషకుఁ డనఁదగినవాఁడు. మూఁడవపాత్రము కోణంగి యనువాఁడు (పిదప చోడిగాఁడు) కాన నగును. కోణంగి సంస్కృత నాటకములలోని విదూషకస్థానీయుఁడగుట స్పష్టముగా గానవచ్చును. సంస్కృతనాటకములలోని ధ్రువాగానమే కురవంజులలో దరు వనఁబడెను. దేశిరచనలలోనుండి సింగి, సింగఁడు, కోణంగి, దరువు అనునవి నటీనటులుగను విదూషకుఁడుగను ధ్రువగను సంస్కృత నాటకములఁ జేరెనేమో యని కూడ యోజింపఁ దగియున్నది. ఎంతోకాలమిట్లు కొండపట్టులందు సాఁగుచుఁ బెంపొందిన గేయనృత్య సందర్భములు నగరములకు గూడఁ గ్రమముగా వ్యాపించినవి. చెంచులు, కురవలు అడవులనుండి పులిగోళ్లు, అడవిపందికోఱలు, అడవిపండ్లు, వెదురుబియ్యము, వెదురుబెత్తములు, పిల్లనగ్రోవులు, సూదంటురాళ్లు, ఓషధులు, తేనె మొదలగు నాటవికవస్తువులను నగరములకు గొనివచ్చి అమ్ముచు నప్పుడప్పుడు తమ గేయనృత్యవిశేషములను నగరములందును, పల్లెలందును బ్రయోగించుటచే నవి నాగరికదేశములందును వ్యాపించెను.

యక్షగానములు

ఇట్లు నగరములందు నభిరుచిగొల్పిన యాగేయ విశిష్టనృత్యదృశ్యములు జక్కులవారు (యక్షులు, కళావంతులు) తర్వాత నగరములందును బ్రయోగింపఁ జొచ్చిరి. వీరి ప్రయోగములందు దృశ్యమయిన నృత్యాభినయములతో పాటుగా నధికముగా గేయ వచనరూపమైన శ్రవ్యరచనముగూడఁజేరెను. కురవంజులకంటె యక్షగానములు పర్యాప్తముగా శ్రవ్యములగు కవి రచనములు గలవి. వీరి రచనములలో బహువిధములగు పురాణ కథలెల్లఁ జేరినవి. కురవంజులలోని సింగి, సింగఁడు పాత్రలు మాఱి రామ నల హరిశ్చంద్ర సీతా దమయంతీ చంద్రమత్యాది పాత్రలు వచ్చినవి. కాని వీనిలో నాటవిక రచనా సంస్కార సూచకముగా 'ఎఱుకతసాని' పాత్రము వెలసినది. కురవంజులలోని దేశిరచనలకంటె నత్యధికముగా వీనిలో దేశిచ్ఛందోబద్ధములగు గేయరచనలు ప్రబలినవి. రాజసభలలో, దేవోత్సవములలో, ఊరిజాత్రలలో యక్షగంధర్వాది వేషముల ధరించి వేశ్యలు ప్రదర్శించునవి గావునను, నృత్యధర్మములకంటె గేయధర్మము లధికముగాఁ గలవి కావునను నివి యక్షగానము లనఁబడెను. కళావంతులలో నొకతెగకు నేఁడు జక్కులవారను పేరుగలదు. యక్షాదివేషముల ధరించి నృత్యగాన ప్రదర్శనములను గావించుట చేతనే వారి కాపేరు వచ్చియుండవచ్చును. శ్రీనాథుఁడు క్రీడాభిరామమున జక్కులవారిని గూర్చి కొంతప్రశంస నెఱపినాఁడు.

సీ.
కోణాగ్ర సంఘర్ష ఘుమఘుమధ్వని తార - కంఠస్వరంబుతో గారవింప
మసిబొగ్గు బోనాన నసలుకొల్పినకన్ను - కొడుపుచేఁ దాటించు నెడప దడప
శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ - జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ
గిల్కు గిల్కున మ్రోయు కింకిణీ గుచ్ఛంబు - తాళమానంబుతో మేళవింప
రాగముననుండి లంఘించు రాగమునకు - నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్ల
కామవల్లీ మహాలక్ష్మి కైటభారి - వలపు వాడుచువచ్చె జక్కులపురంధ్రి.

అప్పకవి యక్షగానలక్షణము నిట్లు చెప్పినాఁడు.
సీ.
తుద నేడులఘువులు తొలఁగించి చదివినఁ - ద్రిపుటకు వృషభగతి పదయుగము
లలిఁ గడపల నొక్కలఘువు మానిన జంపె - మను ద్విరదగతి సమపదయుగము
గురుతగు రచ్చెరకుఁ దురగవల్గనా - హ్వయ మేకతాళి యామధురగతికి(?)
నంఘ్రి కిర్వదినాలు గాటతాళమున మాత్ర - లోలి విశ్రాంతి పద్నాలుగింటఁ
దెలియ నర్థంబు నర్ధచంద్రికలు వీలు - యక్షగాన ప్రబంధంబు లతుకవచ్చు
రగడభేదంబు లివియండ్రు రసఁ గవీంద్రు - లవిత నిజసేవకస్తోమ, యబ్ధిధామ.

పై పద్యమునుబట్టి చూడఁగా యక్షగానములందలి ప్రధాన గేయ రచనములు దేశిరచనలగు రగడలలోఁ గొంతమార్పు జరిపి - త్రిపుట, జంపె, ఏక, ఆట అను తాళముల కనుగుణముగాఁ గల్పింపఁ బడినవిగాఁ గానవచ్చును. అప్పకవి రగడవికార రచనములను తాళములపేరనే పేర్కొనెనుగాని వానికి పేరులు వేఱె తెలుపలేదు. అప్పకవి పేర్కొన్న యీరచనములే కాక యక్షగానములలో నింకను ననేక విధములయిన దేశిరచనములు చేరినవి. ఏలలు, జోలలు, సువ్వాలలు, ఆరతులు, ధవళములు, చందమామ సుద్దులు, వెన్నెలపదములు, విరాళిపదములు, తుమ్మెదపదములు, గొబ్బిపదములు, కోవెలపదములు, చిలుకపదములు, అల్లొనేరెళ్ళు, సీస - కందార్థములు, త్రిభంగులు, ద్విపదలు, త్రిపదలు, చౌపదలు, షట్పదులు, మంజరులు, జక్కులరేకులు, మొదలగునవి.

యక్షగానము లిట్లు వెలసినను ప్రాచీనములయిన కురవంజి రచనములును యక్షగాన రచనా విధాన సంకలితములై ఈ కాలమున గూడఁ గొన్ని సాఁగుచునే వచ్చినవి. దేవోత్సవ రాజాస్థానాదులం దిట్లు వేశ్యలచేఁ బ్రదర్శింపఁ బడుచున్న యక్షగానములు పెంపొందుచుండు నీకాలమున, దక్షిణదేశమున విజయనగరరాజ్యమున కుపశాఖలుగా తంజావూరు మధురరాజ్యము లాంధ్రనాయకరాజుల పరిపాలనమున వెలసినవి. ఆంధ్రదేశమునందును, దక్షిణదేశమునందును ఈకాలమున యక్షగానరచనము మిక్కిలి ప్రబలఁ జొచ్చెను. ఇవి యిట్లు కళావంతులచేతఁ బ్రదర్శింపఁబడుచున్నవౌట గొఱఁతగాఁ గనిపట్టియో యేమోగాని, కృష్ణాతీరమునందలి కూచిపూఁడిగ్రామమున సిద్ధేంద్రుఁడను యోగి యొకఁడు భాగవతకథలను పారిజాతము, గొల్లకలాపము మొదలగుపేళ్ళతో యక్షగానములుగా రచియించి శాస్త్రీయమయిన భరతనాట్య సంప్రదాయములకు రక్షగా, స్త్రీనిస్సహాయముగా, నాయూరిబ్రాహ్మణుల చేతనే ప్రదర్శనము చేయింప నేర్పాటుచేసెను. ఆయూర జన్మించిన బ్రాహ్మణుఁ డెవ్వఁడుగాని, ఒక్కతూరి యైనను, యక్షగాన ప్రదర్శనమున స్త్రీవేషమును ధరించి తీరవలెననియు, అది వారి కులాభ్యుదయ హేతువనియు కూడ శాసించెనట. నేఁడు కూడ కూచిపూఁడి బ్రాహ్మణులు శాస్త్రీయమయిన భరతనాట్యముతో భాగవతకథలను ప్రదర్శించువారుగా నున్నారు. ఈ సంప్రదాయము వెలసిన పిదపనే తత్ప్రదర్శకులకు భాగవతులనియు, తద్రచనములకు ఆటభాగవతము లనియుఁ బేరయ్యెను.

ఆటభాగవతములు

ఈ భాగవతకథలలో పారిజాతహరణకథ హృద్యతరమగుటచే దానికిఁ బ్రచార మెక్కువయ్యెను. అది హృద్యతర మగుట కందలి సవతుల కయ్యపుఁబట్టు ప్రధాన కారణము. దీనినిఁ బట్టి యక్షగాన సామాన్యమునకుఁ బారిజాతము లనియుఁ బేరయ్యెను. ఏ యక్షగానముఁ బ్రదర్శించినను అందు సవతుల కయ్యపుఁ బట్టునకుఁ బ్రసక్తి గల్పించుటయో లేక, పారిజాతమునందలి తత్కథాఖండమునే స్వతంత్రముగాఁ బ్రదర్శించుటయో పిదప నేర్పడెను. ఈ సవతుల కయ్యపు కథ పట్టు హృద్యతరమగుటచేఁ బ్రబంధకవులను గూడ నిది వలపించెను. కళాపూర్ణోదయమున పింగళి సూరన్న పారిజాత కథలోని సవతుల కయ్యపుఁ బట్టు ని ట్లనుకరించెను.

అంతమదింపకువే యని పల్కిన నంతమదింపకువే యనుచు\న్‌
గంతులడంచెద లెమ్మనిపల్కిన గంతులడంచెద లెమ్మనుచు\న్‌
రంతుల నేమి ఫలంబని పల్కిన రంతుల నేమి ఫలంబనుచు\న్‌
బంతము చూడఁగదే యని పల్కినఁ బంతము చూడఁగదే యనుచు\న్‌.
సీ.
ఒట్టుసుమీయన్న నొట్టుసుమీయంచు - నేమేమియనిన నేమేమియనుచుఁ
గానీగదేయన్నఁ గానీగదేయంచు - నింకేలయనిన నింకేలయనుచు
నోసిపోవేయన్న నోసిపోవేయంచు - నౌనంటిననిన నౌనంటిననుచు
మఱువకుమిదియన్న మఱువకుమిదియంచు - నీవెంతయనిన నీవెంతయనుచు
నొకతె మగనికి నాసించు టొప్పదనిన - నొకతెమగనికి నాసించు టొప్పదనుచుఁ
బట్టియాడె నా రంభతోఁ బ్రథమరంభ - ప్రియుఁడు నిలుమన్న నిలువక పెద్దరొదగ.
    (కళా. అ. ౩ - ౧౯౫,౧౯౬)

ఆంధ్రదేశమున వెలసిన యీ కూచిపూఁడి భాగవతముల ప్రయోగ వైశారద్యము దక్షిణదేశమునకుఁ గూడ వ్యాపించినది. ఆనాఁడు కూచిపూఁడి భాగవతుల యాటభాగవత సంప్రదాయము నేఁటికిని దక్షిణదేశమున గలదు. దక్షిణదేశమున బ్రాహ్మణులు పురుషులే నేఁడును భాగవత యక్షగానములను దెలుఁగు వానినే ప్రదర్శింతురు. ఆంధ్రదేశమున వెలసిన యక్షగానము లిన్నూటికిఁ బైచిలుకు పరిగణింపఁ బడినవి. వీని ననుసరించి వెలసిన దక్షిణదేశపు యక్షగానములు మున్నూటికిఁ బైచిలుకు గలవు. భక్తాగ్రేసరుఁ డనఁబడిన శివనారాయణతీర్థులవారు (కృష్ణలీలాతరంగిణి కర్త), త్యాగరాజస్వామివారు పారిజాతాపహరణమని, నౌకాచరితమని భక్తిరసభరితము లయిన యక్షగానములను రచించిరి. భగవత్కథలతోఁ బురాణకథలతోఁ బెంపు వెలసిన యీ భాగవత యక్షగానములు తత్ప్రదర్శనములు నాయకరాజుల కాలమునను, మహారాష్ట్ర రాజుల కాలమునను మితిమీఱి యాయారాజుల శృంగార జీవిత వర్ణనాత్మకములుగాఁ గూడ రచితములై ప్రదర్శితము లగుచు వచ్చినవి. దిక్ప్రదర్శనలుగా కొన్ని కురవంజులను యక్షగానములను భాగవతములను బేర్కొను చున్నాను.

"కిరాతార్జునీయము, శ్రీగిరికురవంజి, గంగాగౌరీవిలాసము, అలమేలుమంగావిలాసము, ఎఱుకలవేషకథ, కపోతవాక్యము, గరుడాచలము, త్రిపురసంహారము, దారువనక్రీడ, నలచరిత్ర, నిజలింగచిక్కయ్యకథ, కన్యకాచరిత్ర, పారిజాతాపహరణము, పార్వతీపరిణయము, మృత్యుంజయవిలాసము, శివపారిజాతము, సముద్రమథనము, విజయరాఘవ చంద్రికా విహారము, రఘునాథ నాయకాభ్యుదయము, ..."

భిన్న పాత్రవేషధారణము లేక సింగ, సింగఁడు (కొన్నింట కోణంగికూడ) పాత్రలతో వెలసిన వీథినాటకములనఁ బడు కురవంజులు యక్షగానరూపమునఁ బెంపొందినపుడు వేషభేదముగల పాత్రభేదములును బెంపొందెను. ఇట్లు పాత్రబాహుళ్యముకూడ గలవైన యక్షగానములందు సంధివచనములఁ జెప్పు కోణంగి లేక సూత్రధారుఁడు 'వచ్చెనమ్మా సత్యభామ' ఇత్యాది విధములను, 'అంతట హనుమంతుఁ డేమనుచున్నాఁడు' ఇత్యాది విధములను, బాత్రములఁ బేర్కొనఁగా తద్వేషధారులు వచ్చి తమ యాటపాటలు నెఱపుదురు. ఇట్లింకను పెంపొందిన యక్షగానములు తెరలు, రంగభేదములు కలవయి కొంత సంస్కృత నాటకచ్ఛాయయుఁ జొప్పడఁగా నాటకములను పేరను గూడఁ బదునెనిమిదవ శతాబ్ది నాఁటికిఁ బేర్వెలసినవి.

ఇంచుమించుగాఁ దెలుఁగున నేనూఱింటిదాఁక లెక్కింపఁ దగియున్న యక్షగానములలో సుగ్రీవవిజయ మొక ప్రశస్త కృతి. దీని కర్త కందుకూరి రుద్రకవి. ఈతఁడు విశ్వబ్రాహ్మణ వంశ్యుఁడు. కందుకూరికిఁ జేరువనే పాలేటియొడ్డున గల చింతలపాలె మను గ్రామ మీతని యూరు. ఆయూరనే తద్వంశ్యు లిప్పటికిని గలరు. రుద్రకవి మూలమున నావంశమువారికి 'కవివారు' అని యుపనామ మేర్పడినది. ఆవంశమున రుద్రకవికిఁ దర్వాతఁ బలువురు రుద్రకవి నామకు లుండిరి. తొలుతటి రుద్రకవి కృష్ణదేవరాయల యాస్థానమున నష్టదిగ్గజములనఁబడు కవు లెనమండుగురిలో నొక్కఁడుగా నుండెనట. మల్కిబ్రహీం కాలమునఁ గూడ నొక రుద్రకవి యుండెను. ఇబ్రహీంకాలమునఁగల రుద్రకవియే కృష్ణరాయల కాలమున బాలుఁడుగా నుండఁబోలును. చింతలపాలె మను గ్రామమును మల్కిబ్రహీం ప్రభువే రుద్రకవి కొసఁగెను.

అద్యాశీతిచతుశ్శతాధిక సహస్రంవై శకాబ్దాగతాః
అస్మి\న్‌ శ్రీజయవత్సరే జయతిథౌ మాసేచ మాఘే తథా
పంచమ్యాం ద్వయతింత్రిణీ జనపదం రుద్రస్యవిద్వత్కవేః
ప్రీత్యా శ్రీయిభరామభూపతి రదాత్‌ క్షోణీధరాఖండలః॥

ఇబ్రహీం ప్రభువిచ్చిన యగ్రహారమును నిన్నమొన్నఁటి దాఁక తద్వంశ్యులే యనుభవించుచుండిరి.

సుగ్రీవ విజయము రచించిన రుద్రకవియే నిరంకుశోపాఖ్యానమని గ్రంథాంతరము రచియించెను. రెండు గ్రంథములందును గర్తకు కందుకూరు జనార్దన భక్తత్వము, పెదలింగనార్య పుత్త్రత్వము గలదు గావున్న రెండు గ్రంథములు నొక్కనివే యగుట స్పష్టము. నిరంకుశోపాఖ్యానమున,

"చేరి కన్నడభూమి చెఱవట్టు పాశ్చాత్య - నృపతికైనను కొంత కృప దలిర్చు"

అని సీసచరణ మున్నది. అది విద్యానగరమును దురుష్కులు కొల్లఁగొట్టిన దుస్సందర్భమును దెలుపుచున్నది. విద్యానగర వినాశనము క్రీ. శ. 1568 నాఁడు జరిగినది. కావున నిరంకుశోపాఖ్యాన రచన మటుతరువాత జరిగినదగును. అప్పకవీయమున వినుకొండలో గుంటుపల్లి భాస్కరయ గారి సముఖమున కందుకూరి రుద్రకవి కవితాచర్చ జరిపినట్లు కలదు. మన రుద్రకవి యాతఁ డగునేమో! నిరంకుశోపాఖ్యాన సుగ్రీవవిజయకర్త క్రీ. శ. 1568 ప్రాంతముల వాఁడేని, కొంత తర్వాతి వాఁడేని కాఁగలఁడు. దక్షిణదేశమం దల్పముగా నాంధ్రదేశమం దధికముగా యక్షగానముల రచనములు, ప్రయోగములు సాగుచుండిన కాలమది.

సుగ్రీవవిజయము

శ్రీమద్రామాయణమునఁ గల కథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్ప కాలమున వడివడిగా గంటలలో నడచిన యీకథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుఁడు, సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అను కథాపాత్రముల శీలపు మేలిమినొఱసి మెఱుఁగు తఱుగులు చూపిన యొఱగల్లనఁ దగినది.

తెలుగున గుత్తెనదీవిరామాయణాదు లగు రామాయణ గేయకృతులలో నీసుగ్రీవవిజయపుఁ గథపట్టు చాలహృద్య రచనములతో నున్నది.

"ఎంతపనిచేసితివి రామా! నిన్ను
నేమనందును సార్వభౌమా!
చెంతకిటు రాలేక చెట్లనో దాగుండి
వింతమృగమునుగొట్టు విధమాయెనాబ్రదుకు!"

ఇత్యాది గేయములను పలువురు పాడుచుందురు.

ఈ రుద్రకవి సుగ్రీవవిజయమునుగూడ స్త్రీ వృద్ధ పామరాదులు పలువురు పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును తక్కిన సంధివచనాదులు ఒక్కరిద్దఱు సూత్రధార ప్రాయులు పఠించునట్లును, నీసుగ్రీవవిజయము వీథియాటగా నాడబడుచుండెడిది. ప్రాచీన సంస్కృతనాటకరచయితలు భాసభవభూత్యాదు లీ సుగ్రీవ విజయౌచిత్యమును దమ నాటకములలో విమర్శించిరి. శ్రీరాముని శీలమును శ్రీవాల్మీకి రామాయణ పద్ధతిని సమర్ధించిరి.

భవభూతి "యద్వా కౌశల మింద్రసూనుదమనే తత్రాప్యభిజ్ఞో జనః" యని దీని యౌచిత్యము నించుక చెనకెను. మనరుద్రకవి సంస్కృతాంధ్ర రామాయణకవులు త్రొక్కిన త్రోవనే త్రొక్కెనుగాని, యపూర్వకల్పనాంశము నేమాత్రము నిందు జేర్పలేదు.

ఆయాపాత్రములు ప్రసిద్ధ రామాయణములలో నెట్టి యుక్తి ప్రత్యుక్తులు గలవిగా చిత్రములయ్యెనో ఇందు నదేతీరు గలదు. కాని యిది దేశిరచనముతో గేయరూపమున నుండుట విశేషము. ఇం దీక్రింది గేయరచనలు ప్రశస్తము లయినవి!

"హా సతీమణి! ధర్మచారిణి! హా గుణోన్నత! జనకసుత! నను
     బాసిపోయితి వింతలోనె పద్మనయన!"
"లేఁటి మాయలు మదిని దెలియగ లేక పాపపు రక్కసునిచే
     బోటి! నిను గోల్పడితిని నిఁక నాకేటిబ్రతుకు"
"లలన! నినుఁ గలనైనఁ బాయఁగఁగలన, నీవిటలేక యుండినఁ
     జలనమొందెను నాదు హృదయము జలజనయనా!"
"తరణి కులమున బుట్టి శరచాపములు బట్టి
     తరుణిఁ గోల్పడు కంటె మరణమే మేలు!
నను శౌర్యవంతుఁడని తనపుత్రి నిడినట్టి
     జనకవిభుఁ డీవార్త విని వగవకున్నె!"
"నాయమెఱుఁగక చంపితివి నరనాథ! పాపముఁ గట్టుకొంటివి
     బోయ వింతియె గాక నీవొక భూమిపతివా?"
"శ్రీరామ! నీరామఁ జెఱఁగొన్న రావణుని
     వారధుల ముంచితిని వాలమునఁజుట్టి
ఒకమాట నాకుఁ జెప్పకపోయితివి గాక
     సకలదైత్యుల దున్మి జానకిని దేనె."
"ఆలి చెఱఁగొని పోయినట్టి దశాస్యుఁడుండగ నిర్నిమిత్తము
     వాలినేటికిఁ జంపితివి రఘువంశ తిలకా!
ఇట్టి సాహస కర్మ మెచటికి నేఁగె భరతుఁడు సీమవెడలఁగఁ
     గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడఁ గువలయేశా!
నాయమేటికిఁ దప్పితివి రఘునాథ! జానకితోడనే చెఱఁ
     బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్‌?"

శ్రీరామచంద్రమూర్తి చెట్టుచాటుననుండి వాలిమేనఁ గాఁడనేసిన వాఁడిములుకుల కంటె, నిక్కడ తార ప్రత్యక్షమై నిలుచుండి శ్రీరాముని యంతరంగము నుచ్చిపోవునట్టు ప్రయోగించిన పలుకుములుకులు క్రొవ్వాఁడి గలవి.

ఈలఘుకృతి వీరకరుణరస భరితము. నీతిహృద్యము. స్త్రీ బాల పామరాదులు గూడ పఠింపఁ దగినది.

ఈ యక్షగానమున నీక్రింది దేశిరచనలున్నవి. త్రిపుట, జంపె, కుఱుచజంపె, అర్ధచంద్రికలు, ఆటతాళము, ఏకతాళము, ద్విపదలు, ధవళములు, ఏలలు. అర్ధచంద్రికలు త్రిపుటాది రచనల ఖండరచనలు గాఁబోలును. ఇందలి యర్ధచంద్రిక లెల్ల నొక్క తెఱఁగు నడక గలవిగాక భిన్నగతులతో నున్నవి. సంగీతతాళలక్షణము లెఱిఁగినవారు వాని ప్రభేదములు గుర్తింపవలెను.

కురవంజులు, యక్షగానములు నింకను మంచిరచనములు గలవి కొన్ని యున్నవి. అవియేవేని యీ సుగ్రీవవిజయమువలె సుముద్రితము లైనచో ఆంధ్రమధురకవితా విశేషములను సహృదయు లింక నధికముగా నాస్వాదింపఁ గల్గుదురు.

ఆంధ్ర వాఙ్మయమున విలువగల యక్షగాన విభాగమున సుప్రఖ్యాతమగు నీరుద్రకవి సుగ్రీవవిజయమును శ్రీకపిలేశ్వరపురాధిపతులు, సాహిత్యవినోదులు, శ్రీ బలుసు బుచ్చిసర్వారాయ ప్రభువులు చక్కఁగా ముద్రింపించి యాంధ్రభాషాసాహిత్యవేత్తలకు వేడుకగూర్చిరి. ఇంకను వీ రిట్టి సత్కృతులఁ బ్రకటింప సర్వేశ్వరుఁ డనుగ్రహించుఁగాక.

వేటూరి ప్రభాకరశాస్త్రి

మద్రాసు,
బహుధాన్య మహాశివరాత్రి.

AndhraBharati AMdhra bhArati - vachana sAhityamu - pIThikalu - madhura kavitalu sugrIva vijayamu yakshagAnamu ku pIThika - SrI vETUri prabhAkara SAstri ( telugu andhra )